Ketika Sharma: కేతిక విజయకేతనం ఎగరేసేది ఎప్పుడు...
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:31 PM
అందాల భామ కేతిక శర్మకు అవకాశాలు వస్తున్నాయి కానీ అదృష్టం మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోతోంది. దాంతో ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అమ్మడి ఖాతాలో పడలేదు.
హీరోయిన్లలో రెండు రకాల వాళ్ళుంటారు. కెరీర్ ప్రారంభంలో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేసేసి... ఆ తర్వాత మంచి పాత్రలు రాగానే ఎక్స్ పోజింగ్ కు నై అంటారు. అక్కడ నుండి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ మీదుగా నిదానంగా స్టార్ డమ్ పెంచుకుంటారు. మరికొందరు హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో మడికట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తారు. అందాల విందుకు ససేమిరా అంటారు. అందుకు తగ్గ పాత్రలనే చేస్తుంటారు. అయితే... కెరీర్ నాలుగైదేళ్ళు సాగిన తర్వాత అవకాశాలు తగ్గిపోతుంటే... నిదానంగా అందాల ప్రదర్శనకు, అంగాగ ప్రదర్శనకు సిద్ధపడతారు. అక్కడ నుండి కొంతకాలం పాటు ఎలాగో కెరీర్ నెట్టుకెళ్తారు.
అందాల భామ కేతిక శర్మ (Ketika Sharma) మొదటి కోవకు చెందిన హీరోయిన్. పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఛార్మి (Charmy) నిర్మించిన 'రొమాంటిక్' (Romantic) మూవీతో పూరి కొడుకు ఆకాశ్ (Akash) సరసన కేతిక హీరోయిన్ గా చేసింది. తెలుగులో ఆమెకు అదే మొదటి సినిమా. అయితే... డెబ్యూ మూవీనే కేతికా శర్మకు ఘోర పరాజయాన్ని కట్టబెట్టింది. దాంతో ఇక అమ్మడు తట్టాబుట్టా సర్దేసుకోవాల్సిందేనని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా నాగశౌర్య 'లక్ష్య'లో చోటు దక్కించుకుంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కూడా అమ్మడికి వైష్ణవ్ తేజ్ సరసన 'రంగరంగ వైభవంగా' సినిమాలో చోటు దక్కింది. ఈ మూవీతో అయినా కేతిక హిట్ ట్రాక్ లోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఇదీ పరాజయం బాటే పట్టింది. దాంతో అమ్మడు ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ కొట్టింది. ఈ మూడు సినిమాలు ఒక ఎత్తు కాగా... కేతిక శర్మ నటించిన 'బ్రో' (Bro) మూవీ మరో ఎత్తు. తమ్ముడు వైష్ణవ్ తేజ్ సరసన 'రంగరంగ వైభవంగా'లో నటించిన కేతిక ఆ తర్వాత 'బ్రో' మూవీలో అతని అన్న సాయి దుర్గా తేజ్ పక్కన చోటు దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'బ్రో' సినిమాతో మాస్ లోకి తారాజువ్వలా దూసుకుపోగలనని కేతిక ఆశపడింది. కానీ సముతిరఖని తెరకెక్కించిన 'బ్రో' మూవీ మాస్ ఆడియెన్స్ నే కాదు... క్లాస్ ఆడియెన్స్ ను కూడా మెప్పించలేకపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో రూట్ మార్చి ఈ మధ్య 'రాబిన్ హుడ్' (Robinhood) లో ఐటమ్ సాంగ్ లో నర్తించింది కేతికా శర్మ. 'అది దా సర్ ప్రైజూ' అంటూ కేతిక శర్మతో శేఖర్ మాస్టర్ వేయించిన హుక్ స్టెప్ కు సెన్సార్ వాళ్ళు ససేమిరా అన్నారు. కేవలం యూట్యూబ్స్ కే ఆ స్టెప్పు పరిమితమైంది. పాటతో కేతిక కుర్రకారును మెప్పించినా... సినిమా మాత్రం బాక్సాఫీస్ బరిలో ఢమాలంది. అలా తెలుగులో ఇంతవరకూ వచ్చిన ఐదు సినిమాల్లో ఒక్కటీ హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో కేతిక శర్మ తన ఆశలన్నీ శ్రీవిష్ణు (Srivishnu) తో చేయబోతున్న 'హ్యాష్ ట్యాగ్ సింగిల్' మూవీపైనే పెట్టుకుంది. అందాల ఆరబోత విషయంలో కేతిక అభ్యంతరం పెట్టకపోయినా... అదృష్టం మాత్రం ఆమెకు ఆమడదూరంలోనే ఉండిపోతోంది!!
Also Read: Empuraan Effect: పృథ్వీరాజ్ కూ ఐటీ నోటీసులు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి