Test Movie: టెస్ట్ మూవీ రివ్యూ

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:49 AM

నయనతార, మాధవన్, సిదార్థ్, మీరా జాస్మిన్ కీలక పాత్రలు పోషించిన 'టెస్ట్' మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి దర్శకుడు శశికాంత్ ఈ టెస్ట్ లో పాస్ అయ్యాడో లేదో తెలుసుకుందాం.

మాధవన్ (Madhavan), సిద్ధార్థ్ (Siddharth), నయనతార (Nayanthara), మీరా జాస్మిన్ (Meera Jasmine) నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’ (Test). ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో 4వ తేదీ నుంచి నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్.శశికాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అందుబాటులో ఉంది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ రెండు గంటల 26 నిమిషాల మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.


కథ :

అర్జున్ వెంకట్రామన్ (సిద్ధార్థ్) ఇండియన్ టాప్ క్రికెటర్లలో ఒకడు. అయితే ఫామ్ కోల్పోయిన తనని ఇండియన్ క్రికెట్ బోర్డు రిటైర్ అవ్వాలని కోరింది. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే అర్జున్ ఫెయిల్యూర్ క్రికెటర్ గా రిటైర్ అవటానికి అంగీకరించడు. తన భార్య పద్మ (మీరాజాస్మిన్). వీరికి ఓ కొడుకు. ఇక శరవణన్ (మాధవన్) ఓ సైంటిస్ట్. విదేశాల్లో చదువుకుని వచ్చిన తను వాటర్ తో పని చేసే కార్లను తయారు చేసే ప్రాజెక్ట్ కోసం కృషి చేస్తుంటాడు. స్కూల్ టీచర్ అయిన శరవణన్ భార్య కుముద(నయనతార) కృత్రిమ గర్భధారణ ద్వారా తల్లి కావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ చేసే ధర్మేష్ అగర్వాల్ (వినయ్ వర్మ), అతడిని వెంటాడుతున్న పోలీసులు, శరవణన్ కి అప్పిచ్చిన కుట్టి (ఆడుకాలం మురుగుదాస్) వీరందరి జీవితాలకు ఇండియా – పాకిస్థాన్ మాధ్య జరిగే టెస్ట్ ఓ టెస్ట్ పెడుతుంది. ఆ టెస్ట్ లో ఎవరు పాస్ అయ్యారు!? ఎవరు ఫెయిల్ అయ్యారన్నదే ఈ చిత్రం కథాంశం.


విశ్లేషణ:

కథలోని లైన్ పాతదే అయినా, కథనం ద్వారా ప్రథమార్ధాన్ని ఆసక్తికరంగానే చిత్రీకరించారు దర్శకుడు యస్. శశికాంత్. అయితే ద్వితీయార్ధంలోనే పూర్తిగా గాడి తప్పాడు. దాంతో ఆసక్తికంగా సాగాల్చిన ద్వితీయార్ధం బోరుగా ఆనాస్తికగా సాగింది. ఇక సైంటిస్ట్ శరవరణ్ గా మాధవన్ మరోసారి తన డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర ఔచిత్యాన్ని సరైన పద్ధతిలో డీల్ చేయలేక పోయాడు దర్శకుడు. క్రికెటర్ అర్జున్ గా సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. ఆయన భార్యగా మీరాజాస్మిన్ కి అంతగా నటించే స్కోప్ లేకుండా పోయింది. కుముదగా నటించిన నయనతారకు ఈ తరహా పాత్రలు కొట్టిన పిండే. ఆమె పాత్రను కూడా దర్శకుడు కన్ఫూజింగ్ గానే మలిచాడు. ఇక అర్జున్ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లిరిష్ రాహవ్ ఎమోషన్ ను పండించాడు. చక్కటి స్టార్ కాస్ట్ ను ఎంపిక చేసుకున్న డైరెక్టర్ ఆ పాత్రలను సరైన రీతిలో తీర్చిదిద్దలేక పోయాడు. ఈ స్పోర్డ్స్ డ్రామాలో ఎమోషన్ అంతగా పండలేదు. క్రికెట్ లో ఇండియాను గెలిపించిన ఈ దర్శకరచయిత ఇండియా గర్వించదగ్గ ప్రరాజెక్ట్ ను డిజైన్ చేసిన సైంటిస్ట్ ను గెలిపించటంలో ఫెయిల్ అయ్యాడు. ఇదే సినిమాకు అతి పెద్ద డ్రాబ్యాక్. అదే విధంగా నయనతార కుముదం పాత్రను డీల్ చేసిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. కృత్రిమ గర్భధారణ కోసం ఓ దశలో చెడును ప్రోత్సహించేలా ఆ పాత్రను మలవటం… ఆ తర్వాత అదే పాత్ర ఇంటిలో ఉన్న సైంటిస్ట్ భర్తలోని నైపుణ్యాన్ని గ్రహించక క్రికెటర్ ని ఆరాధిస్తూ భర్తని దూషించటం ఆడియన్స్ కి మింగుడు పడదు.


ఏది ఏమైనా దర్శకుడిగా, రచయితగా ఎస్.శశికాంత్ ఓ అద్భుతమైన అవకాశాన్ని వృథా చేసుకున్నాడనే చెప్పాలి. ఇమేజ్ ఉన్న స్టార్స్ దొరికినపుడు సినిమాను మరింత ఎంగేజింగ్ థ్రిల్లర్గా మలిచి ఉండాల్సింది. దాంతో సినిమా పూర్తియిన తర్వాత కథలో ఎలాంటి పస లేదనే భావన కలుగుతుంది. విరాజ్ సింగ్ గోహిల్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. శక్తిశ్రీ గోపాలన్ నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేసేలా లేదు. తెలుగు డబ్బింగ్ విషయంలో మాత్రం చక్కటి కేర్ తీసుకున్నారు. స్లో నెరేషన్ వల్ల ఎమోషన్ గా కనెక్ట్ కాలేకపోతారు. దీంతో ఈ టెస్ట్ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారనే భావన కలుగుతుంది.

ట్యాగ్ లైన్: టెస్ట్ ఫెయిల్

రేటింగ్: 2.25/5

Updated Date - Apr 05 , 2025 | 11:53 AM