Muthyala Subbaiah: ముత్యాల సుబ్బయ్య ‘తల్లి మనసు’ ప్రారంభం

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:03 PM

ప్రముఖ తెలుగు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి నిర్మిస్తున్న చిత్రం తల్లి మనసు. తాజాగా శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది.

Muthyala Subbaiah: ముత్యాల సుబ్బయ్య ‘తల్లి మనసు’ ప్రారంభం
Thalli Manasu

గ‌తంలో 50కి పైగా సినిమాలను తీసిన ప్రముఖ తెలుగు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య (Muthyala Subbaiah) సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రం తల్లి మనసు (Thalli Manasu). కమల్ కామరాజు, రచిత మహాలక్ష్మి, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నీ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిస్తుండ‌గా దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

తాజాగా శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు క్లాప్ నివ్వగా, ఏషియన్ గ్రూప్ ఎం.డి. భరత్ నారంగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు.

muthyala.jpg

అనంతరం జరిగిన ప్రెస్మీట్ లో చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, "టైటిల్ ను చూస్తేనే ఇది ఎంత మంచి సబ్జెక్టు అన్నది అర్ధమవుతుంది. మా అబ్బాయి అభిరుచే ఈ బ్యానర్ స్థాపనకు కారణమయ్యింది. తల్లి పాత్ర కోసం ఎంతోమందిని ప్రయత్నించాం. ఎట్టకేలకు పాత్రలో ఒదిగిపోయే మంచి ఆర్టిస్టు రచిత దొరికారు. నా దగ్గర ఎంతో మంది సహాయ, కో- డైరెక్టర్లుగా పనిచేశారు. వి.శ్రీనివాస్ (సిప్పీ)లో అద్భుతమైన టాలెంట్ చూసి, ఆయనకు అవకాశం కల్పించాం" అని అన్నారు.


GUgz4UTa8AQpLBH.jpeg

దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, ``పూర్వాశ్రమంలో దర్శకత్వ శాఖలో పవన్ కల్యాణ్ గారి సినిమాలతో పాటు ముత్యాల సుబ్బయ్య, ఎస్.జె.సూర్య, త్రివిక్రమ్ గార్ల వంటి పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేశాను. ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఆమె మనోవేదన, సంఘర్షణను ఇందులో ఆవిష్కరిస్తున్నాం" అని చెప్పారు. చిత్ర నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ,"ఒక మంచి సినిమా తీయాలన్న సంకల్పమే ఈ సినిమాకు కారణం. నాన్న పేరు నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది. ప్రారంభం రోజు నుంచి యాభై రోజుల పాటు నిర్విరామంగా జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తాం. నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేస్తాం" అని చెప్పారు.

Updated Date - Aug 09 , 2024 | 03:03 PM