Anil Ravipudi: ఐశ్వర్య రాజేష్ చాలా టార్చర్ పెట్టింది..
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:23 AM
Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి బుధవారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో 'సంక్రాంతికి వస్తునాం' హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే మూవీ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పారు.
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. భీమ్స్ సంగీతం అందించారు. బుధవారం రాత్రి నిజామాబాద్ లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. "నిజామాబాద్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరినీ చూస్తుంటే పండుగ డైరెక్టుగా మా ఇంటికి వచ్చినట్టుంది. మీ అందరి రాక సంతోషం కలిగిస్తోంది. ఈ ఫంక్షన్ సజావుగా జరిగేందుకు తోడ్పాటు అందించిన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ను చూశారు. ట్రైలర్ లో మీరు చూసింది కొంచెమే... సినిమాలో ఇంకా చాలా చాలా ఉంది. ఈ సినిమా ఒక టిపికల్ జానర్ లో తెరకెక్కించాం. భార్యకు, మాజీ ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేశ్ గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో చాలా థ్రిల్స్, ట్విస్టులు, టర్నులు ఉంటాయి. ఇంటిల్లిపాదీ చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది.
ఇక దిల్ రాజు, శిరీష్ నిజామాబాద్ లోకల్ బాయ్స్. వాళ్లతో నాకు ఇది ఆరో సినిమా. నాకు చాలా సపోర్ట్ గా ఉంటారు. ఓ కుటుంబంలాగా నాకు ఎప్పుడూ స్వేచ్ఛనిస్తారు. ఈ సినిమా... ఆడియన్స్ కు కచ్చితంగా పండుగ ఫన్ అందిస్తుంది. ఈ సినిమాలో వెంకటేశ్ భార్యలా ఐశ్వర్య రాజేశ్ చాలా టార్చర్ పెట్టింది. మాజీ ప్రేయసి పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా మీనాక్షి చౌదరి తన గ్లామర్ తో చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. విక్టరీ వెంకటేశ్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట... మా వెంకీ మామ, మీ అందరికీ నచ్చే వెంకీ మామ... సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. ఆయన తన కెరీర్ లో ఎంతో గొప్ప పాత్రలు చేశారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. చాలా అద్భుతంగా నటించారు.
ఇందాక ట్రైలర్ లో చూశారు... ప్రతి సినిమాకు ముందు టీజర్ ఉన్నట్టు, ప్రతి మగాడి లైఫ్ లో ఎక్కడో చోట లవర్ ఉంటుంది వంటి డైలాగులు ఈ సినిమాలో చాలా ఉంటాయి. వెంకటేశ్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే... సినిమాకి పనిచేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో, సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి తన వంతు మద్దతుగా నిలుస్తారు. జనవరి 14న మా సినిమా థియేటర్లలోకి వస్తోంది. మీరందరూ కుటుంబ సమేతంగా రావాలి... కడుపుబ్బా నవ్వించి పంపిస్తాం" అంటూ చెప్పారు.