Patala Bhairavi: బి.యన్.రెడ్డి తో యన్టీఆర్ ప్రత్యేక బంధం...
ABN , Publish Date - Apr 23 , 2025 | 10:55 AM
ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డికి ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానం. 'పాతాళభైరవి' షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ను చూసి బీఎన్ రెడ్డి 'గ్రీకువీరుడు'లా ఉన్నాడంటూ కితాబిచ్చారు.
'పాతాళభైరవి' (Patala Bhairavi) షూటింగ్ విజయావాహినీ స్టూడియోస్ లోనే జరిగింది. అంతకు ముందు వాహినీ స్టూడియోస్ అధినేతల్లో ఒకరుగా బి.యన్.రెడ్డి (B N Reddy) ఉన్నారు. ఆయన సొంత తమ్ముడే విజయా అధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి (B. Nagi Reddy). అందువల్ల విజయా వాహినీ స్టూడియోస్ లో జరిగే షూటింగ్స్ ను బి.యన్.రెడ్డి కూడా చూస్తూ ఉండేవారు. విజయా వారి తొలి చిత్రం 'షావుకారు'లో యన్టీఆర్ నటించినప్పుడే ఇంత అందమైన నటుడిని తెలుగు చిత్రసీమ ఇప్పటి దాకా చూడలేదని బి.యన్.రెడ్డి భావించారు. తరువాత 'పాతాళభైరవి' షూటింగ్ సమయంలో యన్టీఆర్ ఠీవి, శరీర సౌష్టవం చూశాక ఇతను అచ్చు 'గ్రీకువీరుడు'లా ఉన్నారని బి.యన్.రెడ్డి కితాబునిచ్చారు. అలా తొలిసారి యన్టీఆర్ ను 'గ్రీకువీరుడు' అని బి.యన్. అన్నారు. 'మల్లీశ్వరి' షూటింగ్ సమయంలోనూ రామారావును బి.యన్. అలాగే పిలిచేవారు. అందులో 'మల్లీశ్వరి' పాత్రలో జీవించిన భానుమతి (Bhanumathi) కూడా సరదాకు యన్టీఆర్ ను 'ఏమండీ... గ్రీకు వీరుడుగారూ...' అంటూ ఉండేవారు.
భానుమతి తొలిసారి దర్శకత్వం వహిస్తూ నిర్మించి నటించిన 'చండీరాణి'లో హీరో కిశోర్ పాత్ర కోసం యన్టీఆర్ నే ఎంపిక చేసుకున్నారు. బి.యన్.రెడ్డి 'గ్రీకువీరుడు' అని ముద్ర వేసిన యన్టీఆర్ ను భానుమతి తన హీరోగా ఎంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశమయింది. అందుకు భానుమతి "నా హీరో గ్రీకువీరుడులా ఉండాలి. అందుకే యన్టీఆర్ ను ఎంచుకున్నాం" అని చెప్పారు. నిజానికి యన్టీఆర్ ను వ్యక్తిగతంగా తీర్చిదిద్ది, చాలా విషయాలు నేర్పింది బి.యన్.రెడ్డి. అంతకు ముందు బి.యన్.రెడ్డి సన్నిహితులను 'బ్రదర్' అంటూ సంబోధించేవారు. అదే తరువాత యన్టీఆర్ కూ అలవాటయింది. ఇక యన్టీఆర్ కు కారాకిల్లీ అలవాటుండేది. దానిని మాన్పించింది బి.యన్.రెడ్డినే. చిన్నవారినైనా 'మీరూ' అంటూ పిలవాలని నేర్పిందీ ఆయనే. ఇన్ని విధాలుగా తన 'మల్లీశ్వరి' నాగరాజును తీర్చిదిద్దారు బి.యన్. ఆయన పిలవడం వల్లే యన్టీఆర్ ను చాలామంది 'గ్రీకువీరుడూ...' అంటూ పిలిచేవారు.
బి.యన్.రెడ్డి మాటలనే స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు డి.యోగానంద్ (D.Yoganand) గ్రీకువీరుని గెటప్ లోనే యన్టీఆర్ ను చూపించాలని భావించారు. ఆయన అభిలాష యన్టీఆర్ సొంత సినిమా 'జయసింహ'తో తీరింది. అందులో యన్టీఆర్ కాస్ట్యూమ్స్ ను గ్రీకువీరుల దుస్తుల్లాగే రూపొందించి తీశారు. ఆ సినిమా చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమవుతుంది. అందులో యన్టీఆర్, ఓ స్టంట్ మేన్ తో కలసి చేసిన రియల్ స్వార్డ్ పైట్ గురించి అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు.
Also Read: Nani: పహల్గామ్ లోనే ఇరవై రోజులు హిట్ -3 షూటింగ్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి