Ram Charan: చిరుత మొదటి హీరో ఎవరంటే...

ABN , Publish Date - Apr 04 , 2025 | 06:33 PM

చిరుత సినిమా కథను మెహర్ రమేశ్ రాశారు. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా ఇది మొదలైంది. అయితే... తొలి షెడ్యూల్ తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోవడంతో... ఆ కథ రామ్ చరణ్ ను చేరిందట!

ప్రతి బియ్యపు గింజమైన తినేవాడి పేరు రాసి ఉంటుందని అంటారు. చిత్రసీమలోనూ దీనిని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే... ఎవరికోసమే రాసిన కథ వేరెవరినో వరిస్తుంది. ఎవరితోనో మొదలైన సినిమా... వేరెవరితోనో ముగుస్తుంది... అలానే ఎవరెవరో వద్దనుకున్న పాత్రలు ఒక్కోసారి ఊహించని వారి చెంతకు చేరి.... అఖండ విజయాన్ని అందిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన సంఘటన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) తొలి చిత్రానికే జరిగింది.


ఈ వివరాల్లోకి వెళితే... దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కు మెహర్ రమేశ్‌ కు మధ్య చక్కని అనుబంధం ఉంది. ఇక్కడ పూరి తెరకెక్కించిన 'ఆంధ్రావాలా'ను కన్నడలో మెహర్ రమేశ్‌ 'వీర కన్నడిగ' పేరుతో తెరకెక్కించాడు. అందులో పునీత్ రాజ్ కుమార్ (Punith Rajkumar) హీరో. ఆ సినిమా కన్నడలో అఖండ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా 'ఒక్కడు'ను 'అజయ్' పేరుతో కన్నడలో రీమేక్ చేశాడు. ఇందులోనూ పునీతే హీరో. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. అయితే... పూరితో ఏర్పడిన అనుబంధంతో ఆయన సోదరుడు సాయిరామ్ శంకర్ (Sairam Shankar) కోసం మెహర్ రమేశ్ (Mehar Ramesh) ఓ కథను తయారు చేశాడు. దానిని పూరికి వినిపిస్తే... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో సాయిరామ్ శంకర్ హీరోగా, మెహర్ రమేశ్ దర్శకత్వంలో సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో చేశారు. ఈ సినిమాకు మణిశర్మ (Manisharma) సంగీతం అందించాడు. కానీ అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. అదే కథ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా 'చిరుత' పేరుతో రూపుదిద్దుకుంది. రామ్ చరణ్‌ ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాడు. నేహా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకూ మణిశర్మే సంగీతం అందించాడు. ఇటీవల మెహర్ రమేశ్‌ కు అత్యంత సన్నిహితుడైన రచయిత తోట ప్రసాద్ ఈ ముచ్చట్లను వివరించారు.

Also Read: Web Series Review: హోమ్‌టౌన్‌ రివ్యూ

Also Read: Ramgopal Varma: శారీ మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 04 , 2025 | 06:33 PM