Ramam Movie: రామరాజ్యాన్ని కనెక్ట్ చేస్తూ..
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:51 PM
శ్రీరామనవమి సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి ‘రామం’ అనే పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్.
శ్రీరామనవమి సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి ‘రామం’ అనే పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ధర్మ సంస్థాపనకు యుద్ధం చేసిన రాముడి అడుగు జాడల్లో నడుస్తూ .. ఆయన చూపిన బాట ప్రపంచానికి ఆదర్శం అని చాటి చెప్పే వీరుడుకి సంబంధించి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఓ గొప్ప యోధుడికి సంబంధించిన కథాంశంతో రూపొందుతోన్న సినిమా ఇది. టాలీవుడ్ లో పలువురి దర్శకుల దగ్గర పని చేసిన లోకమాన్యని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ విలువలతో పాన్ ఇండియా మూవీగా ‘రామం’ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ‘రామం’ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘సమస్త మానవాళికి తారక మంత్రం శ్రీరామనామం. ధర్మ సంస్థాపనకు శ్రీరామచంద్రుడు చూపిన బాటే కాదు.. అధర్మం నిర్మూలించటానికి ఆయన కోదండం చేపట్టి చూపిన వీరత్వం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అలాంటి గొప్ప సమగ్ర మూర్తిమత్వాన్ని ఆధారంగా చేసుకుని.. నేటి కాలంలో అలనాటి రామరాజ్యాన్ని కనెక్ట్ చేస్తూ ఇప్పటి వరకు రానటువంటి వైవిధ్యమైన కథతో ‘రామం’ సినిమా మీ ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. దేశ వ్యాప్తంగా అగ్ర నటీనటులు,సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.