Indian Patriot Actor: తెరపై చెరగని దేశభక్తి సంతకం
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:57 AM
బాలీవుడ్ ఐకాన్, దేశభక్తి ప్రదర్శించిన ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) ముంబైలో కన్నుమూశారు. 1960, 70వ దశకాల్లో దేశభక్తి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన "భరత్‌కుమార్"గా ప్రసిద్ధి చెందారు
బాలీవుడ్ ఐకాన్.. భరత మాత ప్రేమికుడు.. మనోజ్ కుమార్ (87) ఇకలేరు. దేశభక్తి, సామాజిక సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని సినిమాలు తీసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దేశభక్తి ప్రధానాంశంగా ఉండే సినిమాలకు ఆయన ప్రసిద్ధి చెందడంతో ఆయనను ‘భరత్ కుమార్’ అని పిలిచేవారు. ఆయన నటించిన అధిక శాతం సినిమాల్లోనూ ఆయన పేరు భరత్‌కుమారే కావడం గమనార్హం. దేశభక్తి నేపథ్యంలో ఆయన చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. 1960, 70వ దశకాల్లో ఆయన చేసిన సినిమాలు వెండితెరను ఏలాయి.
దిలీప్ కుమార్ స్ఫూర్తితో
1937లో హరికృష్ణ గిరి గోస్వామి పేరుతో పంజాబీ హిందూ కుటుంబంలో అవిభక్త పాకిస్థాన్‌లో జన్మించారు ఆయన. బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మీద ఉన్న అమితమైన అభిమానం ఆయనను సినిమాలవైపు నడిపించింది. ‘షబ్నమ్’ సినిమాలో దిలీప్ కుమార్ పాత్ర పేరు మనోజ్‌కుమార్. ఆ పేరునే తన స్ర్కీన్‌నేమ్‌గా పెట్టుకున్నారు. 1957లో ‘ఫ్యాషన్’ అనే చిత్రంతో నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టారు ఆయన. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. 1961లో విడుదలైన ‘కాంచ్ కీ గుడియా’ చిత్రంలో తొలిసారి లీడ్ రోల్‌లో నటించారు. 1962లో విడుదలైన ‘హరియాలీ ఔర్ రాస్తా’ సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
‘షాహిద్’తో మొదలు
మనోజ్‌కుమార్ దేశభక్తి ప్రధానంగా చేసిన చిత్రాలలో మొదటి చిత్రం ‘షాహిద్’. 1965లో విడుదలైంది. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మన్ననలు పొందింది. ఆ తర్వాత 1967లో విడుదలైన ‘ఉప్‌కార్’ అనే సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో రైతుగా, సైనికుడిగా రెండు పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ‘పురబ్ ఔర్ పశ్చిమ్’, ‘రోటి కపడా మకాన్’, ‘క్రాంతి’ వంటి సందేశాత్మక చిత్రాలతో మరింత స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన చేసిన పలు సినిమాలు ఇతర భాషల్లో రీమేకై ప్రజాదారణ పొందాయి. తెలుగులో టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్ (ఒకే కుటుంబం), కృష్ణ (పాడిపంటలు), శోభన్‌బాబు (జీవన పోరాటం) ఆయన సినిమాలను రీమేక్ చేయడం విశేషం. 1972లో తండ్రీ కొడుకుల అనుబంధం ఆధారంగా తెరకెక్కిన ‘షోర్’ చిత్రం ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో అత్యుత్తమైనదని చాలామంది అభిప్రాయపడతారు. ఆయన నటించిన, దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటిలోనూ ప్రేక్షకులను విశేషంగా అలరించిన హిట్ సాంగ్స్ ఉండడం విశేషం. ‘ఓ కౌన్ థీ’ చిత్రంలోని పాపులర్ మెలోడీ ‘లగ్ జా గలే’ పాటను ఇటీవలే విడుదలైన సల్మాన్‌ఖాన్ ‘సికందర్’లోనూ రీమిక్స్ చేశారు.
బాల్యంలో సినిమా కష్టాలు
అగ్ర శ్రేణి నటుడు, దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మనోజ్‌కుమార్‌కు చలన చిత్ర రంగ ప్రవేశం, గుర్తింపు అంత సులభంగా దక్కలేదు. దేశ విభజన జరిగిన సమయంలో ఎన్నో కష్టాలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు ఆయన. తన కుటుంబంతో కలసి తొమ్మిదేళ్ల వయసులో ఢిల్లీ శివార్లలో శరణార్థ శిబిరాల్లో గడిపారు. ఆ సమయంలో చూసిన సంఘటనలే ఆయనలో బలంగా నాటుకుపోయి ఆ తర్వాత దేశ భక్తి నేపథ్యంలో సినిమాలు చేయడానికి ప్రేరణనిచ్చాయి.
నటుడిగా, దర్శకుడిగా, స్ర్కీన్‌ప్లే రచయితగా ఓ వెలుగు వెలిగిన ఆయన్ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1992లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2015లో దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. సినిమాల నుంచి విరామం తీసుకున్నాక బీజేపీలో చేరిన ఆయన.. ఎటువంటి పదవీ లేకుండానే కొనసాగారు.
తరతరాలకూ ఆదర్శం
మనోజ్‌కుమార్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ‘‘బాలీవుడ్ ఐకాన్ మనోజ్‌కుమార్ మరణం బాధాకరం. దేశభక్తి ప్రధానంగా ఆయన చేసిన సినిమాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని ఎక్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోతాయి’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ‘‘జాతీయ భావాలు గల మహోన్నత వ్యక్తి మనోజ్ కుమార్. దేశ భక్తి నేపథ్యంలో ఆయన చేసిన పలు సినిమాలు ఎంతో స్ఫూర్తిని అందిస్తాయి. ‘ఉప్‌కార్’ సినిమాను ఇప్పుడు చూసినా, ఆనాటి ‘జై జవాన్ జై కిసాన్’ నినాద నేపథ్యాన్ని, ప్రభావాన్ని గుర్తుకుతెస్తాయి’’ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఆయన మృతి బాలీవుడ్‌కు తీరని లోటు అని.. దర్శకులు మధుర్ బండార్కర్, జోయా అక్తర్, వివేక్ అగ్నిహోత్రి, హన్షల్ మెహతా, హీరోలు ఆమిర్ ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవగణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. నేటి ఉదయం ముంబైలో మనోజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.