Pawan Kalyan: పోస్ట్ ప్రొడక్షన్ లో హరి హర వీరమల్లు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:20 PM
కరోనా మహమ్మారి కారణంగానూ, పవర్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగానూ లేట్ అయిన 'హరిహర వీరమల్లు' చిత్రం ఖచ్చితంగా మే 9న విడుదల అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ పాన్ ఇండియా మూవీస్ లో 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో అంచనాలు అంబరాన్ని తాకాయి. పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఈ చిత్రం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఈ విషయాన్ని చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం (A.M. Rathnam) తెలియచేస్తూ, ''ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నాం. ప్రతి సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తున్నాం. ఈ వేసవిలో వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతున్నాం'' అని అన్నారు. 'ఈ చిత్రం కోసం దర్శకుడు ఎ. ఎం. జ్యోతికృష్ణ గత ఏడు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ మొదలుకొన్ని షూటింగ్ ను పూర్తి చేయడం వరకూ ప్రతి విభాగాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని రత్నం తెలిపారు. సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు జ్యోతికృష్ణ ఎంతో శ్రమపడుతున్నార'ని అన్నారు.
ఈ మూవీ కథ గురించి ఎ.ఎం. రత్నం చెబుతూ, ''ఈ చిత్రంలో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో పవర్ స్టార్ కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఇది ఒక విప్లవం'' అని చెప్పారు.
'హరి హర వీరమల్లు' చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎ. ఎం. జ్యోతికృష్ణ దర్శకులు. కరోనా మహమ్మారితో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమైన ఈ సినిమా మే 9న జనం ముందుకు రాబోతోంది. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి (M.M. Keeravani) స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో' గీతాలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ (Bobby Deol) నటిస్తున్నారు. ''యానిమల్, డాకు మహారాజ్'' చిత్రాలతో బాబీ డియోల్ తెలుగువారికీ చేరువయ్యారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు దీనిని నిర్మిస్తున్నారు.
Also Read: Akkada Ammayi Ikkada Abbayi: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి