Vishwambhara: కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ లో పాట విడుదల
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:42 PM
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'విశ్వంభర' నుండి రాములోరి పాటను హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న 'విశ్వంభర' (Vishwambhara) చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లోని హనుమాన్ టెంపుల్ లో చిత్ర బృందం ఈ పాటను రిలీజ్ చేసింది. అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలలో నిర్మాతలతో పాటు దర్శకుడు వశిష్ఠ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తదితరులు పాల్గొన్నారు.
'రమ.. రామ.. రమ రామ...' అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, ఆస్కార్ విజేత కీరవాణి (Keeravani) స్వరాలు సమకూర్చారు. శంకర్ మహదేవన్, ఐరా ఉడిపి, లిప్సిక ఈ పాటను పాడారు. చిరంజీవితో పాటు రామభక్తులపైన దేవాలయం నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించిన మేకింగ్ షాట్స్ నూ ఈ లిరికల్ వీడియోలో పొందుపరిచారు. 'జై శ్రీరామ్' (Jai Sriraam) అంటూ చిరంజీవి నినదించి, శంఖాన్ని పూరించడంతో ఈ పాట మొదలైంది. శోభీ పౌల్ రాజ్, లలిత శోభీ దీనికి నృత్య రీతులు సమకూర్చారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీరోల్స్ ప్లే చేస్తున్నారు. దీనిని విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.