LYF Review: ఎస్‌.పి.చరణ్‌ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే

ABN , Publish Date - Apr 05 , 2025 | 07:12 PM

ప్రముఖ సింగర్‌ ఎస్‌.పి.చరణ్‌ (SP Charan) చాలా గ్యాప్‌ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ఎల్‌.వై.ఎఫ్‌’. (లవ్‌ యువర్‌ ఫాదర్‌). శ్రీ హర్ష హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది.

సినిమా రివ్యూ: ఎల్‌.వై.ఎఫ్‌’ (లవ్‌ యువర్‌ ఫాదర్‌)
విడుదల తేది: 4-4-2025


ప్రముఖ సింగర్‌ ఎస్‌.పి.చరణ్‌ (SP Charan) చాలా గ్యాప్‌ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ఎల్‌.వై.ఎఫ్‌’. (లవ్‌ యువర్‌ ఫాదర్‌). శ్రీ హర్ష హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. పవన్‌ కేతరాజు  దర్శకత్వం వహించారు. మనీషా ఫిల్మ్స్‌ కిశోర్‌ రాఠీ. ఏ సామ్రాజ్యం, ఏ. చేతన్‌రెడ్డి, మహేశ్‌ రాఠీ నిర్మాతలు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. (LYF Review)
 
కథ:

కిషోర్‌ (ఎస్‌.పి.చరణ్‌) ఓ సూపర్‌ మార్కెట్‌ నడుపుతూ తన కొడుకు సిద్థు(శ్రీ హర్ష)ని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటాడు. ఇద్దరూ తండ్రీ కొడుకుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా ఉంటారు. పతి మనిషి జీవితంలో పుట్టుక తర్వాత అంత్యంత కీలకమైనది చావు. ఆ చావుకి గౌరవం ఇవ్వాలి అనేది బాధ్యతగా భావించే వ్యక్తి కిషోర్‌. అనాధ శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు చేస్తుంటాడు. తన కాలేజీలో చదువుకునే స్వీటీ(కషిక కపూర్‌)ని ప్రేమిస్తాడు సిద్థు. అయితే కొన్ని ఊహించని ఘటన కారణంగా కిషోర్‌, సిద్థు ఓ కేసులో ఇరుక్కుంటారు. దీంతో వారు గోవాకు పారిపోతారు. ఇంతకీ వారు ఎలాంటి కేసులో ఇరుక్కున్నారు? వారిని టార్గెట్‌ చేసింది ఎవరు..? కిషోర్‌కి సంబంధించి సిద్థుకి ఎలాంటి షాకింగ్‌ విషయాలు తెలిశాయి అన్నది కథ.


LFy.jpg

విశ్లేషణ: (LYF -Love you Father Review)
తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, స్నేహం ఇతివృత్తంగా సాగే కథ ఇది. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా ఎలాంటి కుదుపు ఎదురైంది, దాని నుంచి ఆ తండ్రీ కొడుకులు బయట పడ్డారా లేదా అన్నది మరో ఆసక్తికర అంశం. తండ్రీ కొడుకుల నేపథ్యంలో కథ మొదలు పెట్టిన తీరు ఆసక్తికరంగా సాగింది. కథ మంచి ఫ్లోలో నడుస్తుంది అనగా ఒక్కసారిగా ట్రాక్‌ తప్పింది. మళ్లీ కథ కనెక్ట్‌ కావడానికి ఇంటర్వెల్‌కు చేరుకోవలసి వచ్చింది. సెకండాఫ్‌ ఇరికించిన కామెడీతో మళ్లీ గాడి తప్పింది. ఆ కామెడీ లేకుండా తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలతోనే కాస్త పెంచి  కథను నడిపించి ఉంటే ప్రేక్షకులు కథ నుంచి డ్రైవర్ట్‌ కావడానికి అవకాశం ఉంటేది కాదు. తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్‌ను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు. అయితే కథలో విలన్‌ క్యారెక్టర్‌ను ఇరికించిన విధానం ఏమాత్రం సూట్‌ కాలేదు. కీలక సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. ప్రవీణ్‌, భద్రం, షకలక శంకర్‌ కాంబినేషన్‌ కామెడీ సీన్స్‌ ఒక సెక్షన్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకునే అవకాశం ఉంది. హీరోయిన్‌, కామెడీ,  స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్‌గా నిలిచాయి.

తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బావుంది. రెగ్యులర్ ఆర్టిస్ట్స్ చేసినట్టు కాకుండా కొత్తగా ట్రై చేశారు. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. డ్యాన్స్ బాగా చేశారు. కషికా కపూర్ గ్లామర్ ఆడియన్స్ నోటీస్ చేస్తార. ఛత్రపతి శేఖర్‌ నటన ఓకే. అతడు పోషించిన అఘోరా పాత్ర, వాయిస్‌ మాడ్యులేషన్‌తో,  స్క్రీన్  ప్రెజన్స్‌తో ఆకట్టుకున్నారు. నవాబ్‌ షా విలన్‌ అలరించే ప్రయత్నించాడు. కానీ అతని పాత్రకు రాసిన డైలాగ్స్‌ మైనస్‌గా మారాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం 'లవ్ యువర్ ఫాదర్'కు బలం. శివుని నేపథ్యంలో ఆయన చేసిన పాట, శివ భక్తుల సన్నివేశాలకు ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్ బంప్స్ ఇస్తాయి. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. యమలీల వంటి హిట్‌ చిత్రం తీసిన కిశోర్‌ రాఠీ ఇతర నిర్మాతలు మేకింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఎడిటర్‌ దేవరంపాటి రామకృష్ణ ఫస్టాఫ్‌కు కాస్త కత్తెర వేయాల్సింది. కొన్ని కథలు వినడానికి, పేపర్‌ మీద ఆసక్తికరంగా ఉంటాయి. అదే ఇంట్రెస్ట్‌ తెరపై కనిపించినప్పుడు రక్తి కడుతుంది. ప్రేక్షకుడి ఆదరణకు నోచుకుంటుంది. ఈ సినిమా కథ, భావోద్వేగాలు, ట్విస్ట్‌లు అంతా బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్‌ దగ్గర దెబ్బతింది. దర్శకుడు పవన్‌ కేతరాజు తీసుకున్న కోర్‌ పాయింట్‌, భావోద్వేగాలు బాగున్నాయి. కానీ ఇంకాస్త పకడ్భందీగా కథను ప్రజెంట్‌ చేసుంటే రిజల్ట్‌ మెరుగుగా ఉండేది. ప్రస్తుత ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది చాలా ముఖ్యం. కామెడీ కరెక్ట్‌గా పడితే మిగతా లోపాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ అదే మిస్‌ అయింది. అయితే భావోద్వేగాలను ఇష్టపడే వారికి సినిమా నచ్చే అవకాశం ఉంది.  


ట్యాగ్‌లైన్‌: తండ్రీ కొడుకుల భావోద్వేగాలు.. 

Updated Date - Apr 05 , 2025 | 07:34 PM