Devara: సందీప్‌రెడ్డి ఇంటర్వ్యూ.. షాక్‌లో ఎన్టీఆర్‌..

ABN , Publish Date - Sep 15 , 2024 | 05:21 PM

‘సాధారణంగా ఒక హీరో.. అందరిలో ఉన్న ధైర్యాన్ని వెలికి తీసేందుకు నిలబడతాడు. కానీ, ఈ సినిమాలో ధైౖర్యంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న కొంతమందికి భయం రుచి చూపించేందుకు హీరో వస్తాడు.

ఎన్టీఆర్‌ (NTR) హీరోగా నటించిన చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతుంది. తాజాగా బాలీవుడ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె యాక్టింగ్‌, మోమరీ పవర్‌ను ఉద్దేశించి ఎన్టీఆర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె అద్భుతమైన వ్యక్తి అని సందీప్‌ రెడ్డి వంగా చేసిన  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘‘ఇది మీ తొలి తెలుగు చిత్రం కదా. డైలాగ్స్‌ చెప్పడం ఇబ్బందిగా అనిపించిందా?’’ అని జాన్వీని సందీప్‌  ప్రశ్నించగా.. ఎన్టీఆర్‌ అందుకొని.. ‘‘ఆమె అద్భుతమైన టాలెంట్‌ ఉన్న వ్యక్తి. బాలీవుడ్‌ నుంచి వచ్చినప్పటికీ చక్కగా డైలాగ్స్‌ చెప్పారు. నేను షాకయ్యా’’ అని ప్రశంసించారు.

అనంతరం ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘సాధారణంగా ఒక హీరో.. అందరిలో ఉన్న ధైర్యాన్ని వెలికి తీసేందుకు నిలబడతాడు. కానీ, ఈ సినిమాలో ధైౖర్యంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న కొంతమందికి భయం రుచి చూపించేందుకు హీరో వస్తాడు. ఇదొక పూర్తి స్థాయి యాక్షన్‌ డ్రామా. ఫైట్‌ సీక్వెన్స్‌ల కోసం ఎంతో శ్రమించాం. స్టూడియోలో భారీ పూల్‌ సెట్‌ వేశాం. దాదాపు 35 రోజులపాటు కష్టపడి అండర్‌ వాటర్‌లో ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ షూట్‌ చేశాం. ఈ చిత్రానికి అదే హైలైట్‌. 1980, 90ల్లో జరిగిన కథగా దీనిని తీర్చిదిద్దాం. ‘దేవర’ కోసం విభిన్నమైన ప్రపంచాన్ని సృష్టించాం. సినిమా మొదలైన మొదటి 15 నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమై పోతారు. ఇందులో భైర పాత్ర ఎంతో కీలకం. ఆ పాత్రకు సైఫ్‌ అలీఖాన్‌ మాత్రమే న్యాయం చేయగలరని అనిపించింది. ‘ఓంకార’లో ఆయన యాక్టింగ్‌ అద్భుతం. సైఫ్‌ టాలెంట్‌ను ఇప్పటివరకూ ఎవరూ సరిగ్గా ఉపయోగించుకోలేదని నా అభిప్రాయం’’ అని అన్నారు.

Tarak.jpg

దర్శకుడు కొరటాల శివ (Koratala siva) మాట్లాడుతూ.. ‘‘నాకు ప్రతిష్ఠాత్మక చిత్రమిది. ఇప్పటివరకు నేను ఇలాంటి సినిమాను తెరకెక్కించలేదు. కమర్షియల్‌ చిత్రాల్లో భయాన్ని ఒక ప్రతికూల భావోద్వేగంగా చూస్తుంటాం. ప్రతి ఒక్కరికీ భయం అనేది ఉండాలి. కమర్షియల్‌ చిత్రాల్లో హీరోని ధైౖర్యానికి సింబల్‌గా చూస్తుంటాం. కానీ, మా చిత్రంలో అతని భయానికి నిదర్శనంగా చూపించాలనుకున్నా. కథకు అనుగుణంగా దీనిని అద్భుతంగా తీర్చిదిద్దాం’’ అని తెలిపారు.

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు. రెండు భాగాలుగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగం సెప్టెంబర్‌ 27న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.  

Updated Date - Sep 15 , 2024 | 05:28 PM