Sundaram Master Movie Review: ఇది ఓటిటిలో కూడా చూడటం కష్టమే!

ABN , Publish Date - Feb 23 , 2024 | 02:03 PM

వినోద పాత్రల్లో ఎక్కువగా కనిపించే హర్ష చెముడు కథానాయకుడిగా మొదటిసారి చేసిన సినిమా 'సుందరం మాస్టర్'. కళ్యాణ్ సంతోష్ దర్శకుడు, ప్రముఖ నటుడు రవితేజ నిర్మాత. దివ్య శ్రీపాద కథానాయికగా నటించిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Sundaram Master Movie Review: ఇది ఓటిటిలో కూడా చూడటం కష్టమే!
Sundaram Master movie review

సినిమా: సుందరం మాస్టర్

నటీనటులు: హర్ష చెముడు, దివ్య శ్రీపాద, బాలకృష్ణ, హర్షవర్ధన్, చైతు బాబు, భద్రం, తదితరులు

ఛాయాగ్రహణం: దీపక్ ఎరగెర (Deepak Yaragera)

సంగీతం: శ్రీచరణ్ పాకాల

దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్

నిర్మాతలు: రవితేజ, సుధీర్ కుమార్

విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024

రేటింగ్: 1.5 (one point five)

-- సురేష్ కవిరాయని

ప్రముఖ నటుడు రవితేజ నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్తవాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ, చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇప్పుడు 'సుందరం మాస్టర్' అనే సినిమాతో కళ్యాణ్ సంతోష్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. హాస్య నటుడిగా పలు చిత్రాలలో నటించిన హర్ష చెముడు ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు, దివ్య శ్రీపాద కథానాయకురాలు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Sundaram Master movie review)

sundarammasterreview.jpg

Sundaram Master story కథ:

సుందరం (హర్షవర్ధన్) ఒక ప్రభుత్వ కళాశాలలో సోషల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి కట్నం మీద ఆశ ఎక్కువ, అందుకని ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారా అని పెళ్లి ప్రయత్నాల్లో ఉంటూ ఉంటాడు. ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్ధన్) కి మిరియాల మెట్ట గ్రామం నుండి తమ వూరికి ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిని పంపించమని లేఖ వస్తుంది. మిరియాల మెట్ట అనే గ్రామ ప్రజలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వుంటారు, ఆ గ్రామంలోకి బయట వాళ్ళకి కూడా ప్రవేశం లేదు. కానీ ఆ గ్రామంలో ఒక విలువైన వస్తువు ఎదో ఉందని, ఆ వస్తువుని కనిపెట్టి ఆ గ్రామాన్ని తన నియోజకవర్గంలో కలిపేయాలని ఎమ్మెల్యే సుందరాన్ని కోరతాడు. దానితో తనకి పేరొస్తుందని, సుందరాన్ని డిఈఓ గా ప్రమోషన్ కూడా ఇస్తానని ఎమ్మెల్యే మాట ఇస్తాడు. ప్రొమోషన్ వస్తే కట్నంగా ఇంకా ఎక్కువ డబ్బు రాబట్టవచ్చు అని సుందరం కూడా ఆ గ్రామానికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. సుందరం ఇంగ్లీష్ టీచర్ గా మిరియాల మెట్ట గ్రామంలో అడుగుపెడతాడు. కానీ అతనికి ఆశ్చర్యంగొలిపే విషయం ఏంటంటే, అక్కడ ఆ గ్రామస్థులు అందరూ సుందరం మాస్టర్ కన్నా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ వుంటారు. సుందరంకి ఇంగ్లీష్ సరిగ్గా రాదనీ అతనికే ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఫెయిలైతే ఉరితీత అని చెప్తారు గ్రామస్థులు. మరి ఆ పరీక్షలో సుందరం సఫలం అయ్యాడా, విఫలం అయ్యాడా, ఇంతకీ ఆ వూర్లో వున్నా విలువైన వస్తువు ఏంటి? అది సుందరం కనిపెట్టాడా? అతనికి ప్రమోషన్ వచ్చిందా? ఇంతకీ అతని పెళ్లి సంగతి ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే 'సుందరం మాస్టర్' సినిమా చూడాల్సిందే. (Sundaram Master movie review)

sundarammasterstill.jpg

విశ్లేషణ:

హర్ష చెముడు కథానాయకుడిగా సినిమా అనగానే వినోదాత్మకంగా ఉంటుందని అనుకొని ఈ 'సుందరం మాస్టర్' సినిమాకి వెళితే కనక తీవ్ర నిరాశే ఎదురవుతుంది. దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఈ సినిమాని అటు వినోదాత్మకంగా కానీ, ఇటు ఏదైనా కథాబలం వున్న సినిమాగా కానీ తెరకెక్కించాడా అంటే రెండిటికి మధ్యలో అదీ ఇదీ లేకుండా చూపించాడు. అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో కూడా అది చెప్పలేకపోయాడు. అక్కడక్కడా ఒకటి రెండు వినోదాత్మక సన్నివేశాలు తప్పితే విషయం లేదు, కథ లేదు, భావోద్వేగాలు అసలే లేవు. దర్శకుడు ఆ గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి తమకి ఇంగ్లీష్ టీచర్ కావాలని లేఖ రాసినట్టు చెప్పాడు అంటే వాళ్ళకి బయటి ప్రపంచంతో సంబంధం వుంది అని చెప్పాడు. ఇంకో దగ్గర అసలు వాళ్ళకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని కూడా తెలియదు అని చూపించాడు. కథ సరైనది లేకుండా కేవలం రెండు గంటలకి పైగా ఎదో అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు పెట్టి సినిమా నడిపిద్దాం అని అనుకుంటే నడవకపోవచ్చు. మొదటి సగం ఇంకా కొంచెం నయం కానీ, రెండో సగం అయితే పూర్తిగా నిరాశ పర్చాడు అనే చెప్పాలి. విలువైన వస్తువు చుట్టూ రెండో సగం అంతా నడుస్తుంది కానీ అది అంత ఆసక్తికరంగా చూపించలేకపోయారు. గ్రామంలో ప్రజలని గిరిజనులుగా చూపించడం, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం, అవన్నీ ఎందుకో ప్రేక్షకుడికి అంత ఆసక్తికరంగా లేవనే చెప్పాలి. చివర్లో ఆ క్రికెట్ మ్యాచ్ అదంతా మరింత బోర్ తెప్పిస్తాయి. పూర్తిగా నిరాశ పరిచిందనే చెప్పాలి.

sundarammaster.jpg

నటీనటుల విషయానికి వస్తే హర్ష చెముడు తన పాత్రకి తగిన న్యాయం చేసాడు. అక్కడక్కడా హాస్యం పండించాడు. దివ్య శ్రీపాద కథానాయకురాలిగా బాగుంది, కానీ ఆమెకి పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర ఇచ్చారు. హర్షవర్ధన్ ఎమ్మెల్యేగా, అతని పీఏ గా భద్రం పరవాలేదనిపించారు. ఇక మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ఛాయాగ్రహణం పరవాలేదు, సంగీతం బాగుంది. మాటలు ఆలోచనాపరంగా వున్నాయి, కొంచెం వేదాంత ధోరణిలో కూడా వున్నాయి.

చివరగా, 'సుందరం మాస్టర్' సినిమాని దర్శకుడు కళ్యాణ్ సంతోష్ వైవిధ్యంగా తీసాను అనుకున్నాడు, కానీ ప్రేక్షకుడికి ఎప్పుడు అయిపోతుందా అనేట్టుగా ఉంటుంది. కథ, కథనం మీద కొంచెం దృష్టి పెట్టి ఈ సినిమాని ఒక వినోదాత్మక సినిమాగా తీయవచ్చు కానీ, దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. రెండో సగం పూర్తిగా బోర్ కొట్టించాడు. థియేటర్ కి టికెట్ కొని వెళ్లి చూడాల్సినంత సినిమా అయితే కాదు, తొందరగానే ఓటిటి లోకి వచ్చేస్తుంది. రవితేజ లాంటి సీనియర్ నటుడు ఈ సినిమా ఎలా నమ్మి నిర్మాతగా ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి.

Updated Date - Feb 23 , 2024 | 02:17 PM