Gaddar Film Awards: జూన్ 14న గద్దర్ అవార్డులు
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:12 AM
గద్దర్ తెలుగు ఫిల్మ్ అవార్డులు జూన్ 14న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమా పరిశ్రమకు విశేష సేవలందించిన వారిని గౌరవించేందుకు 15 మంది జ్యూరీ ఆధ్వర్యంలో అవార్డు ఎంపికలు జరుగుతున్నాయి
తెలుగు సినీ రంగంలో అవార్డుల ప్రధానోత్సవానికి రంగం సిద్ధమైంది. జూన్ 14న గద్దర్ తెలుగు ఫిల్మ్ అవార్డులను అందించనున్నట్లు ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో నిర్వహించిన గద్దర్ అవార్డుల జ్యూరీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డులను ఇవ్వడానికి 15మందితో కూడిన జ్యూరీ ని ఏర్పాటుచేశామన్నారు. ఆ జ్యూరీ కమిటీ 2024 ఏడాదిలో వచ్చిన సినిమాలలో కొన్నింటిని ఎంపిక చేసి మే చివరి నాటికి ‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు’’ కమిటీకి పంపుతుందన్నారు. ఆ తరువాత జ్యూరీ పంపిన వివరాలను పరిశీలించి, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్ర మాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కాగా మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన జ్యూరీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గద్దర్ సినిమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నభూతో న భవిష్యత్తు అన్నట్టుగా జరపాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.
ప్రపంచ స్థాయిలో సినిమా అవార్డుల ఫంక్షన్ ఏ విధంగా నిర్వహిస్తారో అందుకు ఏమాత్రం తగ్గకుండా గద్దర్ సినిమా అవార్డుల కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హైదరాబాదులో నిర్వహించబోయే గద్దర్ చలనచిత్ర అవార్డుల ఫంక్షన్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకొనే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు. రాగద్వేషాలకు అతీతంగా అవార్డులకు సినిమాలను ఎంపిక చేయాలని జ్యూరీ సభ్యులకు సూచించారు. సినీ పరిశ్రమకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన వ్యక్తుల పేరిట అవార్డులు ఇస్తున్నామని, ఇవి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి)