Movie Review: ‘మదనోల్సవం’

ABN , Publish Date - Jan 19 , 2025 | 12:13 PM

పొలిటికల్‌ సెటైర్‌లను, కామెడీని ఇష్టపడే వారికి చక్కటి కనువిందు ‘మదనోల్సవం’. ఒక సింపుల్ లైన్‌ తీసుకుని దర్శకుడు ఈ సినిమాను మలిచిన తీరు ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది.. ఆలోచింపజేస్తుంది. పొలిటికల్ సెటైర్లతో కామెడీని మిక్స్ చేసి దర్శకుడు చేసిన ప్రయత్నం ఓటీటీలోకి రావడం ఆలస్యమైనా.. మంచి ఆదరణను పొందే కంటెంట్ ఇందులో ఉంది. ‘మదనోల్సవం’ పూర్తి రివ్యూలోకి వెళితే..

Movie Review: ‘మదనోల్సవం’
Madanolsavam Movie Poster

మూవీ పేరు: మదనోల్సవం (మలయాళం)

నటీనటులు: సూరజ్‌ వింజరమూడు, బాబు ఆంటోని, రాజేష్‌ మాధవన్‌, భామా అరుణ్‌ తదితరులు.

దర్శకుడు: సుధీష్‌ గోపీనాథ్‌

నిడివి: 127 నిమిషాలు

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు అనేక వాగ్దానాలు చేస్తుంటారు. రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. అలాంటి ఒక వ్యూహమే డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడం. అలా ఒక పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నిలబడడానికి మదనన్‌ మల్లక్కరను బలవంతంగా ఒప్పిస్తారు స్థానిక పార్టీ నాయకులు. రాజకీయ పార్టీల వ్యూహాలకు బలిపశువుగా మారిన మదనన్‌ మల్లక్కర జీవితం తర్వాత ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ‘మదనోల్సవం’ చిత్రకథ.

కేరళలో రాజకీయ చైతన్యం ఎక్కువ. సాధారణ పౌరుల జీవితాల్లో కూడా రాజకీయం విడదీయలేనంతగా పెనవేసుకుని ఉంటుంది. అది సహజంగానే మలయాళీ సినిమాలన్నింటిలో కూడా ప్రతిబింబిస్తుంది. సంభాషణల్లో కూడా రాజకీయాలపై సెటైర్లు, వ్యాఖ్యానాలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఒక మంచి పొలిటికల్‌ సెటైరే ‘మదనోల్సవం’.


కోడి పిల్లలకు రంగులు వేసి అమ్ముకోవడం ద్వారా జీవనం సాగించే మదనన్‌ ఒక ప్రమాదంలో చనిపోయిన స్నేహితుడికిచ్చిన మాట కోసం అతని భార్యనీ, కూతురినీ ఇంటికి తీసుకు వచ్చి, తర్వాత ఆమెని వివాహం చేసుకుంటాడు. అలా సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలోకి రాజకీయం డమ్మీ అభ్యర్థి రూపంలో ప్రవేశిస్తుంది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అయిన మదనన్‌ మంజక్కరన్‌ను ఓడించడానికి, ఒకేలాంటి పేరుతో ప్రజలను అయోమయానికి గురిచేసి తమ అభ్యర్థిని గెలిపించుకోడానికి అధికార పార్టీ మదనన్‌ను డమ్మీ అభ్యర్థిగా నిలబెడుతుంది.

Also Read-Ram Charan: రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు.. కాదు కాదు అంతకుమించి!

నామినేషన్‌ ఉపసంహరించుకోకుండా, ప్రత్యర్థి అభ్యర్థికి దొరకకుండా ఉండేందుకు మదనన్‌ను కిడ్నాప్‌ చేసి రహస్యంగా ఒక చోట నిర్బంధించి ఉంచుతారు. ఒకే పేరున్న డమ్మీ అభ్యర్థి కారణంగా మదనన్‌ మంజక్కరన్‌ 765 ఓట్ల తేడాతో ఓడిపోతాడు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన మదనన్‌కు ఇంటిలోని పరిస్థితులన్నీ తారుమారు అవడం, ఇంట్లోని కోళ్ళు, కోడిపిల్లలు ఒక్కటి కూడా మిగలక రోడ్డుమీద నిలబడిన కుటుంబం కనిపిస్తుంది. పార్టీ ఇచ్చిన డబ్బుని అతని బాబాయి కాజేసినట్టు తెలుస్తుంది. పార్టీ కూడా ఎలాంటి సహాయం చేయదు. అలాంటి పరిస్థితుల్లో భార్య ఆలిస్‌తో పాటు కష్టపడి తిరిగి జీవితాన్ని ఒకదారిలో పెట్టుకుంటాడు మదనన్‌. మళ్ళీ కోడిపిల్లల వ్యాపారం మొదలు పెడతాడు.


ఈలోగా ఒక అభ్యర్థి చనిపోవడంతో అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక అవసరమవుతుంది. మదనన్‌ను తమ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నిలబెట్టడానికి ఒక పార్టీ, అతని కారణంగా ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రత్యర్థి పార్టీ మదనన్‌ను తిరిగి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు మదనన్‌ ఇంటి దగ్గరే కొట్టుకుని అతని ఇంటిని కూడా తగలబెడతారు. తనని కిడ్నాప్‌ చేయడానికి జరిగే ప్రయత్నాన్ని అమాయకుడైన మదనన్‌ ఎలా తిప్పికొట్టి తన జీవితాన్ని పునర్‌ నిర్మించుకుంటాడనేదే మిగిలిన కథ.

మదనన్‌గా సూరజ్‌ వింజరమూడు నటనని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని నటనలో అండర్‌ స్నేట్‌మెంట్‌ అనేది ఎప్పుడూ ఒక ప్రాతిపదికగా ఉంటుంది. హడావుడి, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా కళ్ళతోనే హావభావాలు పలికించడం అతనికున్న ప్రత్యేక ప్రతిభ. సూరజ్‌ కామెడీ పండించడంలో కూడా సిద్ధహస్తుడని ‘మదనోల్సవం’ రుజువు చేస్తుంది. మదనన్‌ భార్య ఆలిస్‌గా భామాఅరుణ్‌ చక్కటి నటన కనపరచడంతో పాటు అందంగా ఉంది. ఇందులో నంబూద్రి సోదరులుగా నటించిన రాజేష్‌ మాధవన్‌, రెంజికాన్‌కోర్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచారు. సిట్యుయేషనల్‌ కామెడీని చాలా చక్కగా పండించారు. ప్రత్యర్థి అభ్యర్థి మదనన్‌ మంజక్కరన్‌గా బాబు ఆంటోని కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే నటనని ప్రదర్శించారు.


పొలిటికల్‌ సెటైర్‌లను, కామెడీని ఇష్టపడే వారికి చక్కటి కనువిందు ‘మదనోల్సవం’. సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ సుధీష్‌ గోపీనాథ్‌ దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. సంతోష్‌కుమార్‌ అందించిన కథకు రమేష్‌ బాలకృష్ణన్‌ చక్కటి స్ర్కీన్‌ప్లే సమకూర్చారు. 2023 ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి ఆలస్యంగా అడుగు పెట్టింది.

ట్యాగ్‌లైన్: కామెడీ విత్ పొలిటికల్ సెటైర్


Also Read-Manchu Manoj: నా పోరాటం ఎందుకంటే.. ఓహో ఇదన్నమాట అసలు విషయం!

Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!

Also Read-Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

Also Read:Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 12:14 PM