Rules Ranjann movie review: కిరణ్ అబ్బవరం సినిమా ఎలావుందో తెలుసా...
ABN , First Publish Date - 2023-10-06T17:29:56+05:30 IST
కిరణ్ అబ్బవరం సినిమా 'రూల్స్ రంజన్' విడుదలైంది. జ్యోతి రత్నం దీనికి దర్శకుడు, నేహా శెట్టి కథానాయిక. ఈరోజు విడుదలైన అరడజను సినిమాలలో ఇది ఒకటి. ఈ సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: రూల్స్ రంజన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం (KiranAbbavaram), నేహా శెట్టి (NehaShetty), మెహర్ చాహల్, గోపరాజు రమణ (GoparajuRamana), వెన్నెల కిషోర్ (VennelaKishore), మకరంద్ దేశ్ పాండే, వైవా హర్ష, సుదర్శన్, హైపర్ ఆది (HyperAdi), సుబ్బరాజు, అభిమన్యు సింగ్, అజయ్ తదితరులు
ఛాయాగ్రహణం: ఎంఎస్ దులీప్ కుమార్
సంగీతం: అమ్రీష్
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ (JyothiRatnam)
నిర్మాతలు: దివ్యాంగ్ లావనియా, మురళీ కృష్ణ వేమూరి
రేటింగ్: 1 (ఒకటి)
-- సురేష్ కవిరాయని
ఈ శుక్రవారం సుమారు అరా డజనుకు పైగా చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్' ఒకటి. దీనికి ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకుడు. చాలా కాలం తరువాత అంటే గోపీచంద్ (Gopichand) తో 'ఆక్సిజన్' #Oxygen సినిమా తరువాత ఒక తెలుగు సినిమా చెయ్యడం ఇదే. ఇందులో నేహా శెట్టి కథానాయిక. ఈ సినిమాలో 'సమ్మోహనుడా...' పాట ఈ సినిమా విడుదలకి ముందు చాలా పాపులర్ అయింది. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Rules Ranjann story కథ:
తిరుపతికి చెందిన మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ఇంజనీరింగ్ పూర్తి చేసి కాలేజ్ క్యాంపస్ లో ఇంటర్వ్యూ కి వెళ్లి సెలక్ట్ అయి ముంబైలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు. తనకి హిందీ రాకపోవడం వలన, ఆ కంపెనీలో తోటి ఉద్యోగులు రంజన్ ని తక్కువగా చూస్తూ, తమ పనులకు వాడుకుంటూ ఉంటారు. అప్పుడు రంజన్ అలెక్సా సాయంతో హిందీ నేర్చుకోవటమే కాకుండా, ఆఫీస్ లో తోటి సహచరులు తన గురించి ఏమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకుంటాడు. #RulesRanjannReview అలా హిందీ నేర్చుకొని ఆ కంపెనీని ఒకసారి పెద్ద ప్రమాదం నుండి బయట పడెయ్యటమే కాకుండా, అప్పటి నుండి ఆ కంపెనీలో కొన్ని రూల్స్ పెడతాడు. మిగతా ఉద్యోగులు అందరినీ ఆ రూల్స్ ప్రకారం నడుచుకోవాలని చెప్తాడు. ఒంటరిగా వున్న రంజన్ నాలుగు సంవత్సరాల తరువాత ఒకసారి తన కాలేజీ క్రష్ సన (నేహా శెట్టి) ని ముంబై లో చూస్తాడు. కాలేజీలో వున్నప్పుడు సనని రంజన్ ప్రేమిస్తాడు, కానీ అప్పుడు కొన్ని కారణాలవలన చెప్పలేకపోతాడు . ఇప్పుడు సన ముంబై జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూ కి రావటంతో, రంజన్ ఆమెతో ఆరోజు అంతా ఉంటాడు. ఆ తర్వాత ఆమె తిరుపతి వెళ్ళిపోతుంది. కానీ తన మొబైల్ లో ఫోటోలు చూసాక రంజన్ కి ఆమె కూడా తనని ప్రేమిస్తోందని అర్థం అయి, ఆమెని కలవాలని లీవ్ పెట్టి తిరుపతికి బయలుదేరతాడు. ఇంతకీ తిరుపతిలో ఆమెని కలిశాడా, ఆమెకి తన ప్రేమని వెల్లడించాడా, పెళ్లిచేసుకున్నాడా? ఇందులో కామేష్ (వెన్నెల కిషోర్) ఎటువంటి పాత్ర పోషించాడు, సన అన్నయ్య (సుబ్బరాజు) ఏమన్నాడు, రంజన్ స్నేహితులు అతనికి సహాయం చేశారా, చెడగొట్టారా? ఇవన్నీ తెలియాలంటే 'రూల్స్ రంజన్' చూడండి. #RulesRanjannReview
విశ్లేషణ:
ఎఎం రత్నం కుమారుడు జ్యోతి రత్నం కొంత గ్యాప్ తరువాత ఒక తెలుగు సినిమా చేస్తున్నప్పుడు కథలో పట్టు వుందా లేదా అని ఒకటికి పదిసార్లు చూసుకోవాలి. ఎందుకంటే సుమారు ఆరు సంవత్సరాల తరువాత సినిమా చేస్తున్నాడు అంటే, ఆమాత్రం శ్రద్ధ అవసరం కదా. కానీ ఈ 'రూల్స్ రంజన్' #RulesRanjannReview సినిమాకొచ్చేసరికి అటువంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోలేనట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రొటీన్ కథ కన్నా అర్ధానంగా వుంది. రొమాంటిక్ కథా, లేక రొమాంటిక్ కామెడీ కథా, అసలు కథ ఏంటి ఇందులో పాత్రలు ఏంటి, లాజిక్ ఉందా లేదా ఇవేమీ కనపడదు. రంజన్ అనేవాడు ముంబై లో జాయిన్ అవుతాడు, హిందీ రాదు, మిగతావాళ్ళు అతన్ని ఆడుకుంటారు, వీటితోటే సగం సినిమా అయిపోతుంది. ఇందులో కథ ఏమీ ఉండదు. వెన్నెల కిషోర్ చేత కామేష్ అనే పాత్ర కూడా రొటీన్, ఎదో కామెడీ కోసం పెట్టినట్టుగా పెట్టారు, కానీ పండలేదు. రంజన్ కి నేహా శెట్టి కలుస్తుంది, పోనీ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా బలమైన కెమిస్ట్రీ, భావోద్వేగాలు ఉన్నాయా అంటే అవీ లేవు.
ఆ తరువాత కథ తిరుపతి వెళుతుంది. అక్కడ రంజన్ స్నేహితులతో పోనీ ఏమైనా కామెడీ చేయిపించాడా అంటే అదీ లేదు. అక్కడ కూడా ఎటువంటి సంఘర్షణ, భావోద్వేగాలు లేవు. నాయికా, నాయకుల మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. కథ లేదు, కథనం బాగోలేదు, కామెడీ పండలేదు, ఒక్క పాట 'సమ్మోహనుడా...' అనేది విడుదలకి ముందు హిట్ అయింది, అంతే అదొక్కటి బాగుంది. క్లైమాక్స్ గందరగోళం అయింది. #RulesRanjannReview ఈ సినిమా గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎఎం రత్నం లాంటి సీనియర్ నిర్మాత, దర్శకుడు, అతను రైటర్ కూడాను, అతనికి చూపిస్తే తప్పొప్పులు చెప్పి కరెక్టు చేయించేవాడేమో. సినిమాలో ఎటువంటి దమ్ము లేదు, మొదటి నుండి చివరి వరకు అన్నీ బోర్ సన్నివేశాలే. హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష నుండి పెద్దగా కామెడీ రాదు. సినిమా అంత రొటీన్ గా, సాగదీసినట్టుగా, ముందు ఎటువంటి సన్నివేశాలు వుంటాయో తెలిసిపోతూనే ఉంటుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం నటనలో ఏమాత్రం పరిణితి కనిపించదు. పేపర్ మీద చదివిన డైలాగ్స్ కంఠస్థ పెట్టి కెమెరా ముందు చదివినట్టుగా ఉంటుంది. మొహం లో ఒక్క భావోద్వేగం కూడా కనపడదు. సంఘర్షణ అనేది లేదు. అతను కనీసం ఒక మూమెంట్ కూడా ఇవ్వకుండా అలా నిలబడి చదివేస్తాడు డైలాగ్స్. ఈ సినిమా నుండి నేర్చుకుంటాడని ఆశిద్దాం. నేహా శెట్టి అందంగా వుంది కానీ ఆమె పాత్రకి సరైన బలం లేదు. కేవలం పాటలు కోసమే వున్నట్టుగా వుంది. #RulesRanjannReview వెన్నెల కిషోర్ కామెడీ రొటీన్ అయిపొయింది, ప్రతి సినిమాలోనూ అదే కామెడీ, మొహం మొత్తేస్తోంది అతన్ని అన్ని సినిమాలలో ఒకేలా చూస్తుంటే. అక్కడక్కడా కొన్ని బాగున్నాయి. మిగతా వాళ్ళందరూ వారి పాత్రల పరిధి మేరకు చేశారు. సంగీతం పరవాలేదు, ఆ పైన చెప్పిన పాట బాగుంది. ఛాయాగ్రహణం అంతంత మాత్రమే. మాటలు కూడా.
చివరగా, కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్' మామూలు రంజన్ గానే ఉంటుంది. దర్శకుడు జ్యోతి రత్నం కొత్త కథను కాకుండా, కనీసం రొటీన్ కథని కూడా సరిగ్గా చూపించలేకపోయాడు. ఈ సినిమా అన్ని విభాగాల్లోనూ పెద్ద ఫెయిల్యూర్. తొందరగానే ఓటిటి లోకి వచ్చేస్తుంది. దర్శకుడు న్యూమరాలజీ ప్రకారం పేర్లు మారుస్తూ వున్నాడు, జ్యోతి రత్నం, రత్నం కృష్ణ, రూల్స్ రంజన్ ఆంగ్ల టైటిల్ లో ఒక ఎన్ ఎక్కువ పెట్టాడు, అయినా ఫలితం లేదు.