Priyanka Chopra: ప్రియాంక చోప్రా మనసు దోచిన మహిళ!
ABN , Publish Date - Mar 19 , 2025 | 07:14 PM
మహేశ్ బాబు, రాజమౌళి సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రియాంక తిరుగు ప్రయాణమైంది. దారిలో జరిగిన ఓ సంఘటన ప్రియాంకలో స్ఫూర్తిని నింపిందట!
పెద్దవారి బుద్ధులు చిన్నగా ఉంటాయని కొందరంటారు. కానీ... వాళ్ళలోనూ గొప్ప మనసు ఉన్నవారు ఉంటారని అప్పుడప్పుడూ రుజువు అవుతుంటుంది. అలానే చిన్నవారిలోనూ గొప్ప మనసు ఉంటుందని అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే... ఆ పెద్దవారు చిన్నవారి గొప్పతనాన్ని గుర్తించి, నలుగురికి చెబితే భలే థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి పనే యూనివర్సల్ యాక్ట్రస్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చేసింది. తాజాగా మహేశ్ బాబు (Mahesh Babu) - రాజమౌళి (Rajamouli) సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ప్రియాంక చోప్రా అమెరికాకు ప్రయాణమైంది. ఒడిస్సా లోని షూటింగ్ స్పాట్ నుండి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు రోడ్ మార్గంలో ప్రియాంక బయలుదేరింది. విశాఖపట్నం బోర్డర్ లో జరిగిన ఓ సంఘటన తనకు ఎంతో స్ఫూర్తి కలిగించిందని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో ద్వారా ప్రియాంక చోప్రా తెలిపింది.
విశాఖ వస్తుంటే రోడ్ మీద రెడ్ లైట్ పడిందట. ఆ పక్కనే ఓ మహిళ జామకాయలు అమ్ముకుంటూ కనిపించిందట. జామకాయలు... అందులోనూ పచ్చి జామకాయలంటే ఎంతో ఇష్టమైన ప్రియాంక చోప్రా వెంటనే ఆ అమ్మాయిని పిలిచి, బుట్టలోని జామకాయలు ఎంత అని అడిగిందట. నూట యాభై రూపాయలని చెప్పడంతో తాను రెండు వందల నోటు ఇచ్చానని, ఆమె తిరిగి చిల్లర ఇవ్వడానికి ప్రయత్నిస్తే వద్దని చెప్పానని ప్రియాంక ఆ వీడియోలో తెలిపింది. అయితే... ఆ మహిళ కొద్దిసేపు పక్కకు వెళ్ళి గ్రీన్ లైట్ పడే లోపే మరో రెండు జామకాయలు తీసుకొచ్చి ఆమెకు ఇచ్చిందట. జీవిక కోసం జామకాయలు అమ్ముకుంటున్న ఆ మహిళ తన నుండి ఛారిటీని ఆశించలేదని, ఆమె పెద్ద మనసు తనలో స్ఫూర్తిని నింపిందని ప్రియాంక తెలిపింది.
ఇదిలా ఉంటే... మహేశ్ బాబు షూటింగ్ తొలి షెడ్యూల్ ను ఒడిసాలో పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఎవరి గమ్యాలకు వారు బయలు దేరారు. ప్రియాంక కూడా అమెరికా దారి పట్టింది. పనిలో పనిగా ఈ వీడియోతో పాటు మహేశ్ బాబు షూటింగ్ లొకేషన్స్ లో దిగిన కొన్ని ఫోటోలను, తన విశాఖకు వస్తున్న రోడ్డు మార్గంలో తీసిన వీడియోలను పోస్ట్ చేసింది. ప్రియాంక చోప్రా పెట్టిన ఈ పోస్ట్ చూసిన వారు... ఆ జామకాయల అమ్మాయితో పాటు... మంచిని ప్రచారం చేసే గుణం కలిగిన ప్రియాంకను కూడా అభినందిస్తున్నారు.
Also Read: Sobhita Dhulipala: మా ఆయన బంగారం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి