Ramgopal Varma: శారీ మూవీ రివ్యూ
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:13 AM
రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో రవి శంకర్ వర్మతో కలిసి 'శారీ' సినిమా నిర్మించారు. ఆరాధ్యదేవి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...
కొంతకాలంగా పాలిటికల్ కామెంట్స్ కు, పొలిటికల్ మూవీస్ కు పరిమితమైన రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) కాస్తంత టర్న్ తీసుకుని ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' (Saree) మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయన మూలకథను అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. వర్మ శిష్యుడు గిరి కృష్ణ కమల్ (Giri Krishna Kamal) దీనిని డైరెక్ట్ చేశాడు. ఓ మలయాళ భామ చీరకట్టులో ఉన్న రీల్స్ చూసి... టెంప్ట్ అయిన వర్మ ఆమెతో ఈ 'శారీ' మూవీ తీశాడు. చిత్రం ఏమంటే... తన చిత్రాల ద్వారా సందేశాలను ఇవ్వడానికి అస్సలు ఇష్టపడి ఆర్జీవీ ఈ సినిమాతో మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, దాని కారణంగా జరిగే కీడును గుర్తెరగాలని చెప్పే ప్రయత్నం చేశాడు.
కథ ఏంటంటే...
వర్మ సినిమాలు అంటే గతంలో కాస్తంత కథ, ఆసక్తిని కలిగించే కథనం ఉండేవి. ఆయన మేకింగ్ స్టైల్ కు ఇన్ స్పైర్ అయిన కుర్రాళ్ళు చాలామంది దర్శకులుగానూ మారారు. అయితే కొన్నేళ్ళుగా వర్మ కథను తీసి పక్కన పడేసి... తన మనసులోని భావాలను సీన్ వైజ్ పేర్చుకుంటూ పోతున్నారు. 'శారీ' కూడా ఆ కేటగిరికి చెందిన మూవీనే. నిజం చెప్పాలంటే... ఇందులో అసలు చెప్పుకోదగ్గ కధే లేదు! చీరకట్టుకోవడం అంటే ఇష్టమైన ఆరాధ్య (ఆరాధ్య దేవి Aaradhaya Devi) అనే అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్ళినా శారీలోనే వెళుతుంది. ఒకానొక సమయంలో అందమైన చీరలో ఆమెను చూసిన ఫోటోగ్రాఫర్ కిట్టు (సత్య యాదు Satya Yadu) ఆమెతో ప్రేమలో పడతాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని, ఆమెతో ఫోటో షూట్ చేస్తానని చెబుతాడు. ఆరాధ్య రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఇష్టపడని ఆమె అన్నయ్య రాజ్ (సాహిల్ సంభవాల్) తరచూ హెచ్చరిస్తూ ఉంటాడు. కిట్టు కోరిక మేరకు ఆరాధ్య ఫోటో షూట్ కు అంగీకరిస్తుంది. అయితే కిట్టు చూపుల్లోని కామాన్ని గమనించిన రాజ్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. తనకు ఆరాధ్యకు మధ్య రాజ్ అడ్డుగా నిలబడడాన్ని కిట్టు తట్టుకోలేకపోతాడు. సైకోగా మారిపోయి.... రాజ్ ను హతమార్చాలనుకుంటాడు. ఆరాధ్య కోసం పిచ్చివాడిగా మారిపోయిన కిట్టు ఏం చేశాడు? అతని విపరీత ధోరణికి ఆరాధ్య అట్టుకట్ట వేయగలిందా? అందంగా చీర కట్టుకోవాలనే తన కోరిక కారణంగా ఎదురైన ఇబ్బందుల్ని ఆమె ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే...
రెండు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో ఐదారు పాత్రలు మించి లేవు. అందులో ప్రధానంగా కథంతా రెండు, మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఆరాధ్య దేవి కనిపిస్తూనే ఉంటుంది. ఆమె అంటే పిచ్చి ప్రేమను చూపించే సత్య యాదు సైతం మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ మనల్ని వదిలిపెట్టడు. ఈ రెండు పాత్రలను చూసి చూసి జనాలకు కొంత సేపటికే బోర్ కొట్టేస్తుంది. దానికి తోడు ప్రతి పావుగంటకూ ఓ ఇమేజినరీ సాంగ్ వచ్చేస్తుంటుంది. దానికి అర్థం పర్థం ఉండదు. ఈ ఎరోటిక్ సాంగ్స్ లో ఆరాధ్య దేవిని రకరకాలుగా కిట్టూ ఊహించుకుంటూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ తన కోసం ఏకంగా ఓ సినిమా తీయడానికి సిద్ధపడ్డాడనే భావనతో పూర్తి స్థాయిలో ఆరాధ్య దేవి కూడా సరెండర్ అయిపోయింది. ఆమె అందాల ఆరబోత ఓవైపు ఇబ్బంది పెడుతుంటే... మరో వైపు సత్య యాదు సోలో పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను చికాకుకు గురిచేస్తుంది. చీర కట్టుకోవడం అంటే ఎంతో ఇష్టమైన ఆరాధ్య తనకెదురైన చేదు అనుభవాలతో ఆ చీరలనే తగలబెట్టేయడంతో సినిమా ముగుస్తుంది. అన్నట్టు క్లయిమాక్స్ లో తట్టుకోలేనంత వయొలెన్స్ రెండు మర్డర్ సీన్స్ కూడా ఉంటాయి!
సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇవాళ సినిమాలు చూసి నేర్చుకోవాల్సిన పనిలేదు. దాని కోసం సినిమా చేయక్కర్లేదు. అలానే శాడిస్ట్ ప్రేమికులకు సంబంధించిన సినిమాలు ఇప్పటికే కో కొల్లలుగా వచ్చేశాయి. సో... ఈ రెండు పాయింట్లు ఏరకంగానూ ఆడియెన్స్ ను ఆకట్టుకోవు. పోనీ ఈ అంశాలను బలపరిచే విధంగా ఏవైనా సన్నివేశాలు ఉన్నాయా అంటే అవీ లేవు.
నటీనటులు... సాంకేతిక నిపుణులు...
నటీనటుల గురించి చెప్పాలంటే... ఆరాధ్యకు నటన కొత్తేమో కానీ కెమెరాకు ఫోజులివ్వడం కొత్త కాదు. దాంతో ఆమె ఎక్కడా ఇబ్బందికి గురైనట్టుగా కనిపించదు. ఆమెను తెర మీద ఆ తరహాలో చూసి ప్రేక్షకులే కాస్తంత సిగ్గుపడాలి. ఈ సినిమా చూసిన తర్వాత ఆరాధ్య హీరోయిన్ మెటీరియల్ కాదు... ఐటమ్ సాంగ్స్ వరకూ ఓకే అనిపిస్తుంది. సత్య యాదుకు ఈ మూవీ మంచి వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ అనుకోవచ్చు. అతనికి ఏవైనా కొత్త అవకాశాలు రావొచ్చు. హీరోయిన్ అన్నగా సాహిల్ శంభావల్, హీరోయిన్ తల్లిదండ్రులుగా కల్పలత, అప్పాజీ అంజరీష్ నటించారు. అంతకు మించి ప్రధాన పాత్రధారులు ఎవరూ లేదు. మూవీలో శబరి ఫోటోగ్రఫీ, శశిప్రీతమ్ రీ-రికార్డింగ్, ఎడిటింగ్ బాగున్నాయి. కానీ కథ, ఆసక్తికరమైన కథనం లేకుండా ఫ్లాట్ గా సాగే ఈ 'శారీ'ని ఎవరు మాత్రం ఇష్టపడతారు!
'శారీ' సినిమాకు మేకర్స్ 'టూ మచ్ లవ్ కెన్ బీ స్కేరీ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దీనిని 'టూ మచ్ లవ్ కెన్ బీ స్పాయిల్ ఆడియెన్స్ టైమ్' అని మార్చుకోవాలి. ఎందుకంటే... ఆరాధ్యదేవి మీద వర్మకు ఉన్న టూ మచ్ లవ్... ఆడియెన్స్ టైమ్ ను కిల్ చేసేదిగా ఉంది.
ట్యాగ్ లైన్: శారీ కాదు స్కేరీ!
రేటింగ్ : 2.25 / 5