Bachhala Malli: ‘బచ్చల మల్లి’ ముచ్చట్లు

ABN , Publish Date - Dec 08 , 2024 | 11:09 AM

అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘బచ్చల మల్లి’. ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మీడియాతో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

Bachhala Malli: ‘బచ్చల మల్లి’ ముచ్చట్లు

హీరో అల్లరి నరేష్ తన అప్‌కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు సుబ్బు మంగదేవి విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలను ఆయన మాటల్లోనే వినండి..


కథ, నేపథ్యం ఏంటి?

వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పులు మూర్ఖత్వంతో చేయొద్దనే అంశంతో ఈ కథ చెప్పాం. టీజర్ వేడుకలో చెప్పినట్లు నేను జీవితంలో నా తల్లిని కోల్పోయాను. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదోక చిన్న తప్పు జరుగుతుంటుంది. దయచేసి అదేంటో తెలుసుకోండి. లేదంటే బాధపడటం తప్ప మళ్లీ వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేరు. ఈ విషయాన్నే కథలో చాలా నిజాయతీగా చెప్పాను.


హీరో క్యారెక్టర్

ఈ చిత్రంలో హీరో పాత్ర మూర్ఖత్వం హద్దులు దాటేసిన పాత్రలా ఉంటుంది. నిజానికి అందరిలోనూ ఓ మూర్ఖుడు ఉంటాడు కానీ, తనలో మోతాదు మరింత ఎక్కువ. దీన్ని తెలియజేయడానికే టీజర్ లో పిల్లల చందాల బాక్సు ఎత్తుకెళ్లే సీన్ చూపించాం. తను అలా ఎత్తుకెళ్లి దాన్ని ఏం చేశాడన్నది సినిమాలో చూసినప్పుడు చాలా హై వస్తుంది. బచ్చల మల్లి అనే క్యారెక్టర్ నిజంగా ఉన్నదే. చిన్నప్పుడు ఆ పాత్ర గురించి వినేవాళ్లం. ఊరు గురించి నిలబడిన గొప్ప హీరోయిక్ క్యారెక్టర్ తను. ఆ పాత్ర స్ఫూర్తితోనే 'బచ్చల మల్లి' టైటిల్ పెట్టాం తప్ప ఇది ఆయన కథ కాదు.


పుష్ప ఛాయలు

'నేను 90ల్లో ఊర్లోనే పెరిగాను. అప్పటి మనుషులు ఎలా ప్రవర్తించేవారు. ప్రేమకథలు ఎలా ఉండేవి నాకు తెలుసు. అందుకే ఈ కథను ఆ కాల నేపథ్యంలోనే చెప్పాలనుకున్నా. ఈ చిత్రంలో మంచి భావోద్వేగభరిత ప్రేమకథ ఉంది. అలాగే తండ్రి సెంటిమెంట్ ఉంటుంది. దీంట్లో బచ్చల మల్లి పాత్రకు నరేశ్ పూర్తి న్యాయం చేశారు. ఆయన పాత్రను చాలా మంది పుష్ప పాత్రతో పోలుస్తున్నారు. నిజానికి పుష్ప తొలి భాగంలో హీరోది కూలీ పాత్ర. దీంట్లోని మల్లి ట్రాక్టర్ డ్రైవర్. వీళ్లంతా దాదాపు ఒకే ఛాయలో ఉంటారు. అందుకే గెటప్ విషయంలో పుష్పతో పోలిక వచ్చింది తప్ప మరొకటి కాదు. ఈ సినిమాలో అమృత అయ్యర్ పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. రావు రమేశ్, అచ్యుత్ కుమార్ పాత్రలు కీలకంగా ఉంటాయి. ఇక నా తదుపరి ప్రాజెక్ట్ కోసం ఓ స్టోరీ లైన్ సిద్ధం చేసుకున్నా. బ్రిటిష్ కాలం నాటి కథగా ఉంటుంది. ఈ చిత్ర విడుదల తర్వాత దానిపై దృష్టి పెడతా' అంటూ ముగించారు.

Updated Date - Dec 08 , 2024 | 11:09 AM