Kollywood: తమిళ దర్శకులకు ఏమైంది...

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:30 PM

టాప్ తమిళ డైరెక్టర్స్ కు జాతీయ స్థాయిలో చుక్కెదురవుతోంది. జనవరిలో శంకర్ విఫలమైతే... తాజాగా ఎ.ఆర్. మురుగదాస్ కూడా అదే ఫలితాన్ని పొందాడు.

తమిళ దర్శకులంటే ఒకప్పుడు నేషనల్ లెవల్ లో సూపర్ క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్రభ నిదానంగా మసకమారుతోంది. తమిళ సీనియర్ డైరెక్టర్స్ ఒక్కొక్కరూ తమ సత్తాను చాటుకోవడంలో విఫలమౌతున్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'గేమ్ ఛేంజర్' (Game Changer) పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. కానీ ఏ మాత్రం మెప్పించలేకపోయింది. రామ్ చరణ్‌ నటించిన 'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీ మంచి విజయాన్ని అందుకోవడం, శంకర్ డైరెక్షన్ లో చెర్రీ మొదటిసారి నటించడం, దిల్ రాజు దీనిని గ్రాండ్ గా నిర్మించడంతో అందరూ 'గేమ్ ఛేంజర్'పై ఆశలు పెట్టుకున్నారు. కానీ దీనికి ముందు వచ్చిన 'ఇండియన్ -2' (Indian -2) తరహాలోనే ఈ సినిమా కూడా పరాజయం పాలైంది.


ఇక తాజాగా ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన హిందీ సినిమా 'సికందర్' (Sikandar) ది అదే కథ. నిజానికి కొంతకాలంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) సక్సెస్ ట్రాక్ లో లేడు. అలానే ఎ.ఆర్. మురుగదాస్ (AR Murugadoos) కూడా గ్రాండ్ విక్టరీస్ ఏమీ అందుకోలేదు. జయాపజయాలతోనే అతని కెరీర్ సాగుతోంది. కానీ సల్మాన్ ఖాన్ తో మూవీ చేసే ఛాన్స్ దక్కడంతో ఈ సారి ఖచ్చితంగా మురుగదాస్ హిట్ కొడతాని అంతా భావించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉండకపోగా, ఓపెనింగ్స్ ను సైతం పొందలేదు. ఇలా తమిళ దర్శకులు వరుసగా జాతీయ స్థాయిలో ఫేడ్ అవుట్ అయిపోవడం కొందరిని బాధకు గురిచేస్తోంది. అయితే... ఈ లోటును కాస్తంత పూడ్చుతూ ఆ మధ్య దర్శకుడు అట్లీ... షారూఖ్‌ ఖాన్ తో సూపర్ హిట్ మూవీ 'జవాన్' ను తీసి ఘన విజయం అందుకోవడం కాస్తంత ఊరట కలిగించే అంశమే. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వం వహించిన 'ఇండియన్ -3' విడుదల కావాల్సి ఉండగా, ఎ.ఆర్. మురుగదాస్... శివకార్తికేయన్ (Sivakarthikeyan) తో తీసిన 'మదరాసి' (Madharasi) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపకుంటోంది. తాజాగా ఎదురైన చేదు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని ఈ దర్శకులు తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.

Also Read: Tollywood: మూడు నెలల్లో మిశ్రమ స్పందన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 01 , 2025 | 01:30 PM