Singeetam Srinivasa Rao: సింగీతం అందించిన కానుక 'ఆదిత్య 369'

ABN , Publish Date - Mar 18 , 2025 | 08:16 PM

కాలంతో పాటు పరుగెత్తడమే కాదు, కొన్నిసార్లు కాలానికంటే ముందుగా ఆలోచించడం ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) అలవాటు

కాలంతో పాటు పరుగెత్తడమే కాదు, కొన్నిసార్లు కాలానికంటే ముందుగా ఆలోచించడం ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) అలవాటు! ప్రస్తుతం సింగీతం వయసు 93 సంవత్సరాలు. ఈ నాటికీ నవతరం నచ్చేలా కథలు చెప్పగలరు. అవకాశం ఇస్తే జెన్ జెడ్ కూడా మెచ్చేలా సినిమాలు తీయగలరు. అందుకే ఈ నాటి కొందరు యువదర్శకులు తాము రూపొందించే చిత్రాల విషయంలో సింగీతం శ్రీనివాసరావు సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి సింగీతం 1991లోనే అంటే ఇప్పటికి దాదాపు 34 ఏళ్ళ క్రితమే భారతీయులకు టైమ్ మిషన్ చూపించారు. కాలయంత్రం కాబట్టి గడియారంలో కొట్టొచ్చినట్టు కనిపించే 3,6.9 నంబర్స్ ను కలిపి సైంటిస్ట్స్ లక్కీ నంబర్ గా పేరొందిన 369ను రూపొందించారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్లే భూమిపై కాలయానం సాగుతూ ఉంటుంది. కాబట్టి తన టైమ్ మిషన్ కు 'ఆదిత్య 369' (Aditya 369) అని నామకరణం చేశారు. ఆ కాలయంత్రం అధిరోహించి వర్తమానం నుండి అటు భూతకాలంలోకి, ఇటు భవిష్యత్ లోకి ఎంచక్కా వెళ్ళొచ్చు అన్నదే సింగీతం మేధలో మెరిసిన ఆలోచన. దానికి అనువుగా కథను రూపొందించుకున్నారు. అందులో తెలుగువారిని ఎంతగానో అలరించిన సాహితీ సమ్రాట్టు, కదనరంగ ధీశాలి అయిన కర్ణాటాంధ్ర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు కాలాన్ని ఎంచుకున్నారు సింగీతం. తెలుగునేలపై ఎంతోమంది రాజులు ఉండగా శ్రీకృష్ణదేవరాయలునే ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. రాయలవారు సాహితీప్రియుడే కాదు స్వయంగా కవి. ఆంధ్ర, కర్ణాటకలోనేకాదు తమిళనాడులోని తంజావూరు, కేరళలోని కొచ్చి వంటి కొన్ని ప్రాంతాల్లోనూ రాయల సాహిత్యం నడయాడింది. పైగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తశిఖామణి రాయలు. స్వామివారి గుడిలోనే ఈ నాటికీ రాయలవారి విగ్రహం ద్వారం దాటగానే దర్శనమిస్తుంది. ఇన్ని విధాలా ఆలోచించారో లేదో కానీ, మొత్తానికి రాయలవారి కాలాన్ని తన కథలో చొప్పించాలని తలచారు సింగీతం. రాయలవారి భువనవిజయవైభవాన్ని చూపిస్తూనే, కథలోని వజ్రానికి లంకె వేశారు సింగీతం. అంతటితో ఆగితే ఆయన సింగీతం ఎందుకవుతారు. ఆ లంకెను భవిష్యత్ దాకా తీసుకువెళ్ళడం, అక్కడ కథానాయకుడు మరణిస్తాడనే వార్త చూపించడం ఉత్కంఠ కలిగించి, చివరకు హీరో సేఫ్ అంటూ శుభం కార్డు వేశారు. ఇలా భూతభవిషత్ వర్తమానాలను మేళవిస్తూ కాలయంత్రం కథను రూపొందించడం సామాన్య విషయమేమీ కాదు.


Aditya.jpg

'ఆదిత్య 369' సినిమాగా రూపొండం కూడా విచిత్రంగానే జరిగింది. ఓ రోజు సింగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) ఫ్లైట్ లో కలుసుకున్నారు. పక్కపక్కనే కూర్చుని మాట్టాడుకుంటున్న సమయంలో 'ఆదిత్య 369' కథను వినిపించారు సింగీతం. మధురగాయకుడు బాలు సైతం ఈ కథ విని మరింత మధురంగా ఫీలయ్యారు. ఆ సమయంలో తన సమీపబంధువు శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ను నిర్మాతగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు బాలు. అప్పటికే శివలెంకతో 'చిన్నోడు-పెద్దోడు' తీయించేసి నిర్మాతను చేసేశారు. ఈ కథ అయితే కృష్ణప్రసాద్ నిర్మాతగా నిలబడటానికి ఆక్సిజన్ అందిస్తుందని బాలు భావించారు. సింగీతంతో ఓకే చెప్పించారు. ఇందులో కీలకమైన హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణ (Balakrishna)నే ఎంచుకున్నారు. ఎందుకంటే బాలకృష్ణ అయితే శ్రీకృష్ణదేవరాయలుగానూ మెప్పించగలరని వారి విశ్వాసం. బాలు అడగడం వల్ల మరోమాట లేకుండా బాలయ్య కూడా అంగీకరించారు. తరువాత అంతా భారీతనం కనిపించాలని, ఈ సినిమా తప్పకుండా చరిత్రలో నిలచిపోతుందని సింగీతం, బాలు, శివలెంక భావించారు. ఎక్కడా రాజీపడకుండా చిత్ర నిర్మాణం సాగించారు. వారు ఊహించిన దానికన్నా మిన్నగానే శ్రీకృష్ణదేవరాయలు, కృష్ణకుమార్ పాత్రల్లో బాలకృష్ణ నటించి అలరించారు. ఇళయరాజా బాణీలు, వేటూరి, సిరివెన్నెల, వెన్నెలకంటి పాటలతో 'ఆదిత్య 369' ఆడియో సైతం అదుర్స్ అనిపించింది. 1991 జూలై 18న విడుదలైన ఈ చిత్రం బాలయ్య అభిమానులనే కాదు సినిమా లవర్స్ ను ఆకర్షించింది. దీనిని తమిళంలో 'అపూర్వ శక్తి 369'గా, హిందీలో 'మిషన్ 369' గా అనువదించారు.

ఈ సినిమా మంచి ఆదరణతో సాగుతూ ఉండగా, బాలలను సైతం ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా చిరంజీవి (Chiranjeevi)తోనూ ఈ సినిమాకు ప్రచారం చేయించారు. అలా బాలకృష్ణ సినిమాకు చిరంజీవి ప్రమోషన్ లో పాలుపంచుకోవడం ఆ రోజుల్లో భలేగా ముచ్చటించుకున్నారు. 'ఆదిత్య 369' సినిమాతో నిర్మాతగా శివలెంక కృష్ణ ప్రసాద్ పేరు మారుమోగింది. ఈ నాటికీ ఆయనను చూడగానే జనం 'ఆదిత్య 369 నిర్మాత'గానే గుర్తిస్తూంటారు. అదే మరపురాని మధురానుభూతి అంటారు శివలెంక. ఇన్నాళ్ళకు 'ఆదిత్య 369'ను ఈ నాటి టెక్నికల్ హంగులతో మళ్ళీ జనం ముందుకు తెస్తున్నారు. ఏప్రిల్ 11న రానున్న 'ఆదిత్య 369' ఈ సారి ఎలా జనాన్ని అలరిస్తుందో చూడాలి.

Updated Date - Mar 18 , 2025 | 08:16 PM