Aamir Khan: లాపతా లేడీస్ మూవీపై నెటిజన్స్ సెటైర్స్

ABN , Publish Date - Apr 02 , 2025 | 06:28 PM

ఆమీర్ ఖాన్ నిర్మించిన 'లాపతా లేడీస్' మరో వివాదంలో చిక్కుకుంది. అరబిక్ షార్ట్ ఫిల్మ్ 'బుర్ఖాసిటీ' నుండి స్ఫూర్తి పొంది ఈ సినిమా తీసినట్టు విమర్శలు వస్తున్నాయి.

ఆమీర్ ఖాన్ (Aamir Khan) మాజీ భార్య కిరణ్‌ రావ్ (Kiron Rao) దర్శకత్వంలో వచ్చిన 'లాపతా లేడీస్' (Laapataa Ladies) మూవీపై మరోసారి వివాదాలు ముసురుకున్నాయి. ఈ సినిమాను భారతదేశం నుండి ఆస్కార్ కు ఆఫీషియల్ ఎంట్రీకి ఎంపిక చేసినప్పుడే చాలామంది విమర్శలు గుప్పించారు. పలు చిత్రాల నుండి స్ఫూర్తి పొందిన ఈ మూవీ తప్పితే మరొకటి సెలక్షన్ కమిటీకి దొరకలేదా? అని అన్నారు. తెలుగులో వచ్చిన 'పట్నం వచ్చిన ప్రతివ్రతలు' మూవీ కూడా ఇదే తరహాలో కొంత మేర సాగుతుందని అన్నవాళ్ళూ ఉన్నారు. అలానే నట దర్శకుడు అనంత్ మహదేవన్ అయితే తన తొలి చిత్రం 'గూంఘట్ కే పత్ ఖోల్' నుండి కాపీ కొట్టారని వాపోయాడు. ఇంకాస్తంత సినిమా పరిజ్ఞానం లోతుగా ఉన్న తెలుగువాళ్ళు ఇది యన్టీఆర్, ఏయన్నార్ నటించిన 'చరణదాసి' సినిమా థీమే కదా! అని పెదవి విరిచారు. విశ్వకవి రవీంధ్రనాథ్‌ ఠాకూర్ రాసిన 'నౌకడుబి' నవల ఆధారంగా 'చరణదాసి' తెరకెక్కింది. ఆ విషయాన్ని వారు టైటిల్స్ కార్డ్ లోనూ తెలిపారు. అయితే 'లాపతా లేడీస్' దర్శకురాలు కిరణ్‌ రావ్ మాత్రం తాను బిప్లాబ్ గోస్వామి రాసిన 'ట్రూ బ్రైడ్స్' ఆధారంగా సినిమా తీసినట్టు తెలిపింది. ఇక బిప్లాబ్ గోస్వామి... షేక్స్ పియర్ 'కామెడీ ఆఫ్ ఎర్రర్స్' నుండి స్ఫూర్తి పొంది ఈ కథ రాసినట్టు తెలిపారు.

చిత్రం ఏమంటే... ఇప్పుడు నెటిజన్స్ 'లాపతా లేడీస్'కు ఇన్ స్పిరేషన్ అరబిక్ షార్ట్ ఫిల్మ్ 'బుర్ఖా సిటీ' (Burqa City) అని చెబుతున్నారు. 2019లో వచ్చిన 19 నిమిషాల ఈ లఘు చిత్రాన్ని చూస్తే... 'లాపతా లేడీస్'కు అదే స్ఫూర్తి అనే విషయం అర్థమౌతుందని అంటున్నారు. బుర్ఖా వేసుకున్న తన భార్యను కాకుండా మరో యువతిని తనతో ఓ యువకుడు పొరపాటున తీసుకెళతాడు. ఆ తర్వాత జరిగిన తప్పును గుర్తించి, పోలీసులను ఆశ్రయిస్తాడు. అయితే... 'లాపతా లేడీస్'లోని పోలీస్ స్టేషన్ సీన్ మొత్తం ఈ షార్ట్ ఫిల్మ్ నుండి ఎత్తివేసిందే అని నెటిజన్స్ అంటున్నారు. కొందరైతే ఆ షార్ట్ ఫిల్మ్ లోని కొన్ని సన్నివేశాలను సైతం పోస్ట్ చేసి... అంత నిర్లజ్జగా కిరణ్‌ రావ్ ఎలా 'బుర్ఖా సిటీ'లోని సీన్స్ ను ఎత్తి వేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే బాలీవుడ్ సొంత స్టఫ్ తో సినిమాలు తీసి చాలా కాలమైందని సెటైర్స్ వేస్తున్నారు.


'బుర్ఖా సిటీ'లో మహిళలు బుర్ఖా వేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులను చూపిస్తే... 'లాపతా లేడీస్'లో గూంఘట్ తో మహిళలు పడిన పాట్లను చూపించారు. ఉత్తర భారతదేశంలోని ఓ సంప్రదాయాన్ని కిరణ్‌ రావ్ తన స్త్రీ వాదానికి చక్కగా ఉపయోగించుకున్నారని అప్పట్లో కొందరు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఇదేరకంగా ఆమె ఇస్లాంలో ఉన్న బుర్ఖా విధానాన్ని కూడా విమర్శిస్తూ సినిమాలు తీయగలదా అని కూడా కొందరు ప్రశ్నించారు. ఏదేమైనా మహిళ సాధికారికతను గుర్తు చేస్తూ, వారి వ్యక్తిత్వాన్ని నిలబెట్టే విధంగా కిరణ్‌ రావ్ సినిమా తీయడంలో తప్పులేదని, కానీ ఇతర సినిమాల నుండి కాపీ కొట్టి తన సొంత సినిమాగా ప్రచారం చేయడమే బాగాలేదని కొందరంటున్నారు. మరి ఈ తాజా విమర్శలపై కిరణ్‌ రావ్, ఆ చిత్ర నిర్మాత ఆమీర్ ఖాన్ స్పందిస్తారో లేదో చూడాలి.

Also Read: Jaat: సారీ చెప్పమంటున్న ఊర్వశీ రౌతేలా!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 02 , 2025 | 06:28 PM