Manoj Kumar: దేశభక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్...

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:05 PM

హిందీలో దేశభక్తి చిత్రాలను రూపొందించి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ కుమార్ మృతి చెందారు. మనోజ్ మృతి పట్ల మోదీ సంతాపం తెలిపారు.

మనోజ్ కుమార్ (Manoj Kumar) తాను నిర్మించి నటించి దర్శకత్వం వహించిన చిత్రాలలో దేశభక్తిని నింపి ఆకట్టుకున్నారు. అందుకే జనం ఆయనను భరత్ కుమార్ అనీ పిలుస్తారు. అభిమానులకు ఆవేదన కలిగిస్తూ మనోజ్ కుమార్ ఏప్రిల్ 4వ తేదీ తుదిశ్వాస విడిచారు. జనం మదిలో మాత్రం ఆయన భరత్ (Bharath) గానే నిలిచారు. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయేమో అనిపిస్తుంది. నటుడు మనోజ్ కుమార్ ను చూస్తే అది నిజమే అనిపించక మానదు. తాను నటించిన కుటుంబ కథా చిత్రాల్లోనూ ఎక్కడో ఒక చోట మనోజ్ మాటల్లో దేశభక్తి వినిపించేది. తరువాత ఆ దేశభక్తి మనోజ్ నెత్తురులో పొంగిపోయింది... తాను నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రాలలో దేశభక్తిని ప్రదర్శిస్తూ సాగారు మనోజ్. సదరు చిత్రాలన్నిటా ఆయన పేరు భరత్ - అందుకే జనం భరత్ కుమార్ గా మనోజ్ కు జేజేలు పలికారు.


మనోజ్ కుమార్ అసలు పేరు హరిక్రిషణ్ గిరి గోస్వామి... దేశవిభజన సమయానికి మనోజ్ వయసు పదేళ్ళు. అటు నుండి ఇండియాకు వచ్చిన మనోజ్ లో చిన్నతనం నుంచీ దేశభక్తి నిండిపోయింది. అశోక్ కుమార్ (Ashok Kumar), దిలీప్ కుమార్ (Dileep Kumar) సినిమాలు చూస్తూ పెరిగిన ఆయన తన పేరు మనోజ్ కుమార్ గా మార్చుకున్నారు. చదువు కాగానే చిత్రసీమలో ప్రయత్నాలు మొదలెట్టారు. 1957లో 'ఫ్యాషన్' సినిమాతో తెరపై తొలిసారి తళుక్కుమన్నా, ఏడేళ్ళ తరువాత 'వో కౌన్ థీ'తో బ్రేక్ లభించింది. 'హిమాలయ్ కీ గోద్ మే' సినిమాతో స్టార్ అనిపించుకున్నారు. 1965లో ఎస్. రామశర్మ రూపొందించిన 'షహీద్' చిత్రం మనోజ్ కుమార్ నటించిన మొదటి దేశభక్తి చిత్రం. ఇందులో భగత్ సింగ్ పాత్రను ఆయన పోషించారు. ఆ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి. ఉత్తమ హిందీ ప్రాంతీయ చిత్రంగా అవార్డును పొందింది. ఈ సినిమాలోని పాత్రకు గానూ ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని మనోజ్ కుమార్ భగత్ సింగ్ కుటుంబ సభ్యులకు అందచేశాడు. తనకు భగత్ సింగ్ పాత్ర ద్వారా వచ్చిన గుర్తింపు చాలని, డబ్బులు అవసరం లేదని ఆయన వినమ్రంగా తెలిపాడు. భారత- పాక్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కోరికపై మనోజ్ 'ఉప్ కార్' సినిమా తీశారు. దాంతో దర్శకునిగా మారారు మనోజ్. ఆ చిత్రం జనాన్ని విశేషంగా ఆకర్షించింది. అందులోని పాటలు ఈ నాటికీ జాతీయ పర్వదినాల్లో వినిపిస్తూనే ఉండడం విశేషం!


'ఉప్ కార్' సినిమా తరువాత మనోజ్ పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. అయినా 'ఉపకార్'లో మనోజ్ పోషించిన భరత్ పాత్ర జనం మదిలో చిరస్థాయిగా నిలచింది. 1970లో మనోజ్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'పూరబ్ ఔర్ పశ్చిమ్' బంపర్ హిట్ అయింది. అందులోనూ ఆయన పేరు భరత్. 'దస్ నంబరీ' వంటి ఇతరుల చిత్రాలతో హిట్స్ పట్టేసినా మనోజ్ పేరు చెప్పగానే ఆయన తెరకెక్కించిన 'రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి, క్లర్క్" వంటి చిత్రాలే గుర్తుకు వస్తాయి. అన్నిటా 'భరత్'గానే కనిపించి ఆకట్టుకున్నారు మనోజ్. నటదర్శక నిర్మాతగానే కాదు కథారచయితగా, ఎడిటర్ గా కూడా సాగారు... పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో కేంద్రప్రభుత్వం మనోజ్ ను గౌరవించింది... మనోజ్ మరణవార్త వినగానే దేశ ప్రధానితో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు - యావత్ చిత్రపరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది... మనోజ్ గా మారిన హరిక్రిషణ్ జనం మదిలో మాత్రం 'భరత్'గా నిలిచారు.

మనోజ్ కుమార్ మృతికి భారత ప్రధాన నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. దేశభక్తిని సినిమా ద్వారా ప్రేరేపించిన వ్యక్తి మనోజ్ కుమార్ అని కంగనా రనౌత్ పేర్కొంది. మనోజ్ కుమార్ కేవలం నటుడు, దర్శకుడు కాదు ఆయనో సంస్థ లాంటి వారు. ఆయన నటించిన సినిమాల నుండే ఎంతో నేర్చుకున్నానని ఆమీర్ ఖాన్ తెలిపాడు.

Also Read: Hit 3: శైలేష్ కొలను ఆవేదనకు కారణం అదేనా

Also Read: Ramgopal Varma: శారీ మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 04 , 2025 | 04:10 PM