Elections: అప్పట్లో కృష్ణ 'ఈనాడు' సినిమా ఎన్టీఆర్ విజయానికి ఎలా దోహదపడింది అంటే...
ABN , Publish Date - May 08 , 2024 | 03:04 PM
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేముందు కృష్ణని కూడా ఆహ్వానించారు, కానీ కృష్ణ తనకి కెరీర్ లో ఇంకా ఫ్యూచర్ ఉందని రాలేనని చెప్పారు. అయితే ఎన్టీఆర్ తో 'మీరు రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారని, వితిన్ నో టైమ్ ముఖ్యమంత్రి అవుతారని' కృష్ణ చెప్పారు. అదే సమయంలో కృష్ణ తీసిన 'ఈనాడు' సినిమా ఎన్టీఆర్ విజయానికి హెల్ప్ అయింది. ఎలా అంటే...
ఎన్.టి. రామారావు, కృష్ణ ముల్టీస్టారర్ సినిమా 'వయ్యారి భామలు, వగలమారి భర్తలు' సినిమా వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 20, 1982 న విడుదలైంది. ఈ సినిమా పాటల చిత్రీకరణ ఊటీలో జరుగుతున్నప్పుడు రామారావు, కృష్ణతో మాట్లాడుతూ 'బ్రదర్ నేను సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఎవ్వరినీ పిలవటం లేదు, మిమ్మల్ని, నాగేశ్వర రావుని పిలుస్తున్నాను, నాగేశ్వర రావు హెల్త్ కారణాలతో రానని చెప్పారు, మీరు వస్తే బాగుంటుంది అని' రామారావు కృష్ణతో చెప్పారు. (Krishna's film 'Eenadu' unexpectedly helps NTR's Telugu Desam to sweep in 1983 elections)
కృష్ణ వెంటనే నేను రావటం సంగతి అటుంచి మీరు రాజకీయాల్లోకి వెళుతున్నారు అంటే చాలా ఉత్కంఠగా వుంది, మీకు ఎవరి సహాయం అవసరం లేదు, మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు, మీరు తప్పక గెలుస్తారు, వితిన్ నో టైమ్ మీరు ముఖ్యమంత్రి అవుతారు, అని కృష్ణ చెప్పారు. అయితే తనకి సినిమాలలో ఇంకా చాలా ఫ్యూచర్ వుంది అని, అందుకని ఇప్పట్లో రాలేను అని చెప్పారు కృష్ణ. అందుకు రామారావు కూడా అది సరైన కారణం అని, సరే అన్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టడం, వెంటనే ముఖ్యమంత్రి అవటం జరిగింది.
అయితే రాజకీయ పార్టీ పెట్టె సమయంలోనే కృష్ణ ఆ పార్టీ విజయానికి ఇంకో రకంగా దోహదపడ్డారు. అదే సమయంలో కృష్ణ నటించిన 'ఈనాడు' సినిమా విడుదలైంది. ఇది ఒక మలయాళం సినిమా రీమేక్, ఈ సినిమాని ముందుగా ఒక చిన్న సినిమాగా తీద్దామని కృష్ణ అనుకున్నారు. ఇందులో కథానాయకుడికి పాటలుండవు, కథానాయిక కూడా ఉండదు. అందుకని శ్రీధర్ ని పెట్టి సినిమా చెయ్యాలని కృష్ణ ఆలోచన. కానీ రచయితలు పరుచూరి సోదరులు ఈ సినిమా చూసి కృష్ణతో 'మీరు చేయదగ్గ పాత్ర లేదు, కానీ ఒక పాత్రని ట్రీట్ చేశాం, రెండు సన్నివేశాలు చెప్తాము వినండి, ఒకవేళ నచ్చితే చెయ్యండి, లేకపోతే లేదు', అని, రెండు సన్నివేశాలు చెప్పారు. (After the election results in 1983, NTR called Krishna and says thanks to him) కృష్ణ అవి విని చాలా థ్రిల్ ఫీలయ్యారు. వెంటనే ఆ పాత్ర నిడివి పెంచి, ఆ పాత్రని ఒక ఆదర్శవాది, బ్యాచిలర్, జీవితాన్ని ప్రజల పోరాటానికి అంకింతం చేసి, సామాజిక సమస్యలపై పోరాడే సీతారామరాజులా ఉండాలి అని చెప్పారు.
వెంటనే పరుచూరి సోదరులు విజృంభించారు. 'ఈనాడు' సినిమాలో కృష్ణ చేసిన పాత్రపేరు కూడా రామరాజు అని పెట్టి ఆ సినిమా నేపధ్యం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వుండేటట్టుగా ఒక రాజకీయ వ్యంగాస్త్రంలా తాయారు చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా మాటలు తూటాల్లా పెళ్లి, రాజకీయ నాయకులకి సూటిగా తగిలాయి. రామారావుగారు ఏ ఏ అంశాలను తన రాజకీయ ప్రసంగాల్లో ప్రస్తావించారో అవన్నీ ఈ 'ఈనాడు' సినిమాలో వున్నాయి. 1982 డిసెంబర్ 17న 'ఈనాడు' సినిమా విడుదలైంధి, 1983 జనవరి 5 న ఎన్నికలు జరిగాయి. ఎన్.టి. రామారావు, తెలుగుదేశం పార్టీతో చరిత్ర సృష్టించారు, మొత్తం స్వీప్ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన సాయంత్రం ఎన్టీఆర్, కృష్ణకి ఫోన్ చేసి 'థాంక్స్ బ్రదర్. అనుకోకుండా మీ సినిమా కూడా టైమ్లీ గా ఉపయోగపడింది' అని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, కృష్ణ, విజయనిర్మల మద్రాసు నుండి హైదరాబాదు ప్రత్యేకంగా వచ్చి రామారావు ని కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విధంగా కృష్ణ 'ఈనాడు' సినిమా రామారావు విజయానికి దోహదపడింది.