Chiranjeevi: లేడీ గెటప్‌.. ఆ రోజుల్ని గుర్తు చేసుకున్న చిరు

ABN , Publish Date - Feb 10 , 2025 | 02:16 PM

గతంలో చంటబ్బాయ్‌ చిత్రంలో చిరు వేసిన గెటప్‌ను ఏవీలో చూపించి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఆ వీడియో చూసిన చిరంజీవి దీనిపై స్పందిస్తూ 

 Chiranjeevi: లేడీ గెటప్‌.. ఆ రోజుల్ని గుర్తు చేసుకున్న చిరు

విశ్వక్‌సేన్‌ (Vishwaksen) హీరోగా రామ్‌ నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం 'లైలా’(Laila). సాహు గారపాటి నిర్మాతగా ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇందులో విశ్వక్‌సేన్‌ లేడీ గెటప్‌లో కనిపిస్తారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో అతిథిగా హాజరైన చిరంజీవికి (Chiranjeevi) సర్‌ప్రైజ్‌ చేశారు. గతంలో చంటబ్బాయ్‌ చిత్రంలో చిరు వేసిన గెటప్‌ను ఏవీలో చూపించి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఆ వీడియో చూసిన చిరంజీవి దీనిపై స్పందిస్తూ "ఇదెక్కడ దొరికిందయ్యా మీకు! వీటిని నేను చూసే కొన్నేళ్లు అవుతుంది’’ అంటూ ఆశ్చర్యపోయారు. గెటప్‌ గ్లామర్‌లో పోటీ పెడితే నన్ను దాటిపోయాడు విశ్వక్‌. అతను కొంచెం బొద్దుగా ఉండటం వల్ల మరింత గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. సినిమా చూశాక తట్టుకోగలనో లేదో చూడాలి’’ అని సరదాగా సంభాషించారు. అలాగే చంటబ్బాయ్‌ సినిమాలో గౌనుతో తలపై టోపీ పెట్టుకొని కనిపిస్తారు. ఈ గెటప్‌ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని తాజాగా పంచుకున్నారు. (Chiranjeevi Lady getup)


Chiru.jpg
‘‘జంధ్యాల గారు లేడీ గెటప్‌ గురించి చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. అయితే, మీసాలు తీసేయాలని చెప్పారు. దాంతో నేను ఒక కండీషన్‌ పెట్టాను. అప్పుడు సెట్‌లో దాదాపు 60-70 మంది పనిచేస్తున్నారు. ‘వారందరూ మీసాలు తీస్తే, ఆఖరుగా తీసేవాడిని నేనవుతా’ అని చెప్పా. దాంతో సెట్‌లో పనిచేస్తున్న వారందరూ మీసాలుని తీశారు. ఇక లేడీ గెటప్‌లో మా కుటుంబసభ్యులు నన్ను చూడలేకపోయారు. ‘మీసాలు పెంచేవరకూ కళ్ల ముందు కనపడొద్దు అన్నారు’’ అంటూ ‘చంటబ్బాయి’ సంగతులను చిరంజీవి గుర్తుచేసుకున్నారు. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన కామెడీ డ్రామా ‘చంటబ్బాయి’. ఆయనకున్న మాస్‌ ఇమేజ్‌కు విభిన్నంగా చేసిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆయన కెరీర్‌లో కల్ట్‌ క్లాసిక్‌ చిత్రంగానూ నిలిచింది.

ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. దీని తర్వాత దర్శకుడు అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.  

Updated Date - Feb 10 , 2025 | 02:19 PM