Lucky Bhaskar Review: దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:02 PM

లక్కీ భాస్కర్‌’ ట్రైలర్‌ కథ, హీరో క్యారెక్టర్‌ ఏంటనేది చెప్పేసింది. ట్రైలర్‌తో సినిమాకు రెట్టింపు అంచనాలు పెరిగాయి. మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టి పడేసిన దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్‌’గా దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

సినిమా రివ్యూ: లక్కీ భాస్కర్‌
విడుదల తేది: 31–10–2024
నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి దీక్షిత్‌, రాంకీ, రాంకీ, సర్వదమన్‌ డి. బెనర్జీ, సచిన్‌ ఖేడ్కర్‌, శివన్నారాయణ, సుధ, గాయత్రి భార్గవి, హైపర్‌ ఆది, ప్రభాస్‌ శ్రీను. రాజ్‌కుమార్‌ కసిరెడ్డి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: నిమిష్‌ రవి
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకుడు: వెంకీ అట్లూరి

లక్కీ భాస్కర్‌’ ట్రైలర్‌ కథ, హీరో క్యారెక్టర్‌ ఏంటనేది చెప్పేసింది. ట్రైలర్‌తో సినిమాకు రెట్టింపు అంచనాలు పెరిగాయి. మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టి పడేసిన దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్‌’గా దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. క్యారెక్టర్‌, కథ విషయంలో సెలెక్టివ్‌గా ఉండే ఆయన భాస్కర్‌గా మెప్పించాడా? నిర్మాత నాగవంశీ విసిరిన సవాళ్లు ఏమేరకు నిజం? లవ్‌స్టోరీలతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి బ్యాంక్‌ స్కామ్‌ థ్రిల్లర్‌ని తెరపై ఎలా ఆవిష్కరించాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ:
1990ల సమయం అది. భాస్కర్‌ కుమార్‌.. ముంబై మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. మఽధ్యతరగతి కుటుంబం, చాలిచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. వస్తుందనుకున్న ప్రమోషన్‌ చేజారడంతో రూపాయి పెడితే రెండు రూపాయలు వచ్చే మార్గాలను ఎంచుకుంటాడు. తదుపరి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా ప్రమోట్‌ అవుతాడు. మగధ బ్యాంక్‌లో ఆ జరిగిన స్కామ్‌ విచారణలో భాగంగా భాస్కర్‌ వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ చూసి అధికారులు షాక్‌ అవుతారు. నెలకు రూ. 19,500 జీతం తీసుకునే ఉద్యోగి అకౌంట్‌లో రూ.వంద కోట్లు వుంటాయి. అవి ఎలా వచ్చాయి. మగధ బ్యాంక్‌లో జరిగిన స్కామ్‌ ఏంటి? ఈ స్కామ్‌కి హర్ష్‌ మెహ్రాకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి స్కామ్‌ నుంచి భాస్కర్‌ గట్టెక్కాడా? అన్నది కథ.

02.jpg
విశ్లేషణ:
హర్ష మెహ్రా, అతను చేసిన క్రైమ్‌ని చెబుతూ కథ మొదలైంది. అక్కడి నుంచి మగధ బ్యాంక్‌లో ఆరు వేల జీతానికి పని చేసి క్యాషియర్‌ భాస్కర్‌ కుటుంబంలోకి కథ షిప్ట్‌ అవుతుంది. భాస్కర్‌ సంపాదించే చాలి చాలని జీతం, ఇంటి చుట్టూ అప్పుల గోల, ఉన్నదానితో అడ్జస్‌ అయిపోయే భార్య సుమతి (మీనాక్షి), స్నేహితులు హేళన చేస్తే బయట పడకుండా తట్టుకునే కొడుకు కార్తిక్‌ నేపధ్యంలో వచ్చే సీన్స్‌ హృదయాన్ని హత్తుకుంటాయి. సుమతి పుట్టింట ఎదురయ్యే, అవమానం, ఏడాదికి ఒకటే టీషర్టు వాడే కార్తిక్‌, వడాపావు తినడానికి సరిపడా డబ్బులు లేని భాస్కర్‌ జేబు, ఆశపెట్టి దెబ్బకొట్టిన ప్రమోషన్‌.. ఇవన్నీ చూశాక భాస్కర్‌ ఏదో ఒకటి చేసి గెలిస్తే బావుంటుంది అనే ఫీలింగ్‌ ఆడియన్‌కి కలిగేలా చేశారు. అక్కడి నుంచి బ్యాంక్‌ సొమ్ముతో అంథోని (రాంకీ) భాస్కర్‌, అతని ఫ్రెండ్‌ సాంబ (కసిరెడ్డి) చేేస బిజినెస్‌ చేయడం ఆసక్తికరంగా సాగింది. భాస్కర్‌ ప్రాణం మీదకు వచ్చిన ప్రతిసారీ అతని ఏం జరగకూడదు అనే భావన కలిగింది. ఈ నేపథ్యంలో ఫారిన్‌ కార్లు, చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీస్‌ హంగామా సీక్వెన్స్‌ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. సోసోగా సాగాయి. తదుపరి బ్యాంక్‌లో జరిగిన విచారణ, భాస్కర్‌ డబ్బు మార్చిన సీన్‌ చాలా ఎగ్జైట్‌ చేసేలా ఉంది. బ్యాంక్‌లో సూట్‌కేస్‌, అందులో పది లక్షలు, మేనేజర్‌కి  దొరికిపోతాడేమో అనే ఉత్కంఠను కలిగించాడు దర్శకుడు. వందకోట్ల బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ సన్నివేశం సెకెండాఫ్‌లో ఆసక్తి కలిగించింది. స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా కథ, స్కామ్‌ 1992 సిరీస్‌ గురించి తెలిసిన వారికి ఈ చిత్రం సెకెండాఫ్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది. భాస్కర్‌ అడ్డదారుల్లో డబ్బు సంపాదించే సన్నివేశాలు, డబ్డుతో వచ్చే సమస్యలు. తద్వారా తనలో వచ్చే మార్పును ఆసక్తికరంగా చూపించారు. సాధారణ వ్యక్తులు భారీ బట్టల షాఫు, బంగారం దుకాణంలో వెళ్లే చిన్న చూపు చూడటం, వారి అహంకారాన్ని హరించేలా చేసే సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ుఇండియా వస్తువు కావాలంటే డబ్బు కావాలి, రెస్పెక్ట్‌ కావాలంటే ఒంటి మీద డబ్బు ఉండాలి’ అన్న డైలాగ్‌లు ఆ సీన్‌కు మరింత ఎలివేట్‌ చేశాయి. ఇందులో భాస్కర్‌ ఆడిందంతా జూదమే. జూదంలో ఎంత గెలిచామన్నది కాదు ఎప్పుడు ఆపామన్నదే ముఖ్యం. ఆ విషయంలో భాస్కర్‌తో దర్శకుడు తెలివైన ఆట ఆడించాడు. జూదంతో సంపాదించి తన ఖాతాలో ఉన్న వంద కోట్లని వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది భాస్కర్‌ నుంచి పోకుండా ఉంటే బావుండును అనిపించింది. అదే ఆ పాత్ర సక్సెస్‌కి కారణం. భాస్కర్‌ తండ్రి సలహా సూచనలతో అతను వేసిన ప్రతి అడుగు ఆకట్టుకుంది. ఫైనల్‌గా బ్యాంక్‌లో డబ్బు డ్రా చేసి, అకౌంట్‌ డీ యాక్టివేట్‌ చేసి, విదేశాలకు వెళ్లిపోయే కైమాక్స్‌ సూపర్‌ అని చెప్పొచ్చు.


నటీనటులు, సాంకేతిక నిపుణులు:
దుల్కర్‌ సల్మాన్‌ ఎంచుకునే ప్రతి పాత్ర వైవిధ్యంగానే ఉంటుంది. సెలక్టివ్‌గా వెళ్లే అతనికి భాస్కర్‌ పాత్ర కూడా ఒక ప్లస్సే. ఆ పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. సన్నివేశాన్ని తగ్గట్టు అభినయించారు. ఎక్కడా అతి అనిపించలేదు. బ్యాంక్‌లో మేనేజర్‌ కాళ్ళ మీద పడ్డ సన్నివేశం నుంచి తండ్రి మాట విని తన దారి మార్చుకున్న సన్నివేశం, భార్య దగ్గర తగ్గే సీన్‌లో మెప్పించాడు. ఇప్పటి దాకా గ్లామర్‌ పాత్రలతో అలరించిన మీనాక్షి ఇందులో హోమ్లీగా, బిడ్డకు తల్లిగా యాక్ట్‌ చేయించింది. నిజంగానే ఆమె చెప్పినట్లు సుమతి పాత్ర ఆమె కెరీర్‌లో గుర్తుంచుకునేదే. కొడుకు క్యారెక్టర్‌ రిత్విక్‌ కూడా చక్కగా చేశాడు. బర్త్‌డే పార్టీ తర్వాత రిత్విక్‌ చెప్పిన మాటలు హత్తుకున్నాయి. రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి కూడా భిన్నమైన పాత్రే చేశాడు. రాంకీ పాజిటివ్‌ పాత్ర పోషించారు. నటనలో ఆయన అనుభవం కనిపించింది. సచిన్‌ కేడ్కర్‌, సాయి కుమార్‌, హైపర్‌ ఆది, ప్రభాస్‌ శ్రీను, భార్గవి పాత్రలు కథకు ఉపయోగపడ్డాయి. పరిధిలో నటించారు. ఇక సాంకేతి విభాగం సినిమాకు ప్లస్‌ అయింది. జీవి పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. స్కామ్‌లో భాస్కర్‌ దొరికిపోతాడేమో అనిపించిన ప్రతిసారి ఆర్‌ఆర్‌తో ఆకట్టుకున్నాడు జీవి. నిమిష్‌ రవి కెమెరా వర్క్‌ ప్లజెంట్‌గా వుంది. 1990 ముంబైని చూపించడంలో ఆర్డ్‌ డైరెక్టర్‌ పనితీరు కనిపించింది. ఎడిటింగ్‌ కూడా షార్ప్‌గా ఉంది. ఎక్కడ విసుగు పుట్టలేదు. కథను ముందు, వెనక్కి తీసుకెళ్లిన సందర్భంలో సీన్‌ టు సీన్‌ లింకింగ్‌ బావుంది. నిర్మాణ విలువలు బ్యానర్‌కు తగ్గట్టే ఉన్నాయి.

01.jpg

ఆకట్టుకున్న  డైలాగ్‌లు..
జూదంలో ఎంత గెలిచారన్నది కాదు ఎప్పుడు ఆపామన్నదే ముఖ్యం.
ఒక రోజులో అరగంట నాకు నచ్చినట్లు గడవలేదని దాని కోసం సంవత్సరం అంతా బాధపడలేను..
‘వేగంగా వచ్చే బండి.. డబ్బు ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పడేస్తాయి’’ ఇలా కథకు తగినట్లు డైలాగ్‌లు రాసుకున్నారు. దర్శకుడు మాత్రం తను రాసుకున్న కథను సున్నితంగా డీల్‌ చేశాడు. బ్యాంక్‌ స్కామ్‌లను చాలా సింపుల్‌గా చెప్పాడు. ఒక పాత్ర తెరపై కనిపిస్తే.. ఆ పాత్రలో  ప్రేక్షకుడు లీనమైపోవడం, యాంటీ హీరో క్యారెక్టర్‌ కూడా గెలవాలని ప్రేక్షకులు కోరుకుంటే అదే సక్సెస్‌. ఈ సినిమాలో దర్శకుడు అది పూర్తిస్థాయిలో మెయిన్‌టెన్‌ చేశాడు. స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా కథ, స్కామ్‌ 1992 సిరీస్‌ చూశాం.. ఇదేం కొత్త కథ కాదు అనుకున్నవాళ్లను పక్కన పెడితే.. ఈ దీపావళికి ప్రేక్షకుల చేత తారాజువ్వలు ఎగరేయించే సినిమా ఇది. నిజంగానే ఈ భాస్కర్‌ లక్కీ.

ట్యాగ్‌ లైన్‌: దీపావళికి భాస్కర్‌ ఇచ్చిన బహుమతి

Updated Date - Oct 31 , 2024 | 02:56 PM