Sikandar Review: సికందర్ మూవీ రివ్యూ

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:20 PM

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గట్టి హిట్ పడి చాలా కాలం అయ్యింది. అతని తోటి హీరోలు కలెక్షన్స్ పరంగా ముందుకు సాగుతుంటే... సల్మాన్ ఖాన్ సినిమాలు కనీసం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు.

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు (Salman Khan)గట్టి హిట్ పడి చాలా కాలం (Sikandar Movie review) అయ్యింది. అతని తోటి హీరోలు కలెక్షన్స్ పరంగా ముందుకు సాగుతుంటే... సల్మాన్ ఖాన్ సినిమాలు కనీసం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్న షారుఖ్ ఖాన్ కు రెండేళ్ళ క్రితం 'పఠాన్, జవాన్' చిత్రాల రూపంలో మంచి విజయం దక్కింది. అందులో 'జవాన్' మూవీ తమిళ దర్శకుడు అట్లీ తీసిందే. సో... మరో తమిళ దర్శకుడు మురుగదాస్ తో మూవీ చేస్తే తనకూ అలాంటి ఓ మ్యాజిక్ జరుగుతుందని సల్మాన్ భావించి ఉండొచ్చు. మురుగదాస్ 'సికందర్' స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వీరిద్దరి కాంబోలో సాజిద్ నడియాద్ వాలా 'సికందర్' (Sikandar)మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఈద్ కానుకగా ఆదివారం ఇది ప్రేక్షకుల  ముందుకు వచ్చింది. ఎందుకో గానీ 'సికిందర్'కు అనుకున్నంత బజ్ రిలీజ్ ముందు రాలేదు. ఆ విషయాన్ని అంగీకరిస్తున్నట్టుగా సల్మాన్ సైతం రిలీజ్ కు ముందు కాస్తంత ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాది చిత్రాలను తాము ఆదరించినట్టు, దక్షిణాది వారు తమ చిత్రాలను ఆదరించడం లేదని వాపోయాడు. ఇదిలా ఉంటే... ఇప్పటికే 'యానిమల్, పుష్ప -2, ఛావా' చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) తొలిసారి సల్మాన్ సరసన 'సికందర్'లో నటించింది. ఆమె లక్ అయినా సల్మాన్ కు కలిసి వస్తుందేమోనని అంతా అనుకున్నారు. మరి 'సికందర్' విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

మురుగదాస్ మూవీ అంటే కథ, కథనం కాస్తంత కొత్తగా ఉంటాయని,  సమాజహితాన్ని కోరే విధంగా ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఎందుకో మురుగదాస్ వెనకపడ్డాడు. ఓ పాత కథను తీసుకుని ఏ మాత్రం ఆసక్తి కలిగించకుండా తెరకెక్కించాడు. ఇంతకూ కథేమిటంటే(Sikandar Movie review) ... రాజ్ కోట్ లోని రాజవంశానికి చెందిన ఆఖరి వారసుడు సంజయ్ ఉరఫ్ సికందర్ (సల్మాన్ ఖాన్). ప్రజలకు అతనంటే అమితమైన ప్రేమ. ఆ ప్రాంత ప్రజలు సైతం సికందర్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి సికందర్ భార్య సాయిశ్రీ (రశ్మిక మందణ్ణ) ఓ దుర్ఘటనలో మరణిస్తుంది. ఆమె కోరిక మేరకు అవయవ దానం చేస్తారు. అయితే... ఆమె అవయవాలు ఎవరైతే పొందారో వారి ప్రాణాలు చిక్కల్లో పడతాయి. వారిని కాపాడటం కోసం సికందర్... రాజ్ కోట్ వదిలి ముంబైకు ప్రయాణమౌతాడు. ప్రజల మాన ప్రాణాలను రక్షించడానికి తపించే సంజయ్ కు మినిస్టర్ రాకేశ్ ప్రధాన్ నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?  అతని భార్య మరణం వెనుక జరిగిన కుట్ర ఏమిటీ? ఆమె అవయవాలను పొందిన వారికి ఎందుకు ఇబ్బందులు కలిగాయి? వాటిని ఎలా సంజయ్ సాల్వ్ చేశాడు? అనేదే మిగతా కథ.


విశ్లేషణ 

ఎలాంటి ఆసక్తి కలగని ఓ కథను రాసుకుని, మురుగదాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కనీసం కథనమైన ఆసక్తికరంగా ఉందా అంటే అదీ లేదు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఇలాంటి కథను ఎలా యాక్సెప్ట్ చేశాడో అర్థం కాదు. హిందీలో ఆమీర్ ఖాన్ తో 'గజిని' లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తీసిన మురుగదాసే ఈ సినిమా చేశాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. తన కెరీర్ గ్రాఫ్‌ దారుణం పడిపోతున్న సమయంలో సల్మాన్ ఇలాంటి స్టోరీ ఎందుకు ఎంపిక చేసుకున్నాడనే సందేహం రాకమానదు. ఓ మాస్ హీరో భార్యావియోగంతో బాధపడుతూ రోజులు వెళ్ళదీయడాన్ని అభిమానులు ఎలా హర్షిస్తారని మేకర్స్ అనుకున్నారో! పైగా ఆ సన్నివేశాల్లో సల్మాన్ అంత గొప్ప పెర్ఫార్మెన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. అయితే యాక్షన్ పార్ట్, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్తంత మెరుగ్గా ఉండి, మూవీని నిలబెట్టే ప్రయత్నం చేశాయి.

నటీనటుల విషయానికి వస్తే... సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్స్ లో మాత్రమే కాస్తంత కష్టపడినట్టుగా అనిపిస్తుంది. మిగిలిన సన్నివేశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రశ్మిక మందణ్ణ హీరో, ప్రొడక్షన్ హౌస్ లకు ప్రాధాన్యం ఇచ్చిందే కానీ కథకు కాదనే విషయం తెలిసిపోతోంది. ఇటీవల వచ్చిన సినిమాల్లో తనదైన ముద్రను వేయడానికి రశ్మిక ప్రయత్నించింది. ఆ విషయంలో సక్సెస్ అయ్యింది. ఇలాంటి టైమ్ లో మరింత జాగ్రత్తగా ఆమె స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోవాలి. ఇందులో కథ ఆమె చుట్టూ తిరిగేదే అయినా...  స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది. ఇక కాజల్ అగర్వాల్ ఈ మూవీ ఎందుకు అంగీకరించిందో ఆమెకే తెలియాలి. సత్యరాజ్, ప్రతీక్ బబ్జర్, కిశోర్, శర్మాన్ జోషి, జతిన్, సంజయ్ కపూర్ వంటి వారు ఇందులో కీలక పాత్రలు పోషించినా పెద్దంత ఇంపాక్ట్ ను కలిగించలేకపోయారు.

ఈద్ సీజన్ లో సల్మాన్ ఖాన్ కు గ్రాండ్ సక్సెస్ లు ఉన్నాయి... అలానే ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. 'సికందర్' మూవీ రెండో కోవకు చెందింది. ఆది, సోమవారాలు సెలవు రోజులు కాబట్టి కాస్తంత ఓపెనింగ్స్ ఉండొచ్చు కానీ ఆ తర్వాత కష్టమే. సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ హీరో తమ చిత్రాలను ఎందుకు ప్రేక్షకులు చూడటం లేదనే ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. లేకపోతే... ఫ్లాప్స్ బారి నుండి ఎవరూ అతన్ని రక్షించలేరు.

ట్యాగ్ లైన్: సికిందర్... సహనానికి పరీక్ష!

Updated Date - Mar 31 , 2025 | 02:22 PM