Mehreen Pirzada: శృంగార సన్నివేశంలో వృత్తి, జాబ్ లో భాగంగా చేసాను, విమర్శించడం సరి కాదు

ABN , First Publish Date - 2023-10-17T18:19:49+05:30 IST

మెహ్రీన్ తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయం వున్న పేరు. 'ఎఫ్2', 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ', 'రాజా ది గ్రేట్' లాంటి విజయవంతమైన సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమధ్యనే 'సుల్తాన్ అఫ్ ఢిల్లీ' అనే వెబ్ సిరీస్ లో కొన్ని శృంగార సన్నివేశాల్లో నటించినందుకు ట్రోల్ చేస్తే, వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పింది.

Mehreen Pirzada: శృంగార సన్నివేశంలో వృత్తి, జాబ్ లో భాగంగా చేసాను, విమర్శించడం సరి కాదు
Mehreen Pirzada

తెలుగులో బాగా ప్రాముఖ్యం వహించిన నటి మెహ్రీన్ (MehreenPirzada). ఆమె ''కృష్ణగాడి వీర ప్రేమ గాథ', 'ఎఫ్ 2' #F2, 'ఎఫ్ 3', 'రాజా ది గ్రేట్', 'మహానుభావుడు' లాంటి చిత్రాలలో చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఇప్పుడు వార్తల్లో వుంది. మెహ్రీన్ 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' #SultanOfDelhi అనే వెబ్ సిరీస్ లో చేసింది, అందులో కొన్ని శృంగార సన్నివేశాలలో కూడా మెహ్రీన్ కనిపించింది. అయితే సాంఘీక మాధ్యమంలో ఆమెని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అవన్నీ శృంగార సన్నివేశాలు అని, ఆమెని విపరీతంగా ట్రోల్ చెయ్యడంతో మనస్తాపానికి గురైన మెహ్రీన్ తన సాంఘీక మాధ్యమంలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టి, ఇలా ట్రోల్ చేస్తున్న వారందరికీ చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.

SultanOfDelhi.jpg

కొన్ని సార్లు స్క్రిప్ట్ కొన్ని సన్నివేశాలను డిమాండ్ చేస్తుందని, అయితే వృత్తి కి న్యాయం చెయ్యడం కోసం, అలాగే ఒక వుద్యోగంగా భావించి, ఆ సన్నివేశాలని చేస్తాను అని చెప్పింది మెహ్రీన్. నటన అనేది ఒక కళ అని, తనకి ఆ కళ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. "ఢిల్లీ సుల్తాన్‌లో క్రూరమైన వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే సన్నివేశం ఉంది. అలాంటి అత్యాచార సమస్యను చూపించినప్పుడు మీడియాలో చాలా మంది 'శృంగార సన్నివేశం'గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ఇటువంటి సమస్యని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఒక సమస్యని ఈ వెబ్ సిరీస్ లో చూపిస్తే, దాన్ని సాంఘీక మాధ్యమంలో కొందరు, అలాగే కొన్ని మీడియాలు ఆ ఒక్క సన్నివేశాన్ని పట్టుకొని ట్రోల్ చెయ్యడం సరి కాదు," అని చెప్పింది మెహ్రీన్.

mehreen-pirzada1.jpg

ఇలా ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కూడా సోదరీమణులు, కుమార్తెలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళు తమ జీవితంలో ఇటువంటి బాధను అనుభవించకూడదని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. మహిళలపై క్రూరత్వం చూపటం, హింస అనే ఆలోచనే ఒక అసహ్యకరమైనదిగా భావిస్తాను అని చెప్పుకొచ్చింది. ఆలాగే అటువంటి సన్నివేశాలు చేసేటప్పుడు షూటింగ్ సమయంలో నటులు అసౌకర్యం లేకుండా చూసుకోవడంలో ఆ వెబ్ సిరీస్ టీము చాలా బాగా చూసుకున్నారు, అలాగే చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు అని చెప్పింది మెహ్రీన్.

మహాలక్ష్మి అయినా, సంజన అయినా, హనీ అయినా నా ప్రేక్షకుల కోసం ఆర్టిస్ట్‌గా ప్రతి పాత్రలోనూ నా సత్తా చాటాలని ఆశిస్తున్నాను అని చివరగా చెప్పింది.

Updated Date - 2023-10-17T18:22:13+05:30 IST