Rudrudu film review: రాఘవ లారెన్స్ సినిమా ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-04-14T14:19:28+05:30 IST

హారర్ కామెడీలతో విజయాలు సాధించిన రాఘవ లారెన్స్ ఈసారి ఒక యాక్షన్ సినిమా 'రుద్రుడు' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రియ భవాని శంకర్ కథానాయకురాలు, దీనికి కతిరేసన్ దర్శకుడు, నిర్మాత. ఈ సినిమా ఎలా ఉందంటే...

Rudrudu film review: రాఘవ లారెన్స్ సినిమా ఎలా ఉందంటే...

సినిమా: రుద్రుడు

నటీనటులు: రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్, నాస్సర్, పూర్ణిమ భాగ్యరాజ్, శరత్ కుమార్

ఛాయాగ్రహణం: ఆర్.డి. రాజశేఖర్

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

నేపధ్య సంగీతం: సామ్ సి.ఎస్

నిర్మాత, దర్శకుడు: కతిరేసన్

-- సురేష్ కవిరాయని

రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కథానాయకుడిగా తమిళ సినిమా 'రుద్రన్' (Rudhran) తెలుగులో 'రుద్రుడు' (Rudrudu) గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇందులో ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar) కథానాయికగా నటించగా, సీనియర్ నటులు నాస్సర్ (Nassar), పూర్ణిమ భాగ్యరాజ్, (Poornima Bhagyaraj) శరత్ కుమార్ (R Sarath Kumar) లు కూడా వున్నారు. ఈ సినిమాకి కతిరేసన్ దర్శకుడు, నిర్మాత కూడా. రాఘవ లారెన్స్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా, 'కాంచన' (Kanchana), 'ముని' (Muni) లాంటి హారర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. ఇప్పుడు ఈ 'రుద్రుడు' (RudruduFilmReview) ఎలా వుందో చూద్దాం.

rudrudureview1.jpg

Rudrudu story రుద్రుడు కథ:

రుద్ర (రాఘవ లారెన్స్) ఒక సాధారణ ఉద్యోగి, తల్లి దండ్రులతో (నాసర్, పూర్ణిమ భాగ్యరాజ్) హ్యాపీ గా ఉంటూ ఉంటాడు. అతనికి అనన్య (ప్రియా భవాని శంకర్) తో పరిచయం, ప్రేమగా మారడం పెళ్లి వరకు దారితీయటం జరుగుతుంది. రుద్ర తండ్రి తన ట్రావెల్ కంపెనీ ని విస్తరించడం కోసం రూ.6 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటాడు, #RudruduFilmReview కానీ తన స్నేహితుడు మోసం చెయ్యడంతో ఆ డబ్బు పోవటమే కాకుండా దానికి వడ్డీ కట్టలేక గుండెపోటుతో మరణిస్తాడు. రుద్ర ట్రావెల్ కంపెనీ అమ్మేసి కొంత అప్పు తీరుస్తాడు, అలాగే కంపెనీ వాళ్ళు లండన్ వెళ్ళమంటే ముందు తల్లిని, భార్యని వదిలి వెళ్ళటానికి ఇష్టపడడు కానీ అప్పు తీర్చాలని వెళతాడు. ఇండియా నుండి భార్య, కూతురు లండన్ వచ్చి కొన్నాళ్ళు రుద్రతో వుంటారు. #RudruduReview మళ్ళీ ఇండియా వెళ్ళటానికి భార్య అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరుతుంది, కానీ ఇండియా లో ఇంటికి చేరుకోదు. ఈలోగా రుద్ర తల్లి మరణిస్తుంది. రుద్ర, కూతురితో ఇండియా వచ్చేస్తాడు. రుద్ర తల్లిది సహజ మరణేమేనా, భార్య ఎక్కడికి వెళ్ళింది, ఎలా మాయం అయింది, దీని వెనక వున్న మిస్టరీ ఏంటి చూడాలంటె 'రుద్ర' చూడాలసిందే.

rudrudureview2.jpg

విశ్లేషణ:

రాఘవ లారెన్స్ సినిమాలన్నీ కొంచెం లౌడ్ గా ఉంటాయి. అయితే ఇంతకు ముందు అతను తీసిన 'కాంచన' గానీ 'ముని' గానీ విజయం సాధించాయి అంటే అందులో చిన్న సస్పెన్స్, హారర్, కామెడీ ఎలెమెంట్స్ వున్నాయి. ఇప్పుడు ఈ 'రుద్ర' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి కతిరేసన్ దర్శకుడు ఇది అతనికి మొదటి సినిమా. మామూలుగా వేరే భాష సినిమాని తెలుగులో విడుదల చేయాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న సాంకేతిక మార్పులు చేస్తారు, అంటే పేరులున్న బోర్డులు లాంటివి తమిళం లో కాకుండా తెలుగులో ఉండేట్టు. కానీ ఈ 'రుద్రుడు' సినిమా అలాంటిదేమీ లేకుండా కేవలం డబ్బింగ్ మాత్రం చేసి విడుదల చేశారు. అందువల్ల ఇది ఏ కోసం తెలుగు సినిమాల కనిపించదు.

దానికి తోడు సినిమాలో చెప్పాలనుకున్న కథ కూడా అంత తొందరగా రాదు. సినిమా మొదలవ్వటమే ఒక పెద్ద పోరాట సన్నివేశంతో మొదలవుతుంది. ఆ తరువాత ఇంకా 'రుద్రుడు' కాదు రుద్ధుడే. అప్పట్లో ఒక ఫార్ములా ఉండేది కదా, విరామం కి ముందు మూడు పాటలు, కొన్ని పోరాట సన్నివేశాలు, అలాగే విరామం తరువాత కూడా. అలాంటి ఫార్ములా సినిమా ఇది. పాటల కోసం కథానాయిక, అలాగే కొన్ని పోరాట సన్నివేశాలు, అవి కూడా దారుణం అంటే, ఒక్కడే చిన్న దెబ్బ తగలకుండా సుమారు 50 మందిని కొట్టేస్తూ ఉంటాడు.

rudrudureview3.jpg

ఇవన్నీ ఇలా ఉంటే, ఆ నేపధ్య సంగీతం అయితే చెవులు బద్దలు అయిపోతాయా అన్నంతగా వుంది. పాటలు అర్థం కావు, ఆ డాన్సులు కూడా. అందరికీ తెలిసిపోతూ ఉంటుంది, ఇప్పుడు ఒక పాట వస్తుంది, అలాగే ఇప్పుడు ఒక పోరాట సన్నివేశం వస్తుంది. అందరూ ఓవర్ యాక్షన్ చేస్తూ వుంటారు. తమిళ ప్రేక్షకులకి చావు చూపించటం బాగా ఇష్టం ఏమో, బాబోయ్ రుద్ర తల్లి చనిపోయినప్పుడు చూడాలి, ఆ సన్నివేశాలూ వాళ్ళ ఓవర్ యాక్షన్. ఇంతకీ సినిమా కథ ఏంటి అనేది చివర్లో వస్తుంది. అంతవరకు సస్పెన్స్. లాజిక్ ఉండదు. ఒక్కోసారి అయితే ఆ కొట్టుకోవటాలు అంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది కూడా. ఎందుకంటే అలాంటివి చూసి చూసి విసుగుపుట్టేస్తోంది. చివరికి ఇది కూడా ఒక రివెంజ్ యాక్షన్ సినిమా అని చెప్పారు. ప్రేక్షకులకు ఇలా కొట్టుడు, నరకుడు వున్న సినిమాలో నచ్చుతాయో ఏంటో మరి. అలాగే ఆ తండ్రీ కొడుకుల అనుబంధం కూడా మరీ ఓవర్ చేసి చూపించారు. ఏంటో ఎక్కడ నుండి వస్తాయో ఈ దర్శకులకు ఇలాంటి చెత్త ఆలోచనలు.

rudrudureview4.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ ఓవర్ యాక్షన్ చేసి చూపించారు. రాఘవ లారెన్స్ కి ఇలాంటి రోల్ చెయ్యడం ఏమి కొత్త కాదు. చేసాడు ఇంతకు ముందు. ఇక నాసర్, పూర్ణిమ భాగ్యరాజ్ అందరూ ఒకే. శరత్ కుమార్ కూడా ఇలాంటి విలన్ పాత్రలు చాలా చేసాడు. మిగతా పాత్రల్లో అందరూ అనుకున్నదానికన్నా ఇంకా ఎక్కువగా చేసి చూపించారు. పాటలు అర్థం కావు, నేపధ్య సంగీతం గోల గోల గా ఉంటుంది. మాటలు అంతగా ఆకట్టుకోవు. కథానాయకురాలు ప్రియ భవాని శంకర్ అందంగా వుంది, బావుంది. ఆమె సినిమాలో కొంచెం ఆహ్లాదంగా కనపడేది.

చివరగా, 'రుద్రుడు' సినిమా ఒక రివెంజ్ కథ. సినిమాలో అందరూ ఓవర్ యాక్షన్ చెయ్యడమే కాకుండా, ఈ యాక్షన్ సన్నివేశాలు మరీ దారుణంగా ఉంటాయి. ఇందులో చూడటానికి ఏమి లేదు, కథ లేదు, కథనం లేదు, పాటలు, సంగీతం అన్నీ మైనస్ ఈ సినిమాకి. 'రుద్రుడు' అంటే రుద్ధుడే.

Updated Date - 2023-04-14T14:19:29+05:30 IST