కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో గొప్ప చిత్రమిది

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:54 AM

‘మా అన్న కల్యాణ్‌రామ్‌ నటించిన ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమా కార్యక్రమానికి అతిథిగా వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రతిసారీ అభిమానులను కాలర్‌ ఎగరేయమని నేను చెబుతుంటాను. కానీ ఈసారి కల్యాణ్‌రామ్‌ అన్నను...

‘మా అన్న కల్యాణ్‌రామ్‌ నటించిన ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమా కార్యక్రమానికి అతిథిగా వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రతిసారీ అభిమానులను కాలర్‌ ఎగరేయమని నేను చెబుతుంటాను. కానీ ఈసారి కల్యాణ్‌రామ్‌ అన్నను కాలర్‌ ఎగరేయమని చెబుతున్నాను. ఆయన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం ఇది’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 18న విడుదలవుతోంది. శనివారం చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘నేను ఈ సినిమా చూశాను. ప్రేక్షకుడిగా ఎంజాయ్‌ చేశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు. క్లైమాక్స్‌లో 20 నిమిషాలు ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అన్నయ్య, విజయశాంతి గారివల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది’ అని అన్నారు. కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడడం కన్నా సక్సె్‌సమీట్‌లో మాట్లాడడం సమంజసం అనుకుంటున్నాను. కొన్ని సినిమాలే మనసులో నిలిచిపోతాయి. ఇది కూడా అలాంటి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. విజయశాంతి మాట్లాడుతూ ‘ఇందులో ఒక తల్లి పడే ఆరాటం,


కొడుకు చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. చాలా సంవత్సరాల నుంచి మంచి సినిమా చేయమని అభిమానులు అడుగుతున్నారు. అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. షూటింగ్‌ సమయంలోనే సూపర్‌హిట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది. మాతృమూర్తులందరికీ ఈ సినిమా అంకితం’ అని అన్నారు. నిర్మాత అశోక్‌ వర్ధన్‌ ముప్పా మాట్లాడుతూ ‘ఈ చిత్రం కోసం కల్యాణ్‌రామ్‌ రెండేళ్లు కష్టపడ్డారు. విజయశాంతి గారి నటన ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ’ అని చెప్పారు. ప్రదీప్‌ చిలుకూరి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఒక బాధ్యతాయుతమైన పాత్రలో కల్యాణ్‌రామ్‌ నటించారు’ అని తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 01:54 AM