Web Series Review: హోమ్‌టౌన్‌ రివ్యూ

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:34 PM

ఓటీటీ (OTT) రాజ్యమేలుతున్న సమయమిది. చిన్న చిన్న కథలు డిజిటల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కొన్ని కథలు ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుంటే మరికొన్ని మాత్రం ఓటీటీలోనూ నీరసం తెప్పిస్తాయి. తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సిరీస్‌ ‘హోమ్‌ టౌన్‌’ (Hometown).

రివ్యూ: ‘హోమ్ టౌన్’ (వెబ్ సిరీస్)
స్ట్రీమింగ్ : ఆహా  


ఓటీటీలు రాజ్యమేలుతున్న సమయమిది. చిన్న చిన్న కథలు డిజిటల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కొన్ని కథలు ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుంటే మరికొన్ని మాత్రం నీరసం తెప్పిస్తున్నాయి. తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో (Aha ott) స్ట్రీమ్ అవుతోంది ‘హోమ్ టౌన్’ (Home Town Web Series) సీరీస్. ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత శేఖర్ మేడారంతో కలిసి నవీన్ మేడారం (Naveen Medaram) నిర్మించిన సిరీస్ ఇది. రాజీవ్ కనకాల, ఝాన్నీ ప్రధాన పాత్రధారులు. ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, యానీ ఇతర పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం…

కథ:
తెలంగాణలోని హన్మంతుల గూడెం అనే పల్లెలో ప్రసాద్ (రాజీవ్ కనకాల)కు ఓ ఫోటో స్టూడియో ఉంటుంది. దానిపై వచ్చే ఆదాయంతో మధ్యతరగతి కుటుంబాన్ని వెళ్లదీస్తుంటాడు. కొడుకు శ్రీకాంత్ (ప్రజ్వల్ యాద్మ)ను పై చదువుల కోసం విదేశాలకు పంపాలన్నది అతని కోరిక. విదేశాల్లో చదివిస్తే లైఫ్ లో బాగా సెటిల్ అవుతాడని ఆశ పడతాడు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు శ్రీకాంత్ మార్కులు అంతంత మాత్రమే. తనకంటే చిన్నది జ్యోతి (యానీ) బాగా చదువుతుంది. ప్రసాద్ కోరుకున్నట్టు కొడుకు విదేశాలకి వెళతాడా? అసలు శ్రీకాంత్ ఏమవ్వాలనుకుంటాడు? చెల్లెలి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఈ సీరీస్ కథాంశం.


విశ్లేషణ:
తెలుగులో వచ్చిన ఓటీటీ సిరీస్ల్లో ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అద్భుతంగా ఉందని ప్రేక్షకులే తీర్పు ఇచ్చారు. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయిన సిరీస్ అది. అయితే అద్భుతాలు అన్ని సార్లు జరగవు. అలాంటి ప్రయత్నమే మరోసారి చేయాలనుకుంటే ఫ్లేవర్ మాత్రమే కాదు కంటెంట్లో కూడా కావాలి. సేమ్ కంటెంట్ను తెరపై పేస్ట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. హోం టౌన్ సిరీస్ విషయంలో అదే జరిగింది. అయితే ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’, ‘హోమ్ టౌన్’రెండింటికి కథ, పాత్రలు, సీన్స్గా చూస్తే ఎటువంటి పోలిక లేదు. కానీ ‘హోమ్ టౌన్’తో ప్రేక్షకులకు ‘90స్ బయోపిక్’ అనుభవం, అనుభూతి పంచాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టున్నారు. అక్కడే ఒరిజినల్ ఫ్లేవర్ దెబ్బతింది. అన్నయ్య కంటే బాగా చదివే చెల్లెలు, కూతురు కంటే కుమారుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తల్లిదండ్రులు, టీనేజ్లో కోరికలు గురించి తెలుసుకోవాలని ఆరాటపడే అబ్బాయిలు, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ కారణంగా మోసపోయే అమాయకులు ఇవన్నీ చాలా సినిమాల్లో చూశాం.. చూస్తూనే ఉన్నాం. దానిని తెలంగాణ పల్లెకు, 2003 - 2004 కాలానికి తీసుకువెళ్లారు మేకర్స్. అయితే ఇక్కడ స్టోరీ బ్యాక్ డ్రాప్, కాలం వల్ల కొన్ని కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. ప్రేక్షకుల్ని సరదాగా నవ్వించేలా ఉన్నాయి. గిల్ క్రిస్ట్ ఉపయోగించిన  బ్యాట్  స్ప్రింగ్ తో  చేయడం వల్ల ఎక్కువ స్కోరు చేశారని, ఆ కారణం చేత ఆస్ట్రేలియా  2003 వరల్డ్ కప్ నెగ్గిందని ఆ రోజుల్లో చాలామంది నమ్మారు. అలాగే స్వాతి బుక్ సీన్స్ కూడా కొంత మంది ప్రేక్షకులను నవ్విస్తాయి. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో సాగే కథ కాబట్టి  భార్య భర్తల మధ్య సన్నివేశాలు కామెడీతో ఓ మూడు ఎపిసోడ్స్ సరదాగా సాగాయి. ఫేస్ బుక్ అంటూ నాలుగో ఎపిసోడ్ మాత్రం సహనానికి పరీక్ష పెట్టింది. ఒక్క సీన్తో చెప్పే విషయాన్ని ఎపిసోడ్ అంతా లాగి సాగదీశారు. నాలుగో ఎపిసోడ్ చూశాక.. ఐదో ఎపిసోడ్ ఊహించడం వీక్షకులకు పెద్ద కష్టం ఏమీ కాదు. క్లైమాక్స్ అందరూ ఊహించేలాగే ఉంది.

ఆర్టిస్టుల విషయానికొస్తే.. మధ్య తరగతి జంటగా రాజీవ్ కనకాల, ఝాన్సీ తమదైన శైలి నటనతో కట్టిపడేశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను అలరిస్తాయి. పాలసీ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న భర్తను చూసి తను కుట్టు ద్వారా సంపాదించిన డబ్బు భర్త చేతిలో పెట్టినప్పుడు రాజీవ్ కనకాల వెనక్కి తిరిగి చూసే చూపు చాలు ఆయనతో నటనా ప్రతిభ అర్థం కావడానికి. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి పల్లె ఆ సన్నివేశాన్ని బాగా తీశారు. ప్రజ్వల్లో పల్లెటూరి కుర్రాడు కనిపించలేదు. తెరపై అతను మోడ్రన్గా కనిపించాడు. నటన పరంగా ఫర్వాలేదు. యానీ బాగా యాక్ట్ చేసింది. అలాగే ప్రజ్వల్ స్నేహితులుగా నటించిన ఇద్దరూ బాగా యాక్ట్ చేశారు. వాళ్ల కామెడీ టైమింగ్ బావుంది. అయితే ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’తరహాలో ‘హోమ్ టౌన్’ అనుభూతిని పంచలేక పోయింది. ఆ సిరీస్తో పోలిక లేకుండా, అంచనాలు లేకుండా చూస్తే కొన్ని చోట్ల నవ్వుకోవచ్చు.. మరికొన్ని చోట భావోద్వేగాలను ఆస్వాదించవచ్చు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ సిరీస్కు ఎసెట్. ‘ఏదో ఏదో...’ పాట  రిపీట్గా వినేలా ఉంది. ఆర్ఆర్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కాస్త డల్ గా ఉన్నాయి. దేవ్ దీప్ గాంధీ కెమెరా పనితనం బావుంది. 2003 రోజుల్లోకి తీసుకెళ్లారు. ఎడిటర్ కార్తిక్ కట్స్ నిడివి విషయంలో కాస్త పని చేయాల్సింది.  ప్రతి ఎపిసోడ్లోనూ ల్యాగ్ ఉన్నా.. ఎండింగ్ తో కొద్దిగా కవర్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో హౌమ్ టౌన్ సిరీస్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’, ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం చూసినవాళ్లకి ఇది రొటీన్ కథ అనిపించటం ఖాయం.  
ట్యాగ్లైన్: ‘హోమ్ టౌన్’ రొటీన్ టౌన్...

Updated Date - Apr 04 , 2025 | 06:15 PM