OTT Movie: చక్కని తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఓటీటీలోకి వచ్చేసింది

ABN , Publish Date - Nov 23 , 2024 | 10:25 PM

ఎప్పుడూ యాక్షన్ సినిమాలేనా? అప్పుడప్పుడు కాస్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు కూడా కాస్త స్కోప్ ఇవ్వండి. ఓటీటీలోకి ఓ చక్కని తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం వచ్చేసింది. పెళ్లి విశిష్టతను తెలిపేలా వచ్చిన ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఓ లుక్ వేయండి మరి.

Laggam Movie Still

చక్కని తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా చూడాలనుకునే ఓటీటీ అభిమానులను కనువిందు చేసేందుకు ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ నటించిన ‘లగ్గం’ సినిమా. ఒక్క ఓటీటీలో కాదు.. రెండు ఓటీటీలలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. పల్లెటూరిలో జరిగే పెళ్లితంతును ఎంతో అందంగా చూపించిన సినిమా ఇదంటూ అంతా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ యాస, సాంప్రదాయాలు, పెళ్లితంతును ఆకట్టుకునేలా రెండు కుటుంబాల చుట్టూ తిరిగే కథే ఇది. ఇందులో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి వంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ‘లగ్గం’ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

Also Read- Sreeleela: ‘పుష్ప2’ కిస్సిక్ సాంగ్ ప్రోమో విడుదల వేళ శ్రీలీల ఏం చేస్తుందో చూశారా..

మంచి నిర్మాణ విలువలతో వచ్చిన ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అల్లుడిగా రావాలని కలలు కనే పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన ఆకట్టుకునేలా ఉంటే.. రోహిణి తన కెరియర్‌లో చేసిన బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవడం విశేషం. అలాగే ఎల్బీ శ్రీరామ్, రఘు బాబు పాత్రలు కూడా ఇందులో హైలెట్ అనేలా ఉంటాయి. రమేశ్ చెప్పాల రచన-దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ నేపధ్య సంగీతం అందించగా.. చరణ్ అర్జున్ పాటలు, బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు.


Laggam-Movie.jpg

‘లగ్గం’ కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని ఓ పల్లెలో నివసిస్తుంటాడు సదానందం (రాజేంద్రప్రసాద్‌). తన కూతురు మానస (ప్రగ్యా నగ్రా) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో పెళ్లి చేస్తే సుఖపడుతుందని భావిస్తాడు. తన మేనల్లుడు చైతన్య (సాయి రోనక్‌) మంచి జీతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మంచి జీతం, కారు, బంగ్లా విలాసవంతమైన జీవితం ఉన్న అతన్ని అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. మేనల్లుడితో కూతురి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలుపుతాయి. పెళ్లి పనులు సందడిగా మొదలైపోతాయి. అయితే అనుకోని పరిస్థితుల్లో చైతన్య ఉద్యోగం పోతుంది. తనకు ఎట్టి పరిస్థితిలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వున్న అల్లుడే కావాలని పట్టుబట్టి కూర్చుంటాడు సదానందం. అల్లుడుకి జాబ్‌ లేదని తెలిసిన తర్వాత ఆ పెళ్లి తప్పించడానికి సదానందం ఏం చేశాడు? ఈ పెళ్లి చైతన్య, మానసకి ఇష్టం ఉందా లేదా? సాఫ్ట్‌వేర్‌పై సదానందంకు ఎందుకంత ఆసక్తి అనేది మిగతా కథ.

Also Read-KA OTT: ‘క’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే..

Also Read-Sharmila: ప్రభాస్‌తో నాకున్న రిలేషన్ ఏంటంటే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2024 | 10:25 PM