Mad Square Movie review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:27 PM
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన 'మ్యాడ్ స్క్వేర్' మూవీ శుక్రవారం జనం ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఏ రీతిన ప్రేక్షకులను మెప్పిస్తోందో తెలుసుకుందాం...
'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) మూవీ రిలీజ్ కు ముందు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) కరెక్టే చెప్పారు. స్టోరీ, లాజిక్ జోలుకు పోకుండా థియేటర్ కు వచ్చే వాళ్ళకు 'మ్యాడ్ మ్యాక్' కిక్ ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆ మాట నిజమే! వాటిని పక్కన పెడితే మ్యాడ్ స్క్వేర్ కిక్కిస్తుంది. రెండేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'మ్యాడ్' (Mad) మంచి సక్సెస్ అందుకుంది... కంటెంట్ పెద్దగా లేకపోయినా యూత్ ను అట్రాక్ట్ చేసిందా సినిమా. ఇప్పుడు అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తోనే మ్యాడ్ స్క్వేర్ ను తెరకెక్కించి, డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ను ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్.
సినిమాలో కథ ఉండదని మేకర్స్ ముందే చెప్పేశారు. అయితే... చెప్పుకోవడానికి ఓ పాయింట్ అయితే ఉంటుంది కదా! అదేమిటో చూద్దాం... ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత డీడీ (సంగీత్ శోభన్ Sangeeth Sobhan), అశోక్ (నార్నే నితిన్ Narne Nithin), మనోజ్ (రామ్ నితిన్ Ram Nithin) ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు. సొంత ఊళ్ళో సర్పంచ్ అయిపోవాలని తెగ ఆరాట పడుతుంటాడు డీడీ. బాగా రిచ్ అయిన అశోక్ ఏదో అలా... అలా కాలక్షేపం చేసేస్తుంటాడు. ఇక మనోజ్ అయితే... తన లవ్ బ్రేకప్ గురించి పబ్ లో అమ్మాయిలకు చెప్పి సింపతీ సంపాదిస్తూ, అక్కడే పనిచేస్తుంటాడు. ఇలాంటి టైమ్ లో గణేశ్ ఉరఫ్ లడ్డూ (విష్ణు) పెళ్ళి కుదిరిందని వీళ్ళకు తెలుస్తుంది. పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా అక్కడ ఈ త్రీ ఇడియట్స్ ప్రత్యక్షమైపోతారు. వీళ్ళ కారణంగా తన పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని లడ్డు భయపడతాడు. అతను అనుకున్నంత పనీ జరుగుతుంది. పెళ్లి కూతురు ఎవరితోనో లేచిపోతుంది! దాంతో డీలా పడ్డ లడ్డూను ఓదార్చడం కోసం ఈ ముగ్గురూ గోవా తీసుకెళతారు. వీళ్ళు ఎంట్రీ ఇచ్చిన సమయంలోనై అక్కడి మ్యూజియంలో వాస్కో డి గామాకు చెందిన చైన్ మ్యూజియం నుండి మాయమౌతుంది. దాంతో ఈ రాబరీ కేసులో వీళ్ళు ఇరుక్కుంటారు. ఊహించని ఈ కేసు నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు? స్నేహితులను నమ్ముకుని గోవా వెళ్ళిన లడ్డు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే 'మ్యాడ్ స్క్వేర్' కథ!
విశ్లేషణ:
నాగవంశీ చెప్పినట్టు... ఇందులో బలమైన కథ లేదు. సీన్స్ లో లాజిక్ లేదు! కాకపోతే... మూవీ ఓపెనింగ్ నుండి ఎండింగ్ వరకూ నాన్ స్టాప్ గా నవ్వులే ఉంటాయి. డీడీ ఎంట్రీ కాస్తంత రొటీన్ గా ఉండి బోర్ కొట్టినా... మనోజ్ పబ్ సీన్ తో సినిమా గాడిలో పడింది. పెళ్లి చేసుకోబోతున్న లడ్డూ ఇంట్లోకి వీళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుండి మూవీ పరిగెత్తింది. ఇంటర్వెల్ తర్వాత గోవాలోని సీన్స్ కొన్ని బోర్ కొట్టించినా... క్లయిమాక్స్ ట్విస్ట్ ఊహకందనిది కావడంతో ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తారు. ఆవారాగా తిరిగే స్నేహితులు, గోవా ట్రిప్... అక్కడో క్రైమ్ లో ఇరుక్కోవడం... ఇలాంటి కథలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో లాజిక్ లేకపోయినా... ఎంగేజింగ్ గా తీస్తే జనాలు ఎప్పుడూ ఆదరిస్తారు. మ్యాడ్ స్క్వేర్ విషయంలోనూ అదే జరిగింది... కొన్ని సీన్స్ అనుకున్న విధంగా పండకపోయినా... వీలైనంత ఫన్ జనరేట్ చేయడానికి దర్శకుడు కళ్యాణ్ శంకర్ కృషి చేశాడు. 'మ్యాడ్'కు సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు 'మ్యాడ్ మ్యాక్స్' అనే పేరు మొదట ప్రకటించారు. ఇందులో సునీల్ క్యారెక్టర్ పేరు మ్యాక్స్. అయితే... ఇదే నిర్మాతలు తీసిన 'టిల్లు స్క్వేర్' ఎప్పుడైతే సక్సెస్ సాధించిందో... అప్పుడే సెంటిమెంట్ గా దీని పేరు కూడా 'మ్యాడ్ స్క్వేర్'గా మార్చేశారు.
నటీనటుల విషయానికి వస్తే... సంగీత్, నితిన్, రామ్... వాళ్ళతో పాటు విష్ణు ఎక్కడా ఎనర్జీ లెవల్స్ డ్రాప్ కాకుండా బాగా తమ పాత్రలను పండించారు. మురళీధర్ గౌడ్ తో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు కాస్తంత ఎబ్బెట్టుగా ఉన్నా... ఆయన తనదైన బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన 'సత్యం' రాజేశ్, సునీల్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు... బాగానే ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నించారు. ప్రియాంక జువాల్కర్ పాత్ర ఏమంత చెప్పుకోదగ్గది కాదు. 'సామజవర గమన'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా జాన్ ఇందులో ఐటమ్ సాంగ్ చేసింది. అదే పాటలో గీత రచయిత కాసర్ల శ్యామ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఇక 'మ్యాడ్'లో అతిథి పాత్రలో మెరిసిన అనుదీప్ కె.వి. ఇందులోనూ సెంటిమెంటల్ గా సెకండ్ హాఫ్ లో కనిపించాడు.
భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫీ బాగుంది. ముఖ్యంగా గోవా నగరాన్ని బాగా క్యాప్చర్ చేశారు. నవీన్ నూలి షార్ప్ ఎడిటింగ్ కారణంగా మూవీ చకచకా సాగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సో... ఈ సమ్మర్ సీజన్ లో యూత్ ను 'మ్యాడ్ స్క్వేర్' బాగానే ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నట్టు ఈ మ్యాడ్ స్క్వేర్ కూ సీక్వెల్ ఉంటుందట... బీ రెడీ!!
ట్యాగ్ లైన్: సమ్మర్ టైమ్ పాస్!
Also Read: Veera Dheera Soora Review: చియాన్ విక్రమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి