NBK: బాలయ్య అభిమానుల అభిమాన నిర్మాత!
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:08 PM
తెలుగు చిత్రసీమలో బాలయ్య, గోపాల్ రెడ్డి కాంబో లాంటిది మరొకటి కానరాదు. ఎందుకంటే ఓ హీరోతో ఒకే దర్శకుని డైరెక్షన్ లో నాలుగు త్రిశతదినోత్సవాలు చూసిన ఏకైక నిర్మాత యస్ .గోపాల్ రెడ్డి.
నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులంతటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఎక్కడా చూడం అంటూ ఉంటారు తెలుగు సినీజనం. తమ హీరో నిర్మాతల్లో వారికి అత్యంత అభిమాన పాత్రుడు ఎవరు అంటే 'భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్' అధినేత యస్.గోపాల్ రెడ్డి (S.Gopal Reddy) అనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య కెరీర్ లో ఫస్ట్ బిగ్ హిట్ గా నిలచిన చిత్రం 'మంగమ్మగారి మనవడు'. ఆ సినిమాను కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించి ఘనవిజయం సాధించారు యస్.గోపాల్ రెడ్డి. ఆ తరువాత బాలయ్యతో గోపాల్ రెడ్డి కోడి రామకృష్ణ దర్శకత్వంలో "ముద్దులక్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమావయ్య, ముద్దుల మేనల్లుడు" వంటి చిత్రాలు నిర్మించారు. వీటిలో 'ముద్దుల మేనల్లుడు' మినహాయిస్తే అన్ని సినిమాలు 300 రోజులు ప్రదర్శితమయ్యాయి. వాటిలో 'మంగమ్మగారి మనవడు' 560 రోజులు, 'ముద్దుల క్రిష్ణయ్య', 'ముద్దుల మావయ్య' చిత్రాలు 365 రోజులు చూశాయి. 'ముద్తుల మేనల్లుడు' అంతగా అలరించలేక పోయింది. ఆ పై బాలయ్య హీరోగా ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో 'మాతో పెట్టుకోకు' మొదలెట్టారు గోపాల్ రెడ్డి. అయితే ఈ చిత్రం తరువాత ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఆ పై 2001లో బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే గోపాల్ రెడ్డి ఓ భారీ జానపదం ఆరంభించారు. అనివార్య కారణాల వల్ల అది పూర్తి కాలేదు.
ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో బాలయ్య, గోపాల్ రెడ్డి కాంబో లాంటిది మరొకటి కానరాదు. ఎందుకంటే ఓ హీరోతో ఒకే దర్శకుని డైరెక్షన్ లో నాలుగు త్రిశతదినోత్సవాలు చూసిన ఏకైక నిర్మాత యస్. గోపాల్ రెడ్డి అనే చెప్పాలి. పైగా బాలయ్యతో గోపాల్ రెడ్డి నిర్మించిన అన్ని చిత్రాలు ఇంగ్లిష్ అక్షరం 'ఎమ్'తోనే మొదలవుతాయి. ఇలాంటి అరుదైన రికార్డు నెలకొల్పిన యస్ .గోపాల్ రెడ్డి అంటే బాలయ్య ఫ్యాన్స్ కు అమితాభిమానం. ఈ నాటికీ గోపాల్ రెడ్డి పేరు తలచుకుంటూనే ఉంటారు బాలయ్య ఫ్యాన్స్.
1985 ప్రాంతంలో బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో యస్. గోపాల్ రెడ్డి 'ముద్దుల క్రిష్ణయ్య' సినిమా షూటింగ్ సమయంలోని ఫొటో ఇది. కడియపులంకలో చిత్రీకరణ సాగింది. బాలయ్యకు ఎడమవైపున యస్.గోపాల్ రెడ్డి ఉన్నారు. ఇక హీరో ఎడమవైపున ఉన్నది కడియపులంక నర్సరీ యజమాని పల్లా వెంకన్న.
Also Read: Nitin: రాబిన్ హుడ్ రేట్లూ పెంచేశారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి