Rajkumar Rao: మొన్న శ్రీకాంత్, నేడు సౌరవ్ గంగూలీ
ABN , Publish Date - Apr 01 , 2025 | 07:36 PM
ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావ్ మరో ఛాలెంజింగ్ రోల్ సిల్వర్ స్క్రీన్ పై చేయబోతున్నారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కు రాజ్ కుమార్ రావ్ పచ్చజెండా ఊపారు.

జాతీయ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావ్ (Rajkumar Rao) కు బయోపిక్స్ లో నటించడం కొత్తేమీ కాదు. 2013లోనే రాజ్ కుమార్ రావ్ 'షహీద్' (Shahid) పేరుతో ఓ బయోపిక్ చేశాడు. లాయర్ షహీద్ ఆజ్మీ పాత్రకు రాజ్ కుమార్ రావ్ వెండితెరపై జీవం పోశాడు. దాంతో ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత 2016లో 'అలీఘర్' (Aligarh) మూవీలో కవి రామచంద్ర సిరాస్ పాత్రను రాజ్ కుమార్ రావ్ పోషించాడు. ఈ రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా మచిలీపట్నంలో జన్మించి, జాతీయ స్థాయిలో పారిశ్రామిక వేత్తగా ఎదిగిన శ్రీకాంత్ బొల్లా (Srikanth Bolla) పాత్రను చేసి మెప్పించాడు రాజ్ కుమార్ రావ్. విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా శ్రీకాంత్ పాత్రకు నూరుశాతం న్యాయం చేకూర్చాడంటూ పలువురు రాజ్ కుమార్ రావ్ ను అభినందించారు. ఈ బయోపిక్ గత యేడాది 'శ్రీకాంత్' పేరుతో వచ్చింది.
ఇప్పుడు తాజాగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav GAnguly) బయోపిక్ కు రాజ్ కుమార్ రావ్ పచ్చ జెండా ఊపాడు. ఈ విషయాన్ని గతంలోనే సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే రాజ్ కుమార్ రావ్ డేట్స్ ను బట్టి ఈ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని ఆయన అన్నారు. సౌరవ్ గంగూలీ వ్యక్తిగత జీవితంతో పాటు క్రికెట్ తో అతనికి ఉన్న అనుబంధాన్ని, బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వైనాన్ని, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లో గంగూలీ పాత్ర గురించి కూడా ఈ మూవీలో చూపించబోతున్నారు. గతంలో రాజ్ కుమార్ రావ్ తో థ్రిల్లర్ మూవీ 'ట్రాప్డ్' ను తెరకెక్కించిన విక్రమాదిత్య మోత్వానే (Vikramaditya Motwane) సౌరవ్ గంగూలీ బయోపిక్ ను రూపొందించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభించి, రెండు నెలలో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. వచ్చే యేడాది ఈ సినిమా జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం రాజ్ కుమార్ రావ్ నటిస్తున్న 'టోస్టర్, భూల్ చుక్ మాఫ్, మాలిక్' చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.
Also Read: Allu Arjun - Trivikram: బన్నీ - త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి