NATS: ఘనంగా 8వ తెలుగు సంబరాలు కర్టెన్ రైజర్
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:50 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలకు శ్రీకారం చుడుతోంది. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) (NATS) 8వ తెలుగు సంబరాలు (Telugu Sambaralu) ఈవెంట్ కు సిద్ధమవుతోంది. జూలై 4 నుండి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్ లో నాట్స్ 8వ తెలుగు సంబరాలు కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్, మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అమెరికా నుండి విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు. నటి జయసుధ (Jayasudha), ఆమని (Amani), దర్శకులు హరీశ్ శంకర్ (Harish Shankar), మెహర్ రమేష్ (Mehar Ramesh), సంగీత దర్శకుడు తమన్ (SS Thaman), గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ, 'నాట్స్ అంటే సేవ, భాష రెండు పదాలు గుర్తొస్తాయని, అమెరికాలోని తెలుగువారికి అండగా ఉండాలని 2009లో దీనిని ప్రారంభించామని చెప్పారు. 8వ తెలుగు సంబరాలు కార్యక్రమంలో పదివేల మంది పాల్గొంటారని తెలిపారు. తెలుగు భాషను, మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడానికి నాట్స్ కృషి చేస్తోందని శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. నాట్స్ కేవలం సంబరాలు జరుపుకునే సంస్థ మాత్రమే కాదని, సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్ అని జయసుధ తెలిపారు. ఇటీవల తాను ఓ ఇంగ్లీష్ మూవీలో నటించానని, దాని షూటింగ్ నాట్స్ తెలుగు సంబరాలు జరిగే ప్లేస్ దగ్గరలోనే జరిగిందని జయసుధ అన్నారు.
గతంలో ఒకసారి తాను నాట్స్ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఈ సారి వారికి కన్సర్ట్ చేయబోతున్నానని, తనతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఇందులో పాల్గొంటారని తమన్ చెప్పారు. సంగీత విభావరితో పాటు జూలై 1,2,3 తేదీలలో క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆడబోతున్నామని, అఖిల్, సుధీర్ బాబు తదితరులు తమ టీమ్ లో ఉంటారని తమన్ తెలిపారు. తెలుగు భాషను కాపాడటంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న నాట్స్ నిర్వాహకులను దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేశ్ అభినందించారు. నాట్స్ లో తాను, రామజోగయ్య శాస్త్రి కలిసి ఓ కార్యక్రమం చేయబోతున్నట్టు చంద్రబోస్ తెలిపారు. తెలుగువారి కోసం, తెలుగు భాష కోసం నాట్స్ ఎంతో కృషి చేస్తోందని రామజోగయ్య శాస్త్రి చెప్పారు. ఈసారి నాట్స్ నిర్వహించే తెలుగు సంబరాలలో తానూ పాల్గొనబోతున్నానని ఆమని అన్నారు.
Also Read: Mohan Lal: పృథ్వీరాజ్ తెరపై అద్భుతం చేశారు.. అదేంటో చూస్తారు...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి