Balakrishna: ఆ పదం మన ఒంటికి పట్టదు..   మొదలు పెడితే, ఆపేది లేదు

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:25 PM

34 సంవత్సరాల తర్వాత  4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉగాది నాడు హైదరాబాద్‌లో  జరిగింది

నందమూరి బాలకృష్ణ (NBK) కథానాయకుడిగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ (Aditya 369) మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.  ఏప్రిల్ 4వ తేదీన రీ-రిలీజ్ అవుతోంది. భారతదేశ సినిమా చరిత్రలోనే టైమ్ ట్రావెల్ అనే పాయింట్ మీద రూపొందిన మొట్టమొదటి సినిమా ‘ఆదిత్య 369’. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.  1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను, 34 సంవత్సరాల తర్వాత  4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉగాది నాడు హైదరాబాద్‌లో  జరిగింది ‘ఆదిత్య 369’ మూవీ రీ-రిలీజ్‌కి సంబంధించిన ట్రైలర్ని దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి విడుదల చేశారు.

బాలకృష్ణ మాట్లాడుతూ, ‘‘సినిమా సినిమాకి వేరియేషన్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయం అది. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఒక కమర్షియల్‌ ట్రెండ్‌ సెట్‌ చేసి, నాకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి మా నాన్న  నందమూరి తారక రామారావు. ఏదో ఒక కొత్తదనం ఉండేలా పాత్రలు చేసేవారు. ‘భైరవద్వీపం’లో కూరూపి పాత్ర చేయడానికి ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయనే.  ప్రేక్షకుల కోసం ఇంకా కొత్తగా ఏం చేయాలి? అన్న ఆత్మ పరిశీలన ఎప్పుడూ చేసుకోవాలి. నటన అంటే  పాత్ర తాలుకూ ఆత్మను పట్టుకోవాలి. ‘ఆదిత్య 369’ కథ చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు పెట్టింది పేరు.  తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారు.. అందుకే ‘ఆదిత్య 369’ వచ్చింది. ఈ తరహా  మూవీ చేయాలని చాలా మంది ప్రయత్నించారు. కొన్ని మొదలు పెట్టకుండానే ఆగిపోయాయి. మరికొన్ని ఈ స్థాయి విజయం అందుకోలేదు. చలనచిత్ర పరిశ్రమలో కొన్ని గొప్ప సినిమాలు పేర్లు చెప్పమంటే, ‘మాయబజార్‌’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీకృష్ణ పాండవీయం’ లాంటి చిత్రాలు చెబుతారు. ఇది కూడా ఆ కోవలోకి వస్తుంది. దీని సీక్వెల్‌ కూడా రెడీ అయింది. మొదలు పెడితే, ఆపేది లేదు’ నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇలాంటి పాత్రలన్నీ నాకు కొట్టిన పిండి. నేను రెండు జనరేషన్స్‌కు కనెక్ట్‌ అయ్యా. అటు సినిమాలు, ఇటు ‘అన్‌స్టాపబుల్‌’ వంటి కార్యక్రమాలు చేశాను. నా కొడుకే కాదు, నా మనవడికీ కనెక్ట్‌ అయ్యాను. అన్ని వర్గాలను అలరించేలా సినిమాలు చేస్తున్నా. పద్మభూషణ్‌ ఆలస్యంగా వచ్చిందని చాలా మంది అంటారు. కానీ, సరైన సమయానికే వచ్చింది. ఇండస్ట్రీలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ అనే మాట వినపడుతుంది. ఆ పదం మన ఒంటికి పట్టదు. హిట్ సినిమాలు  ఇచ్చాను.. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా.. ఓటీటీలో వేదికగా షో లు చేస్తున్నా.  క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గానూ ఉన్నాను’ అని బాలకృష్ణ అన్నారు.  


NBK-2.jpg

శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ‘‘అప్పటికి నేను చిన్నోడు-పెద్దోడు సినిమా మాత్రమే చేశారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మంచి సినిమా చేద్దువుగాని అని అంటూ వుండేవారు. కొద్దిరోజుల తర్వాతే ఆయన సింగీతం గారిని కలవమని చెప్పారు. సింగీతం గారు అద్భుతమైన కథ చెప్పారని అన్నారు.  ఈ సినిమా తీయి. నిర్మాతగా కొన్ని దశాబ్దాలు మిగిలిపోతావు అని బాలు అన్నారు. ఇది కేవలం నందమూరి బాలకృష్ణ చేస్తేనే ఈ సినిమా తీస్తాను అని సింగీతం గారు అన్నారు.  బాలకృష్ణ గారు పూర్తి కమర్షియల్ సినిమాలు చేసే సమయం. బాలకృష్ణ గారిని కలిసి కథను చెప్పగానే చేస్తున్నాను అన్నారు. ఆ 30 సంవత్సరాల వయసులో బాలకృష్ణ గారు ఇలాంటి క్లాస్ కథను ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం.   ఆ సినిమా ప్రారంభించినప్పటి నుంచి అంతా పండగే. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చ జరుగుతూ వుండేది. చాలామంది ప్రముఖులు సెట్స్.కి అందరూ వచ్చి షూటింగ్ చూసేవారు. నేను ఎన్ని సినిమాలు తీసినా ‘ఆదిత్య 369’ సినిమా ఇచ్చిన గౌరవం ఇప్పటికీ నన్ను నడిపిస్తోంది. ఈ సినిమాని నిర్మించడం నా అదృష్ణం. ఎస్పీ  బాలసుబ్రహ్మణ్యం గారు, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నందమూరి బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి వుంటాను. ఇన్నేళ్ళ తర్వాత ‘ఆదిత్య 369’ని మళ్ళీ విడుదల చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది’’ అన్నారు.   

Updated Date - Mar 30 , 2025 | 11:25 PM