Nandamuri: యన్టీఆర్ ఫ్యామిలీకి అచ్చి వచ్చిన మార్చి

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:00 PM

మహానటుడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించింది మార్చి నెలలోనే. అంతేకాదు... అదే నెలలో నటుడిగా ఆయన కెరీర్ లో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అలానే బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ కూ మార్చి మాసం అచ్చివొచ్చింది.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్టీఆర్ (NTR) 1982 మార్చి 29వ తేదీన 'తెలుగుదేశం' (Telugu Desam) పార్టీని స్థాపించారు. ఆ నాటి నుంచీ తెలుగునేలపైనే కాదు, కేంద్రంలోనూ పలుమార్లు 'తెలుగుదేశం' పార్టీ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ నాటికీ అదే పంథాలో పయనిస్తోంది... తెలుగుదేశం పుట్టినరోజు ఉత్సవాల్లో యన్టీఆర్ ఫ్యాన్స్ మార్చి మాసంతో యన్టీఆర్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మార్చి నెలలో విడుదలైన నటరత్న యన్టీఆర్ తొలి చిత్రం 'పాతాళభైరవి' (Patala Bhairavi). 1951 మార్చి 15న వచ్చిన 'పాతాళభైరవి'తోనే యన్టీఆర్ సూపర్ స్టార్ గా నిలిచారు. యన్టీఆర్ అనగానే చప్పున గుర్తుకు వచ్చేది ఆయన పోషించిన శ్రీకృష్ణ పాత్ర. ఆయన పూర్తి స్థాయిలో శ్రీకృష్ణ పాత్రలో కనిపించిన తొలి చిత్రం 'మాయాబజార్' (Maya Bazar) కూడా 1957 మార్చి 27న జనం ముందు నిలచింది... అలాగే రామారావు రావణునిగా నటించిన తొలి చిత్రం 'భూ కైలాస్' (BhooKailas) 1958 మార్చి 20న వచ్చింది. ఇక యన్టీఆర్ ను శ్రీరామచంద్రునిగా జనం మదిలో నిలిపిన సినిమా 'లవకుశ' (Lavakusa). తెలుగులోనే తొలి రంగుల చిత్రంగా నిలచిన 'లవకుశ' 1963 మార్చి 29న విడుదలై విజయఢంకా మోగించింది. యన్టీఆర్ నటించిన తొలి కలర్ సోషల్ మూవీ 'దేశోద్ధారకులు' (Desoddharakulu)1973 మార్చి 29న విడుదలయింది. నటరత్న కెరీర్ లో మొత్తం 25 చిత్రాలు మార్చి నెలలో విడుదలయ్యాయి. వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం! ఇలా నటరత్న కెరీర్ లో పలు మైల్ స్టోన్స్ కు మార్చి నెల వేదిక కావడం విశేషం! అలాగే ఆయన 43 ఏళ్ళ క్రితం మార్చి 29న తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేయడం మరింత విశేషంగా నిలచింది.


నటరత్న యన్టీఆర్ కే కాదు ఆయన నటవారసులు బాలకృష్ణ (Balakrishna), జూనియర్ యన్టీఆర్ (NTR Jr.) కు కూడా మార్చి నెల భలేగా కలసి వచ్చింది. బాలయ్య సలీమ్ గా నటించిన 'అక్బర్ సలీమ్ అనార్కలి' 1978 మార్చి 15న రిలీజయింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా సి.రామచంద్ర సంగీతంతో మ్యూజికల్ హిట్ గా నిలచింది. నటునిగా బాలయ్యకు మంచి పేరు సంపాదించింది. యన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత బాలయ్యను సోలోహీరోగా పరిచయంచేస్తూ విడుదలయిన 'సింహం నవ్వింది' మార్చి 3న వెలుగు చూసింది. మరో మహానటుడు ఏయన్నార్ (ANR) తో బాలకృష్ణ నటించిన తొలి సినిమా 'భార్యాభర్తల బంధం' 1985 మార్చి 28న విడుదలై విజయం సాధించింది. ఇక 2014 మార్చి 28న ప్రేక్షకుల ముందు నిలచిన బాలయ్య 'లెజెండ్' (Legend) సినిమా అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రం సౌత్ లోనే అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా నిలచింది.


నందమూరి నటవంశం మూడోతరంలో స్టార్ గా వెలుగొందు తున్నారు జూనియర్ యన్టీఆర్. ఆయనకు కూడా మార్చి నెల అచ్చిరావడం విశేషం! 'స్టూడెంట్ నంబర్ వన్'తో తొలి ఘనవిజయం చూసిన జూనియర్ ఆ తరువాత 2002 మార్చి 28న విడుదలైన తన 'ఆది' (Aadi) సినిమాతో బంపర్ హిట్ పట్టేశారు... అలా జూనియర్ కు ఫస్ట్ బిగ్ హిట్ గా నిలచింది 'ఆది'. ఇక 2022 మార్చి 25న విడుదలైన రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' (RRR) జూనియర్ యన్టీఆర్ ను గ్లోబల్ స్టార్ గానూ నిలిపింది. ఇలా నందమూరి నటవంశానికి భలేగా అచ్చివచ్చిన మాసంగా మార్చి నిలచింది... ఈ విశేషాలను నందమూరి అభిమానులు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాన గుర్తు చేసుకొని పులకించి పోయారు. మరి రాబోయే రోజుల్లో నందమూరి నటవారసులు మార్చి నెలలో ఏ విశేషాలకు తెరలేపుతారో చూడాలి.

Also Read: Narne Nithiin: మూడో సినిమాతోనూ హిట్ కొట్టాడు!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 29 , 2025 | 06:25 PM