Sikandar -Warda Khan: నెటిజన్లూ.. మీరు త్వరగా కోలుకోవాలి..
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:22 PM
‘సికందర్’ చిత్రం అంతంత మాత్రంగానే ఆడింది. దీంతో చిత్ర నిర్మాత సాజిద్ నదియావాలాపై సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన తాజా చిత్రం ‘సికందర్’ (Sikandar). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సల్మాన్ నటించిన గత చిత్రాలు సరిగ్గా ఆడకపోవడంతో ఫ్యాన్స్ అంతా ‘సికందర్’పై నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ సినిమా అయినా తమ హీరోకు బ్లాక్ బస్టర్ ఇస్తుందని భావించారంతా. అయితే ఈ చిత్రం అంతంత మాత్రంగానే ఆడింది. దీంతో చిత్ర నిర్మాత సాజిద్ నదియావాలా (sajid nadiadwala) పై సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ హీరో కెరీర్‌ను నిర్మాత నాశనం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనిపై సాజిద్ నదియాడ్‌వాలా భార్య అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కథ, కథనం, దర్శకత్వం సరిగ్గా లేదని సినీ విశ్లేషకులు విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియా వేదికగా సాజిద్‌ను తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఆయన సతీమణి వార్దాఖాన్ (Warda Khan)స్పందిస్తూ.. అభిమానుల పోస్ట్‌లను రీపోస్ట్ చేశారు. అంతే కాకుండా, వారిని తిడుతూ కామెంట్స్ కూడా పెట్టారు. ‘విమర్శలను ఈవిధంగా రీపోస్ట్ చేస్తున్నందుకు మీకు ఏమాత్రం సిగ్గుగా లేదా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని రిప్లై ఇచ్చారు. తదుపరి మిగతా రిప్లైలను కూడా డిలీట్ చేశారామె.