Oscars Awards New Rules: ఆస్కార్‌ అవార్డులు.. సరికొత్త మార్పులు

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:09 AM

98వ ఆస్కార్‌ వేడుక మార్చి 15, 2026న జరగనుంది. ఈసారి ఓటింగ్‌ విధానంలో కఠిన నిబంధనలు, కొత్తగా ‘అఛీవ్‌మెంట్‌ ఇన్‌ కాస్టింగ్‌’ కేటగిరీ, అలాగే ఏఐ చిత్రాలకు ప్రత్యేక అవార్డులు అందించనున్నారు

వచ్చే ఏడాది జరగనున్న 98వ ఆస్కార్‌ అవార్డు వేడుక వివరాలను కమిటీ ప్రకటించింది. 2026 మార్చి 15న ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే, కొన్ని నూతన నిబంధనలను ప్రవేశపెట్టింది. ఓటింగ్‌ విధానంలో కఠిన నిబంధనలతో మార్పులు చేసింది. ఇకపై సినిమాకు ఓట్‌ చేసేముందు నామినేట్‌ అయిన ప్రతీ చిత్రాన్నీ అకాడమీ సభ్యులు తప్పనిసరిగా వీక్షించాలని పేర్కొంది. ఈ విధానం సరిగ్గా అమలు పరిచేందుకు అకాడమీ సభ్యుల వాచింగ్‌ హిస్టరీపై నిఘా ఉంచనుంది. అలాగే, అఛీవ్‌మెంట్‌ ఇన్‌ కాస్టింగ్‌ అనే కేటగిరినీ ప్రవేశపెట్టడంతో పాటు, ఈ విభాగంలో రెండు దశల్లో ఓటింగ్‌ జరుగుతుందని వెల్లడించింది. ఆస్కార్‌ కోసం పోటీపడుతున్న చిత్రాలను వచ్చే ఏడాది జనవరి 22న ప్రకటించనున్నారు.


ఇకపై ఏఐ చిత్రాలకూ అవార్డులు

ఇటీవల సినిమాల్లో కృతిమ మేథ పరిజ్ఞానాన్ని వాడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది నుంచి ఏఐ కేటగిరీలో తెరకెక్కిన చిత్రాలకూ పురస్కారాలు అందించనున్నారు. అయితే, ఈ సాంకేతికతతో తెరకెక్కిన చిత్రాల వల్ల ఇతర సినిమాల విజయావకాశాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆస్కార్‌ కమిటీ పేర్కొంది. మానవసృజనకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది.

Updated Date - Apr 23 , 2025 | 12:09 AM