Robinhood Review: రాబిన్ హుడ్ రివ్యూ
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:10 PM
నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రాబిన్‌హుడ్'. ఛలో, భీష్మ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రమిది. భీష్మ తర్వాత నితిన్‌తో వెంకీ చేసిన చిత్రంతో కావడం, శ్రీలీల మరోసారి నితిన్‌తో జతకట్టడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
రివ్యూ: రాబిన్‌హుడ్ (Robinhood Review)
విడుదల తేది: 28–3–2025
నితిన్ (Nithin) హీరోగా తెరకెక్కిన చిత్రం 'రాబిన్‌హుడ్'. ''ఛలో, భీష్మ'' చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వెంకీ కుడుముల (Venku Kudumula) దర్శకత్వం వహించిన చిత్రమిది. 'భీష్మ' తర్వాత నితిన్‌తో వెంకీ చేసిన చిత్రంతో కావడం, శ్రీలీల (Sree Leela) మరోసారి నితిన్‌తో జతకట్టడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కూడా ఈ సినిమాపై హోప్ పెంచుకున్నాడు. ప్రచారం బాగా చేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో (David warner) గెస్ట్ క్యారెక్టర్ చేయించారు. అదిదా సర్‌ప్రైజు పాటతో హాట్‌బ్యూటీ కేతిక శర్మ యూట్యూబ్‌ని షేక్ చేసింది. వీటన్నింటితో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది. నితిన్‌తో రెండో సినిమా చేసిన వెంకీ కుడుముల హిట్ కొట్టాడా.. ఈసారి శ్రీలీలది నాది, బెస్ట్ పెయిర్ అని నితిన్ చెప్పిన మాటలు నిజమయ్యాయ్యా? ఇవన్నీ తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ: (Robinhood Review)
రామ్ (నితిన్) ఓ అనాథ. ఆశ్రమంలో పెరుగుతుంటాడు. ఆ ఆశ్రమానికి ఆదాయ వనరులు లేకపోవంతో తనవంతు సాయం చేయాలనుకుంటాడు. అలా మంచి చేయడం కోసం రాబిన్ హుడ్‌గా మారతాడు. ధనికుల్ని దోచుకుని కష్టాల్లో ఉన్నవారికి, లేని వారికి సాయం చేస్తుంటాడు. తాను చేసే పనులపై పోలీసుల నిఘా పెరగడంతో రిస్క్ చేయడం వేస్ట్ అని భావించి ఆ పనికి దూరమవుతాడు. తదుపరి జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ (రాజేంద్రప్రసాద్) కు చెందిన ఇండియాస్ నంబర్‌వన్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనికి చేరతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల)కు సెక్యురిటీగా వెళ్తాడు రామ్. ఆమెను ఓ ముఠా ఫాలో అవుతుంది. అసలు నీరా ఎవరు? ఆమె ఇండియాలోని ఓ గ్రామానికి ఎందుకు వచ్చింది? తనకు ఎదురైన సమస్యలేంటి? సామి (దేవదత్తా నాగే)కు ఆమెకు లింక్ ఏంటి? నీరాకు రామ్ ఎలా సహకరించాడు? రాబిన్‌హుడ్ కోసం వెతుకుతున్న విక్టర్ (షైన్ టామ్ చాకో)కు దొరికాడా లేదా అన్నది కథ.
విశ్లేషణ:
రాబిన్ హుడ్ కథల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉన్నవాళ్ల దగ్గర దోచుకుని లేని వాళ్లకు పెట్టడం, సాయం అందించడం రాబిన్ హుడ్‌లో ఉన్న గుణం, వెంకీ కుడుముల కూడా ఏమాత్రం కొత్తదనం లేకుండా అదే కథతో ఈ సినిమాను వండారు. రవితేజ నటించిన 'కిక్' ఇలాంటి కథతోనే తెరకెక్కి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అయితే లవర్‌బాయ్, యాక్షన్ సినిమాలతో అలరించే నితిన్‌కు ఇది కొత్త కథ. రాబిన్‌హుడ్‌గా నితిన్ తెరపైకి రావడం, దోచుకోవడం సాయం చేయడం, పోలీసులకు దొరికిపోయాడు అనుకునే సమయంలో చాకచక్యంతో తప్పించుకోవడంతో ఫస్టాఫ్ బాగానే సాగుతుంది. దొంగగా ముందుకు సాగితే ఇబ్బందులు తప్పవని గ్రహించి సెక్యూరిటీగా మారడం , డబ్బున్న హీరోయిన్ పక్కన చేరడం, ఆ కథను ఓ విలేజ్‌కి లింక్ చేయడం వరకూ అంతా బాగానే ఉంది. ఆయా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. అయితే గంజాయి మాఫియా సీక్వెన్స్ మాత్రం బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. గంజాయి మాఫియాకు, గంజాయితో క్యాన్సర్ మందు తయారీ లైసెన్స్‌కి మధ్య లింక్ అతకలేదు. ఒక గ్రామంలో జనం, వారి మట్టి బతుకులు, నియంత లాంటి విలన్ ముందు బానిసలుగా బతుకుతున్న ఆ పాత్రల్లో దర్శకుడు భావోద్వేగాలను నింపలేకపోయాడు. మొదటి భాగం అంతా వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ బాగానే కామెడీ పంచారు. ద్వితీయార్థంకి వచ్చేసరికి కథ నత్తనడకన సాగుతుంది. బలమైన విలన్ ముందు హీరో పాత్ర తేలిపోయినట్లు అనిపించింది. విలన్ ఆటకట్టించడానికి హీరో వేసిన ఎత్తులు, ఇంటెలిజెన్స్ జెన్యూన్‌గా అనిపించలేదు. సెకెండాఫ్‌లో హీరోని రకరకాల ఐడియాలతో ఆడుకోవడం ఆసక్తికరంగా ఉంది. కథ, కథనం రొటీన్‌గా ఉన్నాయి. కథ రెగ్యులర్‌దే అయినా దర్శకుడు తెరకెక్కించిన తీరులో కొత్తదనం చూపించాలనుకున్నాడు. అది అంతగా వర్కవుట్ కాలేదు. పాట విడుదల కాగానే వివాదాలు సృష్టించిన ‘అదిదా సర్‌ప్రైజ్’లో ‘హుక్’ స్టెప్ మిస్ అయింది. వివాదం కారణంతో ఎడిట్ చేసినట్లు ఉన్నారు.
నటీనటులు పనితీరు.. హీరోగా నితిన్ ఎనర్జీతో యాక్ట్ చేశారు. స్టైలిష్ లుక్, ఈజ్‌తో మెప్పించారు. ఎప్పటిలాగే తన పరిధి మేరకు డాన్స్‌లు బాగానే చేశాడు. శ్రీలీల పాత్ర సినిమాకు కీలకమే అయినా ఆమెను చూపించిన విధానం పాత్ర నడక సో సో అన్నట్లు ఉంటుంది. జాన్ స్నోగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ ట్రాక్ కాస్త నవ్వించింది. అదే ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేసింది. ద్వితీయార్థంలో కూడా ఆ ట్రాక్ ఉండే బావుండేది. విలన్ క్యారెక్టర్ అత్యంత బలంగా, గంభీరంగా ఉంది. కానీ హీరో ముందు మాటలతో తప్ప చేతలతో విలనీ ఏమీ చూపించలేదు. మంచి నటుడిగా గురించి పొందిన మైమ్ గోపీ పాత్ర తేలిపోయింది. నటన పరంగా అతన్ని సరిగ్గా వాడుకో లేదనిపించింది. విలన్ క్యారెక్టర్స్ ఇట్టే డల్ చేసేశాడు. ప్రారంభంలో మైమ్ గోపీ పాత్ర మెయిన్ విలన్ కన్నా క్రూరం అన్నంత బిల్డప్ క్రియేట్ చేసి ఒక్కసారిగా ఆ పాత్రను పడేశాడు. క్లైమాక్స్‌లో మెయిన్ విలన్ సామి పాత్ర కూడా అలాగే పడిపోయింది. డేవిడ్ వార్నర్ ఎంట్రీ స్టైలిష్‌గా ఉంది. కాకపోతే ఆ పాత్ర వల్ల పెద్ద ఇంపాక్ట్ కనిపించలేదు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం బాగుంది. షైన్ టామ్ ఛాకో క్యారెక్టర్ ఫస్టాప్‌లో పవర్‌ఫుల్‌గా ఉన్నా.. క్లైమాక్స్‌లో పడిపోయింది. దర్శకుడు వెంకీ బలం రచన. ఆ బలంతోనే రొటీన్ కథను ముందుకు లాక్కురావాలనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. సినిమా చూస్తున్నంత సేపు ఫలానా సీన్ ఎక్కడో చూశామే అనిపిస్తుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అంత ఇంపుగా లేదు. పాటలు వినడానికి, విజువల్‌గానూ బావున్నాయి. బాగా పిక్చరైజ్ చేశారు. కెమెరా వర్క్ నీట్‌గా ఉంది. ఎడిటింగ్ కాస్త షార్ప్‌గా ఉండుంటే బావుండేది. నిర్మాణంలో మైత్రీ మూవీస్ ఎక్కడా తగ్గలేదు. కిక్ తరహా కథకు కొన్ని కొత్త హంగులు జోడించి మిక్సి పట్టి తెరపై చూపించారు. అంచనాలతో సినిమాకి వెళ్తే నిరాశ తప్పదు. పాత కథనే కాస్త రిపేర్ చేసి దర్శకుడు చూపించాడనే భావన కలగగ మానవు.
ట్యాగ్: 'కిక్' ఇవ్వని... 'రాబిన్ హుడ్'
ALSO READ: Veera Dheera Soora Review: చియాన్ విక్రమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..
Mad Square Movie review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ..
L2: Empuraan Review: మోహన్ లాల్ 'ఎల్ 2: ఎంపురాన్' మెప్పించిందా