Tollywood: అమ్మ... అమ్మమ్మ... బామ్మ... నిర్మలమ్మ!
ABN , Publish Date - Feb 22 , 2025 | 02:20 PM
రేడియో నాటికల ద్వారా గొప్ప పేరు సంపాదించుకున్న నిర్మల... చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే అమ్మ పాత్రలలోకి వెళ్ళిపోయారు. అగ్ర కథానాయకులందరికీ అమ్మగా, అమ్మమ్మగా నటించి మెప్పించారు.

ప్రముఖ నటి నిర్మలమ్మ (Niramalamma) గతించి 16 ఏళ్ళయింది. ఇప్పటికీ నిర్మలమ్మ నటించిన అనేక చిత్రాలు బుల్లితెరపై కనువిందు చేస్తూనే ఉంటాయి. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు వంటి హీరోలకు అమ్మమ్మగా, బామ్మగా నటించిన నిర్మలమ్మ అంతకుముందు మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ కు, తరువాతి తరం హీరోలు శోభన్ బాబు, కృష్ణకు కూడా తల్లిగా నటించి మెప్పించారు.
చిత్రసీమలో అందరి చేత నిర్మలమ్మ అంటూ గౌరవం అందుకున్న ఆమె 1943లో 'గరుడగర్వభంగం'లో ఓ చెలికత్తె పాత్రలో తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. తరువాత 1961లో 'కృష్ణప్రేమ'లో రుక్మిణి పాత్రతో మళ్ళీ తెరపై కనిపించారు. అప్పటి నుంచీ నాలుగు దశాబ్దాల పాటు నటిస్తూనే ఉన్నారు. ప్రముఖ రంగస్థల నటుడు జీవీ కృష్ణారావును పెళ్ళాడారామె. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 'భార్యాభర్తలు'లో ఏయన్నార్ కు తల్లిదండ్రులుగా నిర్మలమ్మ, గుమ్మడి నటించారు. ఆ తరువాత దాదాపు 20 చిత్రాల్లో వారిద్దరూ భార్యాభర్తలుగా నటించడం విశేషం! 'మయూరి' చిత్రంతో ఉత్తమ సహాయనటిగా, 'సీతారామరాజు'లో బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు అందుకున్న నిర్మలమ్మ నాటకరంగంలోనూ పలు బహుమానాలు సొంతం చేసుకున్నారు. 2009 ఫిబ్రవరి 19న కన్నుమూసిన నిర్మలమ్మను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరచిపోలేరు.