Ugram Veeram: స్వచ్ఛ సింహనాదమే ‘ఉగ్రం వీరం’.. ఆవిష్కరణలో రమణాచారి

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:57 PM

కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో ఆదివారం ఉదయం త్యాగరాయ గానసభలో జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనం ‘ఉగ్రం .. వీరం’ పదహారవ పునర్ముద్రణను రమణాచారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారాహి చలన చిత్రం అధినేత నిర్మాత సాయి కొర్రపాటి, వంశీ ఆర్ట్ థెటర్స్ అధినేత వంశీ రామరాజు వంటి వారంతా హాజరయ్యారు.

Ugram Veeram Book Launch Event

ఆది శంకరుల అమరలేఖిని నుండి జాలువారిన అమృత రసధారల్లో అగ్రగణ్యంగా తరాలుగా పారాయణం చేస్తున్న ‘శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రమ్’ అనుగ్రహంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) పరమాద్భుతంగా రచించిన మహాట్టహాసాల సింహనాదమే ‘ఉగ్రం ... వీరం’ దివ్య గ్రంథమని, ఈ పవిత్ర గ్రంధం ఇప్పటికి పదహారు ప్రచురణలకి నోచుకోవడం యాదాద్రి లక్ష్మీ నారసింహుని కారుణ్యంతో పాటు శ్రీనివాస్ రచనా పటిమ, స్వచ్ఛమైన హృదయం కారణమని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రత్యేక సలహాదారులు కె.వి. రమణాచారి (KV Ramana Chary) అన్నారు.

Kala.jpg

కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah) సమర్పణలో ఆదివారం ఉదయం త్యాగరాయ గానసభలో జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనం ‘ఉగ్రం .. వీరం’ పదహారవ పునర్ముద్రణను రమణాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. సభలు, సమావేశాలకు శ్రీనివాస్ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారని, విశేష సృజనాత్మక ప్రజ్ఞ కలిగిన నిస్వార్ధ రచయిత, మంచి వక్త అయిన శ్రీనివాస్ తన పిలుపుకు స్పందించి వెంటనే హాజరవ్వడం సోదరప్రేమగా అభివర్ణించడం విశేషం.


KV-Ramana-chary.jpg

హాస్యబ్రహ్మ, సీనియర్ పాత్రికేయులు శంకరనారాయణ ఈ సభకు అధ్యక్షత వహిస్తూ.. చాలా అందమైన శైలిలో ఈ ‘ఉగ్రం .. వీరం’లో శ్రీనివాస్ రచనాసౌందర్యం కదం తొక్కిందని, ఒక దశలో తన వొళ్ళు గగుర్పొడిచేలా నృసింహార్భావ ఘట్టం శ్రీనివాస్ రచనపై చాలా గౌరవం కలిగించిందని పేర్కొన్నారు.

తమ త్యాగరాయ గానసభలో కార్యక్రమాల వల్ల తనకు ఎన్నో సాంస్కృతిక సంస్థల, సాహిత్యవేత్తలతో, కవులతో, పండితులతో, కళాకారులతో చాలా పరిచయముందని.. కానీ పురాణపండ శ్రీనివాస్ వంటి నిజమైన నిస్వార్ధ ధార్మిక సేవకుని తానింత వరకూ చూడలేదని, తనను తాను దైవానికి నిజంగానే అర్పించుకుంటూ, ఏ కీర్తినీ.. ఏ అంశాన్ని మననుంచి అస్సలు శ్రీనివాస్ ఆశించకుండా దైవీయ చైతనపు సేవ చేసి ప్రశాంతంగా వెళ్ళిపోతారని.. అనేకసార్లు తాను ఆయన ప్రవర్తన చూసి చాలా ఆశ్చర్యపోయానని త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి (Kala Janardhan Murthy) చెప్పగానే ప్రేక్షకులు చప్పట్లతో హాలంతా మార్మ్రోగిపోయింది.


Ugram-Veeram.jpg

ఈ కార్యక్రమంలో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, వంశీ ఆర్ట్ థెటర్స్ అధినేత వంశీ రామరాజు, ఒమేగా హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ మోహన్ వంశీ, అభినందన సంస్థ అధ్యక్షురాలు ఇ.భవాని, అనేక ధార్మిక ప్రచురణల అధినేతలు, సౌత్ సెంట్రల్ రైల్వే పి.ఆర్.ఓ శ్రీధర్ తదితర ప్రముఖులతో పాటు ‘ఉగ్రం .. వీరం’ రచయిత శ్రీనివాస్‌ను అభినందించడానికి ప్రభుత్వ సంగీత కళాశాలకు చెందిన పలువురు గాయనీ గాయకులు పాల్గొనడం విశేషం.

గతంలో ‘ఉగ్రం ... వీరం’ గ్రంధం తొలి ప్రచురణను విఖ్యాత ప్రవచన కర్త, మహావక్త చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి పురాణపండ శ్రీనివాస్‌పై మంగళాశాసన ప్రశంసలు వర్షించిన అంశాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేయడం విశేషం.

Updated Date - Aug 26 , 2024 | 12:47 PM