Shanmukha Movie Review: ఆది సాయికుమార్ 'షణ్ముఖ'తో హిట్ కొట్టాడా..
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:14 PM
ఆది సాయి కుమార్, అవికా గోర్ జంటగా నటించిన డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ' ఎలా ఉందంటే..
మూవీ రివ్యూ: షణ్ముఖ (Shanmukha movie Review)
విడుదల తేదీ: 21-3-2025
నటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, కృష్ణుడు, అరియనా, చిత్ర శీను తదితరులు
సినిమాటోగ్రఫీ ఆర్.ఆర్. విష్ణు
ఎడిటర్ ఎంఏ మాలిక్
సంగీతం రవి బస్రూర్
దర్శకుడు షణ్ముగం సప్పని (Shanmugam Sappani)
కొందరు అదృష్టవంతులు ఉంటారు... విజయాలు దక్కకపోయినా... అవకాశాలకు మాత్రం కొదవ ఉండదు. ఆ కేటగిరికి చెందిన హీరోనే ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) అతనికి సాలీడ్ హిట్ వచ్చి ఎన్నేళ్ళు అయ్యిందంటే చెప్పడం కష్టం. అయినా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వాటిలో కాస్తంత భిన్నమైన కథలనే ఎంచుకుని ఆది చేస్తున్నాడు కానీ విజయం మాత్రం ముఖం చాటేస్తోంది. ఆది సాయికుమార్ హీరోగా షణ్ముగం సాప్పని తెరకెక్కించిన డివోషనల్ ధ్రిల్లర్ 'షణ్ముఖ' (Shanmukha)శుక్రవారం జనం ముందుకొచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం.
ఆ మధ్య సాప్పని బ్రదర్స్ 'శాసనసభ' పేరుతో భారీ స్థాయిలో ఓ సినిమాను నిర్మించారు. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా వెనుకడుగు వేయకుండా ఇప్పుడు 'షణ్ముఖ' చిత్రాన్ని నిర్మించారు. విశేషం ఏమంటే... ఈ సినిమాకు ఆ అన్నదమ్ముల్లో ఒకరైన షణ్ముగం సాప్పని డైరెక్టర్! అంతేకాదు... ఇందులో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. 'కేజీఎఫ్, సలార్' చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ దీనికి మ్యూజిక్ అందించాడు. అవికా గోర్ హీరోయిన్ గా నటించింది.
ఇంతకూ సినిమా కథేంటంటే... ఓ గ్రామంలో ఉండే విగాండ (చిరాగ్ జానీ)కి కొడుకు పుడతాడు. అతనికి ఆరు ముఖాలు ఉంటాయి. వికృతంగా ఉన్న ఆ కొడుకు మామూలుగా మారాలంటే వివిధ రాశులకు చెందిన యువతులను బలి ఇవ్వాలని ఓ మాంత్రికుడు చెబుతాడు. దాంతో బావమరిది సాయంతో అమ్మాయిలను కిడ్నాప్ చేయించి, హత్య చేస్తుంటాడు విగాండ. రీసెర్చ్ స్కాలర్ సారా (అవికా గోర్) దృష్టిలోకి ఈ అమ్మాయిల మిస్సింగ్ అంశం వస్తుంది. దీనిపై పరిశోధన చేయాలని ఆమె భావిస్తుంది. అందుకోసం గతంలో తాను బ్రేకప్ చెప్పిన పోలీస్ ఆఫీసర్ కార్తీ (ఆది సాయికుమార్) సాయం కోరుతుంది. మొదట ఆమె వాదనలో పసలేదని భావించిన ఆది... ఆ తర్వాత నిజాన్ని తెలుసుకుంటాడు. కిడ్నాప్ కు గురి అయిన అమ్మాయిలు, ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి బోయ్ ఫ్రెండ్స్ గురించి ఆచూకీ తీయడం మొదలెడతాడు. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయిన విగాండ ను కార్తీ, సారా పట్టుకోగలిగారా? అతనికి చట్టప్రకారం శిక్ష వేయించగలిగారా? కురూపిగా పుట్టిన కొడుకును మామూలు వాడిని చేయాలనుకున్న విగాండ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే ఈ చిత్ర కథ. (Shanmukha movie Review)
విశ్లేషణ.. (Shanmukha movie Review)
పేరుకు ఇది డివోషనల్ థ్రిల్లర్ తప్పితే... ఇందులో డివోషన్ లేదు... థ్రిల్లింగ్ అంశాలూ లేవు. 'షణ్ముఖ' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ముందుగా అనుకుని ఈ కథను రాసుకున్నట్టు ఉంది తప్పితే మరొకటి కాదు. ఆరు ముఖాలతో పుట్టిన పిల్లాడిని మామూలు వాడిని చేయడం కోసం అతి కిరాతకంగా అమ్మాయిలను హత్యలు చేయడమనేది ఏ రకంగానూ ఆసక్తి కలిగించని పాయింట్. దీనికి తోడు సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ కథ ఎటు వైపు వెళుతోందో అర్థం కాదు. అసలు ఇది ఏ కాలంలో జరుగుతున్న కథ? అనే సందేశమూ కలుగుతుంది. ఆది సాయికుమార్, అవికా గోర్ పాత్రలు, వారి ప్రాధాన్యతలు చూసినప్పుడు ఇది ప్రస్తుతం జరుగుతున్న స్టోరీనే అనే విషయం అర్థమౌతుంది. కానీ విగాండ, అతను చేసే క్షుద్రపూజలు చూసినప్పుడు... కొన్ని వందల సంవత్సరాల క్రితం కథను ఇప్పుడు చెబుతున్నారేమోనని పిస్తుంది. కొడుకును మామూలు మనిషిని చేయడం కోసం అమ్మాయిలను బలి ఇవ్వడం సరే... వారి ప్రియులను ఆత్మహత్యకు పురిగొల్పడం ఎందుకో అర్థం కాదు. సింపుల్ గా చెప్పాల్సిన స్టోరీని క్లిష్టతరం చేసి... ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. దాంతో తెర మీద కనిపించే ఏ పాత్రతోనే కాదు... ఏ సన్నివేశంతోనూ ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. (Shanmukha movie Review)
నటీనటుల విషయానికి వస్తే... ఆది సాయికుమార్ ఈ సినిమా కోసం పెద్దంత కష్టపడినట్టు అనిపించదు. పోలీస్ ఆఫీసర్ పాత్ర, క్షుద్రశక్తులను ఎదుర్కొనే అవసరం ఉన్న కథ కావడంతో కాస్తంత యాక్షన్ పార్ట్ నూ చూపించారు. అవికా గోర్ అందం, అభినయం... రెండూ నిరాశకు గురిచేస్తాయి. ఆమె పోషించిన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నా... ఆమె మెప్పించలేకపోయింది. మెయిన్ విలన్ విగాండ గా చిరాగ్ అలీ నటించాడు. ఇప్పటి వరకూ పలు చిత్రాలలో హీరోగానూ, కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలను పోషించిన ఆదిత్య ఓం విలన్ పాత్ర పోషించాడు. కానీ అతని మార్క్ ఏమీ చూపించలేదు. దర్శకుడు షణ్ముగం 'బుల్లెట్' గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. ఇతర పాత్రలను కృష్ణుడు, మధుమణి, మనోజ్ నందం, చిత్రం శ్రీను, అరియానా, వీరశంకర్, సీవీఎల్ నరసింహారావు తదితరులు పోషించారు. సాంకేతికంగానూ ఈ సినిమా ఏమంత గొప్పగా లేదు. విఎఫ్ఎక్స్ ఆశించిన స్థాయిలో లేవు. సినిమా చివరిలో వచ్చే ఏ.ఐ. సాంగ్ లో తప్పితే డివోషనల్ టచ్ మరెక్కడా కనిపించదు.
ట్యాగ్ లైన్: డివోషనల్ కిల్లర్ 'షణ్ముఖ'