Raayan Review: రాయన్  రివ్యూ.. ధనుష్ 50వ చిత్రం ఎలా ఉందంటే.. 

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:33 PM

తమిళ నటుడు ధనుష్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఉంటారు. ఒక్క తమిళంలోనే కాక అన్ని భాషల్లోనూ అతనికి అభిమానులు ఉన్నారు. శుక్రవారం  'రాయన్'  అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇది ధనుష్ కి 50వ సినిమా. ఇందులో ధనుష్ కథానాయకుడు గానే కాకుండా దర్శకత్వం కూడా తనే చేశాడు.

సినిమా: రాయన్(Raayan)
నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, ఎస్.జె. సూర్య, సెల్వ రాఘవన్, దుషారా విజయన్ తదితరులు
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్
నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం: ధనుష్
విడుదల తేదీ: జులై 26, 2024
రేటింగ్: 3 (Raayan MOvie Rating)

సురేష్ కవిరాయని

తమిళ నటుడు ధనుష్ (Dhanush)అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఉంటారు. ఒక్క తమిళంలోనే కాక అన్ని భాషల్లోనూ అతనికి అభిమానులు ఉన్నారు. శుక్రవారం  'రాయన్' (Raayan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇది ధనుష్ కి 50వ సినిమా. ఇందులో ధనుష్ కథానాయకుడు గానే కాకుండా దర్శకత్వం కూడా తనే చేశాడు. అందుకని ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ప్రేక్షకులు ఎదురు చూశారు. పెద్ద ప్రొడక్షన్ సంస్థ అయిన సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇంకా సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, ఎస్ జె సూర్య (SJ Suriya), సెల్వరాఘవన్(Selva Raghavan) నటించారు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

raayanmovie.jpg

Raayan story కథ:
రాయన్ (ధనుష్) తన తమ్ముళ్లు ముత్తు (సందీప్ కిషన్), మాణిక్యం (కాళిదాసు జయరామన్) చెల్లెలు దుర్గ (దుషార విజయన్)లతో  చిన్నప్పుడే పల్లెటూరి నుండి పట్నం వచ్చేస్తాడు. తమ్ముళ్లు, చెల్లెలుతో గుట్టుగా ఒక ఫుడ్ కోర్టు నడుపుతూ సాదా జీవనం సాగిస్తూ ఉంటాడు. తమ్ముడు ముత్తు చదువు లేకుండా అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. ఒకసారి ఆ సిటీలో డాన్ గా ఉన్న దొరై సభ్యుడితో గొడవ పెట్టుకుంటాడు. దొరై రాయన్ ని పిలిచి హెచ్చరిస్తాడు ఇంకోసారి అలా జరగకూడదు అని. అదే సిటీకి కొత్తగా వచ్చిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ప్రకాష్ రాజ్) దొరై, ఇంకో ముఠాకి నాయకుడైన సేతు (ఎస్.జె.సూర్య) ముఠాలని ఎలాగైనా అంతమొందించాలని చూస్తూ ఉంటాడు. ఒక రోజు అనుకోకుండా రాయన్ తమ్ముడు ముత్తు, దొరై కొడుకుని చంపేస్తాడు. ఇది తెలిసిన దొరై, రాయన్ కి  ఫోన్ చేసి తమ్ముణ్ణి 24 గంటల్లో పంపకపోతే అందరినీ లేపేస్తానంటాడు. రాయన్ తమ్ముళ్ళతో వెళ్లి దొరై ని చంపేస్తాడు. రాయన్  చెల్లెలు దుర్గ వివాహం కుదురుతుంది. దొరై చనిపోయిన వార్త తెలిసిన పోలీస్ కమిషనర్, సేతు, దొరైని ఎవరు చంపి ఉంటారు అనే విషయంపై తీవ్రంగా పరిశోధిస్తారు. వాళ్లకు నిజం తెలిసిన తరువాత ఏం చేశారు? పోలీస్ కమిషనర్, సేతు, రాయన్ లను కాంప్రమైజ్ పేరిట ఎటువంటి ప్లాన్ చేశాడు? రాయన్ తమ్ముడు ముత్తు చివరికి ఎటువంటి పని చేశాడు? దుర్గ వివాహం అయిందా? ఇవన్నీ తెలియాలంటే ‘రాయన్’ సినిమా చూడండి.


విశ్లేషణ:
ధనుష్ తన 50వ సినిమా వైవిధ్యంతో కూడిన యాక్షన్ నేపథ్యంలో ఉన్న కథని తీసుకున్నాడు, తనే దర్శకత్వం చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు. కథని ఎక్కువగా డ్రాగ్ చేయకుండా విషయంలోకి వెంట వెంటనే చెప్పేశాడు. ఇందులో రాయన్ గా ధనుష్ ఎటువంటి పాత్ర చేయబోతున్నాడు అన్న విషయంలో పూజారిని చంపడం తోనే అని  మొదట్లోనే చెప్పేసాడు. ఆ తర్వాత తమ్ముళ్లను, చెల్లిని పట్నం తీసుకొని వచ్చి ఒక ఫుడ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న అతనికి తన కుటుంబం అంటే ఎంత ప్రేమో కూడా చూపించాడు. తన కుటుంబం వైపు ఎవరైనా వస్తే వాళ్లని వదలడు, అలాంటి రాయన్ పాత్ర తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. తమ్ముడు ముత్తు పాత్రను కూడా బాగా మలిచాడు ధనుష్. అన్నయ్య దగ్గర మాటలు పడుతూ ఉండటం కంటే తను ఇండివిడ్యువల్ గా డబ్బులు సంపాదించడానికి ఎటువంటి పని అయినా చేయడానికి ఎలా సిద్ధపడతారు తమ్ముళ్లు అనే విషయం బాగా చూపించాడు. అలాగే చెల్లెలు అంటే ఎంత ప్రేమ, తమ్ముళ్లు, వారి మధ్య నడిచే ఆ సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించాడు. తను ఒక పని చేసినప్పుడు ఎంత సైలెంట్ గా చేస్తాడు అనే విషయం కూడా బాగా చూపించాడు. అలాగే అవతల వాడు చావాలి లేదా తను చంపేస్తాడు అనే విషయంపై చాలా క్లారిటీగా ఉన్న రాయన్ పాత్రని చక్కగా మలిచాడు. చెల్లెలు కోసం అన్న, అన్నని దొంగ దెబ్బ తీసిన తమ్ముళ్ళని ఇలా అన్నా చెల్లెలు ఒకరికొకరు తెలియకుండానే పగ ఎలా సాధించారు కూడా ఆసక్తికరంగా చూపించగలగాడు. ఇది ఒక యాక్షన్ నేపథ్యంలో సాగిన థ్రిల్లర్, ఇందులో ట్విస్టులు కూడా ఉంటాయి. అయితే రక్తపాతం మరీ ఎక్కువైంది,కాళ్లు చేతులు తెగుతాయి. తన 50వ సినిమా ఒక మంచి వైవిధ్యమైన కథతో ధనుష్ రావటం దానికి అతనే దర్శకత్వం చేయడం బాగుంది. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి.

Raayan.jpg

ఇక నటీ నటుల విషయానికొస్తే ధనుష్ రాయన్ గా మరోసారి తన నటన ప్రదర్శించాడు. ఒక మంచి సీరియస్ పాత్రలో జీవించాడని చెప్పాలి. కథానాయకుడుగా సినిమాలో ప్రధాన పాత్రగా  చేసినా  తనకి కథానాయకురాలు ఉండరు. అటు దర్శకుడుగా ఇటు నటుడిగా రెండిట్లోనూ సఫలం చెందాడు. ఇక ఈ సినిమాలో ఆశ్చర్యకరమైన పాత్రలో సందీప్ కిషన్ కనబడతాడు. చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ ఒక మంచి పాత్ర చేయడం దానిని అతడు బాగా పోషించడం బాగుంది. సినిమాలో సందీప్ కిషన్ పాత్ర చాలా కీలకం, ప్రత్యేకంగా కూడాను. ఇక ప్రకాష్ రాజు కమిషనర్ గా ఇంతకుముందు చాలా సార్లు చేసిన పాత్రని చేశాడు. ఎస్ జె సూర్య మెప్పించాడు. దుర్గగా దుషారా విజయన్ బాగా చేసింది.  ఆమెకు మంచి పాత్ర లభించింది. అపర్ణ బాలమురళి తో సహా మిగతావాళ్లు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ధనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ ఒక మంచి పాత్రలో కనిపిస్తాడు. ఏ ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. పాటలు మాత్రం తమిళ పాటలు వింటున్నట్టుగానే ఉంటాయి. అప్పుడప్పుడు తమిళ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది.


చివరగా రాయన్ సినిమా వైవిధ్యంతో కూడిన యాక్షన్ నేపథ్యంతో చెప్పిన కథ. ఇది ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. ధనుష్ దర్శకుడుగా నటుడుగా తన 50వ సినిమాని బాగా చేశాడు. సందీప్ కిషన్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్. ఒకసారి చూడొచ్చు.

Updated Date - Jul 26 , 2024 | 03:01 PM