28 degrees celsius Review: '28 డిగ్రీ సెల్సియస్’ రివ్యూ
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:03 PM
దాదాపు 20 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నారు నవీన్ చంద్ర (Naveen chandra0. అందాల రాక్షసి’ లాంటి హిట్ సినిమా ఉన్నా తర్వాత హీరోగా సరైన హిట్ పడలేదు. కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా కనిపించిన ఆయన ఇప్పుడు హీరోగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు
Cinema Review: '28 డిగ్రీ సెల్సియస్’ (28 Degree Celsius)
విడుదల తేదీ: 4-4-2025
దాదాపు 20 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నారు నవీన్ చంద్ర (Naveen chandra0. అందాల రాక్షసి’ లాంటి హిట్ సినిమా ఉన్నా తర్వాత హీరోగా సరైన హిట్ పడలేదు. కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా కనిపించిన ఆయన ఇప్పుడు హీరోగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘పొలిమేర’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ తెరకెక్కించిన చిత్రం 28 డిగ్రీస్ సెల్సియస్. నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి (Shalini vadnikatti) జంటగా నటించారు. ఆరేళ్ల క్రితం రూపొందిన ఈ చిత్రం పలు కారణాల వల్ల ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించింది? నవీన్ చంద్రకు హిట్ ఇచ్చిందా? రివ్యూలో చూద్దాం.
కథ:
ఓ అమ్మాయి హత్య కేసును విచారించడానికి వచ్చిన పోలీస్ అధికారి (రాజా రవీంద్ర), డాక్టర్ కార్తీక్ (నవీన్ చంద్ర) ఈ హత్యకు కారణమని అనుమానిస్తాడు. కార్తీక్ ఇంట్లో అతనికి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో కార్తీక్, డాక్టర్ అంజలి (షాలినీ వడ్నికట్టి) ప్రేమ కథ ఉంటుంది. వైజాగ్‌లో మెడిసిన్ చదువుతున్న కార్తీక్, అంజలిని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకునే సమయంలో, అంజలి అనారోగ్యం పాలవుతుంది. ఆమె 28 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలదని వైద్యులు చెబుతారు. కార్తీక్ ఆమెను పెళ్లి చేసుకుని కాపాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో కార్తీక్, అంజలి జార్జియా ఎందుకు వెళ్లారు? అక్కడ అంజలి ఆరోగ్యం మెరుగుపడిందా? ఈ ఇద్దరి జీవితంలో ఎలాంటి మలుపుతు ఎదురయ్యాయి? అమ్మాయి హత్య కేసులో కార్తీక్ నిందితుడిగా ఎందుకు మారాడు? అన్నది సినిమా కథ.
విశ్లేషణ:
ప్రేమకు త్యాగమే అర్థమని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని చెప్పే ఎమోషనల్ లవ్‌స్టోరీ ఇది. దీనికి 28 డిగ్రీస్ సి అనే పాయింట్‌ను జోడించి సైకలాజికల్ థ్రిల్లర్‌గా చిత్రీకరించారు. ఓ అమ్మాయి హత్య కేసు ఇన్వెస్టిగేషన్‌తో కథ ఆసక్తికరంగా మొద?వుతుంది. అక్కడి నుంచి ఫ్లాష్‌బ్యాక్ వైజాగ్‌కు మారుతుంది. వైజాగ్‌లో కార్తీక్, అంజలి ప్రేమ కథ ఆహ్లాదకరంగా చూపించారు. అంజలి అనారోగ్యం గురించి తెలియడం, ఆమెను కాపాడుకోవడానికి కార్తీక్ చేేస ప్రయత్నాలు హృద్యంగా ఉంటాయి. జార్జియా వెళ్ళిన తర్వాత ఎదురైన సంఘటనలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అయితే ఇందులో ప్రేమకథ, దానికి సంబంధించిన సన్నివేశాలు బావున్నాయి. సెకెండాఫ్‌లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సైంటిఫిక్‌గా కొన్ని లాజిక్స్ ఫర్వాలేదనిపించినా హారర్ ఎలిమెంట్స్ పరంగా లాజిక్స్ మిస్ అయ్యాయి. కొన్ని సన్నివేశాలు ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి. అక్కడ ఏం జరగబోతుందో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ట్విస్ట్‌లు సర్‌ప్రైజ్ చేస్తాయనుకుంటే అవీ సోసోగా సాగాయి. చెబితే సస్పెన్స్ మిస్ అవుతుంది కానీ.. ఓ క్యారెక్టర్ కథను పూర్తిగా మార్చేస్తుంది. అదేంటి అనేది తెరపైనే చూడాలి. నవీన్ చంద్ర నటన బాగుంది. ఎప్పటిలాగే తన స్టైల్‌లో చేసుకుంటూ వెళ్లిపోయారు. హీరోయిన్ ఆ పాత్ర వరకూ ఓకే కానీ.. మరో ఛాయిస్ తీసుకుంటే బావుండును అనిపించింది. ప్రియదర్శి, హర్ష చెముడు, అభయ్ బేతిగంటి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ గ్యారీ బి హెచ్ వర్క్‌లో షార్ప్‌నెస్ మిస్ అయింది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్రావణ్ భరద్వాజ్ పాటలు ఓకే. శ్రీచరణ్ పాకాల నేపథ్యం సంగీతం సినిమాకు ఎసెట్‌గా నిలిచింది. నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు. నవీన్ చంద్ర వెర్షన్‌కు మాటలు బాగా రాశారు. స్ర్కీన్‌ప్లే కాస్త వేగంగా ఉండుంటే బావుండేది. దర్శకుడు సైన్స్, హారర్ ఎలిమెంట్స్ తో కలిపి లవ్ స్టోరీని బాగానే వండారు కానీ కథనం విషయంలో ఇంట్రెస్ట్‌గా సాగేలా జాగ్రత్త తీసుకుంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఎంగేజింగ్‌గా నడిపించి ఉంటే ఆసక్తిగా ఉండేది. సినిమాను సీన్లు సీన్లుగా చూస్తే కొంతవరకూ పాస్ అనిపిస్తుంది. పొలిమేర రేంజ్‌లో ఉంటుందని ఆశిస్తే నిరాశ తప్పదు. ప్రేమ, భావోద్వేగాలు మాత్రం హత్తుకుంటాయి.
ట్యాగ్‌లైన్: అక్కడక్కడా మెప్పించేలా..