Akshay Kumar: జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత...
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:57 PM
అక్షయ కుమార్, అనన్యపాండే, మాధవన్ కీలక పాత్రలు పోషించిన 'కేసరి చాప్టర్ 2' మూవీ ట్రైలర్ విడుదలైంది. జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18న జనం ముందుకు వస్తోంది.
అమృత్ సర్ లోని జలియన్ వాలాబాగ్ (Jallianwala Bagh) లో 1919 ఏప్రిల్ 13న జరిగిన దారుణ మారణకాండను ఎవరూ మర్చిపోలేరు. శిక్కులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి హాజరైన సమయంలో అతి దారుణంగా బ్రిటీష్ కల్నల్ డయ్యర్ (Colonel Dyer) పాశవికంగా వారిపై కాల్పులు జరిపించాడు. వేలాది మంది పెద్దలు, పిన్నలు ఈ మారణకాండకు బలయ్యారు. ఆ దుర్ఘటన, తదనంతర పరిణామాల మీద రూపుదిద్దుకుంది హిందీ చిత్రం 'కేసరి -2' (Kesari -2). పుష్ప పలట్, రఘు పలట్ రాసిన 'ది కేస్ దట్ షాక్ ది ఎంపైర్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది సి శంకరన్ నాయర్ పాత్రను అక్షయ్ కుమార్ (Akshay Kumar) పోషించాడు. జనరల్ డయ్యర్ ను బోనులో నిలబెట్టిన నాయర్ కు సహాయకురాలిగా, యువ న్యాయవాదిగా అనన్య పాండే (Ananya Panday) నటించింది. అతని ప్రత్యర్థి లాయర్ పాత్రను ఆర్. మాధవన్ (R. Madhavan) పోషించాడు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన 'కేసరి 2' చిత్రం ఏప్రిల్ 18 విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తీవ్ర భావోద్వేగాలను కలిగించేలా ఈ ప్రచార చిత్రం ఉంది.