Pawan Kalyan: నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు... నేను సత్యాగ్రహిని

ABN , Publish Date - Jun 16 , 2024 | 09:27 AM

‘‘నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు... నేను సత్యాగ్రహిని’’‘‘సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతం... సత్యం నా గుండెల్లో గర్జిస్తున్న జలపాతం’’  కొన్నేళ్ల క్రితం ‘పవన్‌ కల్యాణ్‌ శేషేంద్ర కవిత్వాన్ని తన ఉపన్యాసంలో  ఉటంకించిన వాక్యాలివి...

Pawan Kalyan: నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు... నేను సత్యాగ్రహిని

‘‘నేను అంతా కలిపి పిడికిలి మట్టే కావచ్చు... కానీ గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది’’.. శేషేంద్ర రాసిన ఈ కవితా పంక్తులను తన ప్రసంగాలలో ఉటంకించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన రాజకీయ నాయకుల్లో పవన్‌ ఒకరు. సాధారణంగా సాహిత్యాన్ని బాగా చదువుకొన్న రాజకీయ నాయకులు ఇటీవల చాలా అరుదుగా కనిపిస్తున్నారు. వీరిలో పవన్‌ కల్యాణ్‌ ఒకరు (Janasena) కావటం... తను అధికారంలోకి రావటం చాలా ఆనందంగా అనిపించింది. ఆయనతో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదు. కానీ ఉత్తరప్రత్యుత్తరాలు మాత్రం నడిచాయి. (Pawan Kalyan)

ఒకప్పుడు రాజకీయ నాయకులు కేవలం చదువు మాత్రమే కాదు... సాహిత్యాన్ని కూడా చదువుకొనేవారు. ఇప్పటి తరం వారిలో చాలామందికి సాహిత్యంవల్ల కలిగే వికాసం తెలియకపోవచ్చు. కానీ మన సమాజ ఒరవడిని.. దానిలో వస్తున్న మార్పులను పసిగట్టేది సాహిత్యమే. కవిత్వం, కథలు, నవలలు, సాహితీ వ్యాసాలు... కేవలం కవి ప్రతిభను మాత్రమే కాదు.. అతను ఈ సమాజానికి ఏం చేయాలనుకున్నడానే విషయాన్ని కూడా తెలియజేస్తాయి. అందుకే గత కాలపు ఉద్యమాలకు సాహిత్యం ఒక ప్రధానమైన ఇరుసుగా ఉండేది. యువత కవితలను చదివి అర్థం చేసుకొనేవారు. స్ఫూర్తి పొందేవారు. రాజకీయ నాయకులకు కూడా సాహిత్యంపై అవగాహన ఉండేది. హైదరాబాద్‌ సంస్థానంలో ఎంతోమంది ప్రధానులు పేరుమోసిన కవులే. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో నాయకులకు కూడా సాహిత్యం పట్ల అవగాహన ఉండేది. అందుకే ముఖ్యమంత్రులు, మంత్రులు... ధ్యాన్‌భాగ్‌ పాలస్ కు  వచ్చిపోతూ ఉండేవారు. పి.వి.నరసింహరావు దగ్గర నుంచి అంజయ్య వరకు అనేకమంది నాయకులకు సాహిత్యం పట్ల అవగాహన ఉండేది. నేను అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో హిందీ అకాడమీ అధ్యక్షురాలిగా పనిచేశాను. ఆ సమయంలో మంత్రులను, ముఖ్యమంత్రులను కలవాల్సి వచ్చేది. వారు సాహిత్యానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చేవారు. నిధులు విడుదల చేసేవారు. మంచి సాహిత్యాన్ని ప్రొత్సహించమని చెప్పేవారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో కళలకు మంచి ప్రాధాన్యం లబించింది. శేషేంద్రకు ఎన్టీఆర్‌ మిత్రుడు కావటంవల్ల సాహితీ విషయాలను చెప్పగలిగే సాన్నిహిత్యం ఉండేది. నాకు గుర్తున్నంత వరకు రాజకీయ నాయకులు తమ ప్రసంగాలలో కవితలను కోట్‌ చేసేవారు. కమ్యూనిస్టు పార్టీల నినాదాలన్నీ కవితాత్మకంగానే ఉండేవి. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. (Gunturu Seshendra Sarma Poetry)

Pawan-kalyan.jpg

కొన్నేళ్ల క్రితం ‘పవన్‌ కల్యాణ్‌ అనే యువ నాయకుడు శేషేంద్ర కవిత్వాన్ని తన ఉపన్యాసంలో ఉటంకించార’ని ‘ది హిందూ’లో చదివా. అతను ఉటంకించిన వాక్యాలివి...

‘‘నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు... నేను సత్యాగ్రహిని’’

‘‘సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతం... సత్యం నా గుండెల్లో గర్జిస్తున్న జలపాతం’’

‘‘నేను అంతా కలిపి పిడికిలి మట్టే కావచ్చు... కానీ గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది’’

‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు... తుఫాన్‌ ఒకడికి చిత్తం అనడం ఎరగదు... పర్వతం ఎవ్వడికీ సలాం చేయదు’’..

ఆధునిక కవితా ప్రపంచంలో శేషేంద్రది ఒక అత్యుతన్నత స్థానమని అందరికీ తెలుసు. ఆ కవిత్వాన్ని పవన్‌ ఆకళింపు చేసుకొని.. దానిని ప్రజల వద్దకు సమయోచితంగా చేర్చటం నాకు ఆనందం కలిగించింది. వెంటనే ఆయన అడ్రస్సు తీసుకొని... శేషేంద్ర కవిత్వాన్ని ఉటంకించినందుకు అభినందిస్తూ ఒక ఉత్తరం రాశాను. శేషంద్ర రాసిన కొన్ని పుస్తకాలు పంపాను. ఆ తర్వాతి కాలంలో అనుకుంటా... శేషేంద్ర కవితా పుస్తకాన్ని ఆయన పునఃముద్రించారు. దీనికి అవసరమైన ధన సాయం ఆయనే చేశారని కొందరు చెప్పారు. శేషేంద్రపై ఎంతో అభిమానం లేకపోతే పుస్తకాన్ని పునఃముద్రించటానికి అవసరమైన ధనాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ఇస్తారు? ఈ విషయం నాకు ఆనందం కలిగించింది.

ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. సాధారణంగా రాజకీయ నాయకులు చాలా విషయాలు పట్టించుకోరు. వాటిలో ప్రజల నుంచి వచ్చే ఉత్తరాలు ప్రధానమైనవని నా నమ్మకం. కానీ పవన్‌ నాకు కృతజ్ఞతలు చెబుతూ ఒక ఉత్తరం రాశారు. ‘ఇజం’ అనే పుస్తకాన్ని కూడా పంపించారు. ఈ తరహా సంస్కారం ఉన్న వ్యక్తులు ఈ మధ్య కాలంలో అరుదుగా కనిపిస్తున్నారు. నేను పవన్‌తో ఎప్పుడూ మాట్లాడలేదు. కలవలేదు. కానీ మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగాలను చాలా జాగ్రత్తగా విన్నాను. వాటిలో ఒక స్వాప్నికత ఉంది. ఆదర్శం ఉంది. భవిష్యత్తు కోసం ఒక ఆరాటం ఉంది. ప్రజల ఆశయాల పట్ల అవగాహన.. ఆర్థ్రత ఉన్నాయి. ఒక మంచి రాజకీయ నాయకుడికి ఇంతకన్నా గొప్ప లక్షణాలు ఏంకావాలి?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత నేను, పిన్ర్సెస్‌ ఇస్రా వంటి అనేక రాజ కుటుంబాల వారసులతో మాట్లాడాను. అందరూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విజయాల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. పవన్‌ తన స్వప్నాలకు సాకారం చేసుకుంటారని ఆశిస్తున్నా. త్వరలోనే ఆయనను జ్ఞాన్‌భాగ్‌లో కలుసుకొనే అవకాశం వస్తుందని ఆకాంక్షిస్తున్నా.

రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Jun 16 , 2024 | 09:30 AM