Priyadarshi: 25కి సారంగపాణి జాతకం వాయిదా

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:11 PM

ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన 'సారంగపాణి జాతకం' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది.

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా నటించిన 'సారంగపాణి జాతకం' (Saranagapani Jaathakam) సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ నెల 18న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఓ వారం రోజుల తర్వాత 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Shivalenka Krishna Prasad) తెలిపారు. హీరో ప్రియదర్శి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి (Indraganti Mohana Krishna) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్విస్తుందని ఆయన అన్నారు. యూత్ ను ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు.


SPJ 2.jpg

ఈ సినిమా గురించి శివలెంక కృష్ణ ప్రసాద్ మరిన్ని వివరాలు తెలియచేస్తూ, ''మా శ్రీదేవి మూవీస్ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే సినిమా అవుతుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ తీయాలనే నా కోరిక ఈ సినిమా తో నెరవేరింది. ఫస్ట్ కాపీ తో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ నెల 25 న మీకు రెట్టింపు ఆనందాన్ని కలిగించే విధంగా మా 'సారంగపాణి జాతకం‘ థియేటర్ల లో విడుదల కానుంది. నిజానికి 18 న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు , మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న వస్తున్నాం. ’బలగం ‘ (Balagam), ‘35’, ‘కోర్టు’ (Court) సినిమాలతో ప్రియదర్శి రేంజ్ పెరిగింది. మిమ్మల్ని ఈ సినిమాతో 100 శాతం ఎంటర్టైన్ చేస్తారాయన. నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ 'నాని జెంటిల్‌మన్' మూవీతో. ఆ తర్వాత చక్కని ప్రేమకథతో, సుధీర్‌బాబుతో 'సమ్మోహనం' నిర్మించాను. ఈ రెండూ కూడా మంచి పేరు, సక్సెస్ తెచ్చాయి. ఇప్పుడు ఆ విజయాలను ‘సారంగపాణి జాతకం’ కొనసాగిస్తుంది. ఇలాంటి సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.“ అని తెలిపారు.


రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు.

Also Read: Oscars stunt design category: రాజమౌళి హర్షం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 12 , 2025 | 12:15 PM