L3: The beginning: ముళ్ళబాటపై మోహన్ లాల్ తనయుడు

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:51 PM

మోహన్ లాల్ తో పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన 'ఎల్ 2: ఎంపురాన్' వివాదాలలో చిక్కుకుంది. దాంతో 'ఎల్ 3: ది బిగినింగ్' ఉంటుందా ఉండదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సినిమాలో మోహన్ లాల్ బదులు అతని కొడుకు ప్రణవ్ హీరోగా నటించాల్సి ఉంది.

పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan) వివాదం నిదానంగా సద్దుమణుగుతోంది. ఆ సినిమాలోని మెయిన్ విలన్ పేరును మార్చడంతో పాటు పలు పదాలను మ్యూట్ చేయడం, మూడు నిమిషాల నిడివిని ఎడిట్ చేయడమే కాకుండా అభ్యంతరమైన చోట్ల మార్పులు చేర్పులు చేసి సరికొత్త వర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మలయాళంలో 'ఎల్ 2: ఎంపురాన్' కు మంచి స్పందన లభిస్తున్నా, ఇతర భాషల్లో మాత్రం చిత్రానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. కేరళ వారు ఈ కంటెంట్ తో కనెక్ట్ అయినట్టుగా మిగిలిన వారు కాలేదు. దానికి ప్రధాన కారణం ఇది కేరళకు చెందిన పొలిటికల్ డ్రామా కావడం. ఇక ఉత్తరాది వారైతే ఇందులో హిందువులను, జాతీయ పార్టీ బీజేపీని టార్గెట్ చేశారనే ఆవేదనతో సినిమాను తిరస్కరించారు.


'ఎల్ 2: ఎంపురాన్'కు ప్రీక్వెల్ గా 'ఎల్ 4: ద బిగినింగ్' ఉంటుందని ఈ సినిమా చివరిలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపాడు. అయితే... ఇప్పుడీ సినిమా విషయంలో జరిగిన రచ్చ కారణంగా దీనికి ప్రీక్వెల్ ఉండకపోవచ్చునని అంటున్నారు. నిజానికి ఈ ప్రీక్వెల్ ను పృథ్వీరాజ్... మోహన్ లాల్ (Mohan Lal) తో కాకుండా ఆయన కుమారుడు ప్రణవ్ తో ప్లాన్ చేశాడు. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించిన ప్రణవ్ కు 'హృదయం' మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అయినా అతను మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర కథానాయకుడు అబ్ రామ్ ఖురేషీ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి బాల్యం ఎలా గడిచింది, యవ్వన సమయంలో అతను ముంబైలో ఏ చేసే వాడు... అక్కడ నుండి కేరళకు ఎలా వచ్చాడు? అనేదే ప్రధానాంశంగా 'ఎల్ 3: ది బిగినింగ్'ను ప్లాన్ చేశాడు పృథ్వీరాజ్. ఈ పాత్రకు మోహన్ లాల్ వయసు సెట్ కాదు కాబట్టి.... ఆయన కొడుకుతో తీయాలను కున్నాడు. అందువల్లే 'ఎంపురాన్' క్లయిమాక్స్ షాట్ లో అబ్ రామ్ ఖురేషీగా మోహన్ లాల్ బదులు ఇరవై ఐదేళ్ళ వయసున్న వ్యక్తిగా ఆయన కొడుకు ప్రణవ్ ను చూపించారు.


ఎలాంటి వివాదం లేకుండా 'ఎంపురాన్' జనాదరణ పొంది ఉంటే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు జరిగిన వివాదాల కారణంగా 'ఎల్ 3: ది బిగినింగ్' ఉంటుందా? చూస్తూ చూస్తూ మోహన్ లాల్ తన కొడుకును ఈ ప్రాజెక్ట్ లో చేయడానికి అనుమతిస్తాడా? అనే సందేహాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి... ఇన్ డైరెక్ట్ గా మోహన్ లాల్ పై చేసిన విమర్శలను కూడా ఆయన అభిమానులు అంత తేలికగా మర్చిపోయేవి కాదు. అందువల్ల 'ఎల్ 3: ది బిగినింగ్' ఉన్నా... ప్రణవ్ చేస్తాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

Also Read: Kollywood: తమిళనాట సంక్రాంతికి రంజైన పోటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 03 , 2025 | 04:51 PM